3, డిసెంబర్ 2012, సోమవారం

భారతీ కటాక్షము

భారతీ కటాక్ష లబ్ధ కవిత్వ యోగము

నిలిచితి భక్తి భావమున నేను శుభోదయ వేళ భారతిన్
దలచి నమస్కరించుచును తద్విభవమ్ములు మన్మనమ్ములో
నలరుచు దర్శనంబొసగ హర్ష పయోనిధిపైని దేలుచున్
గొలుచుచు మానసార్చన నిగూఢ విధానమునందు తత్కృపా
ఫలముగ నాదు డెందమున భావ పరంపర లుప్పతిల్లుచున్
గలగల పారు నేరువలె క్రన్నన నాదు ముఖమ్మునుండి వే
వెలుగుల జిమ్ముచున్ దగు వివేక వికాసముతోడ దివ్య సూ
క్తుల కనురూప వైభవముతో రసపుష్టిని సంతరించుచున్
వెలువడె స్తోత్రరాజములు పెక్కగు ఛందములందు పద్య రా
శులు మది వేడ్కగూర్చు పలు సొంపులు నింపులు నింపుచున్ బళా!
లలిత పదప్రశస్తి, సరళంబగు శైలి దనర్చు చంపకో
త్పలముల మాలికల్, ద్విపద, పాదప, స్రగ్ధర, సీస, కంద, గీ
తులు మొదలైన రీతులును తోటక, పృథ్వి, సుగంధు లొప్పుగా
పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమిచెప్పుదున్?
మలచితి కావ్య రత్నముగ మంచి ముహూర్తమునన్ సరస్వతీ
లలిత పదాబ్జ సన్నిధి నలంకరణమ్ముగ జేసి మ్రొక్కితిన్
బులకితమయ్యె నా తనువు పొంగెను డెందము సంతసమ్ముతో
నలరె రసజ్ఞులౌ బుధులు, నాప్తులు గూర్చ ప్రశంస లొప్పుగా
దలచుచు మాటిమాటికినితల్లి యనుగ్రహ వైభవమ్ము ని
స్తుల బహు యోగదాయియని చొక్కి రచించితి దివ్య లీలలన్

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

7 కామెంట్‌లు:

 1. అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి సరస్వతీ స్తుతి అత్యద్భుతము. సరస్వతీ దేవి ఆయన జిహ్వాగ్రముపై సదా నాట్యము సల్పుతుందని మనకు సుస్పష్టము ! ఇంతటి కవిపుంగవుని యాశీర్వచనముల భాగ్యత కలిగిన మన మదృష్ట వంతులము.వారికి మరో పర్యాయము సాష్టాంగ ప్రణామములు !

  రిప్లయితొలగించండి
 2. శారద కరుణను పొందిన
  మీరలు బహు ధన్యులయ్య మేదిని లోనన్
  తీరుగ నిలచెడి వవియే
  మీరిన సంపదలు కావు మెచ్చిన కృతులే.

  రిప్లయితొలగించండి
 3. జ్ఞాన వివేక సంభృత ప్రకాశ ముఖాబ్జుని, సద్వరేణ్య నే
  మాని కవీంద్రు నెన్నుకొని, మాన్యతఁ గొల్పుచు వాఙ్నిధాన శ్రీ
  వాణి మహత్ప్రసన్నతను భవ్య మనోజ్ఞ కవిత్వ తత్వ సత్
  జ్ఞానమొసంగి యుండు.కవి గ్రామణి సన్యసి రావు ధన్యులౌన్.

  రిప్లయితొలగించండి


 4. అల యలసానివారి యటులద్భుతరీతిని పద్యరత్నమా
  లల, విలసత్కళా పరిమళమ్ములనద్ది,యలంకరించి, స
  ల్లలితమనోజ్ఞ కావ్యము వెలార్చితిరయ్య సరస్వతీ కృపన్
  పలికినపల్కులన్నియును పద్యములైనవి యేమి చెప్పుదున్
  అలరితిమెల్లవారలము,నందుకొనుండి మదీయ సంస్తుతిన్.
  బంగరుకి తావి అబ్బినట్లని నా భావము.శ్రీ నేమానివారికి నా అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. డా. కమనీయము గారూ - నమస్కారములు. ధన్యోస్మి.

  కమనీయ భావమును నను
  పమ శైలియు లలిత ధార పరగెడు మీ ప
  ద్యమున గల శుభాకాంక్షలు
  ప్రమదమ్మును గూర్చె సుకవివర్యా! ప్రణతుల్

  స్వస్తి.
  నేమాని రామజోగి సన్యాసి రావు

  రిప్లయితొలగించండి
 6. నమస్కారములు
  " మహత్వ , కవిత్వ , పటుత్వ , సంపదల్ " అని పోతన గారన్నట్టు మన శంకరాభరణము పండితుల సంపదల నిధి .ఎంత చెప్పినా కొంత మిగిలి పోతూనే ఉంటుంది. ఈ సరస్వతీ పుత్రులకు సాస్టాంగ ప్రణామములు.

  రిప్లయితొలగించండి