4, డిసెంబర్ 2012, మంగళవారం

పద్య రచన - 180

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

 1. చిరుతలు రెండు, వాని దరి జేరె నమాయకమైన లేడి, య
  చ్చెరువగు జూచు వారలకు, చిత్రము కాదది, మౌని లోకమే
  దరి నిరతంబు జేయుదురొ ధ్యానముఖాదిగ యోగరీతు, లా
  పరిసరముల్ పవిత్రమగు భావములే వెదజల్లుచుండు, నం
  దరి యెదలందు నుండునది దైవము మాత్ర మటంచు సామ్యమే
  పరగును జీవులన్నిటను, భద్రము గూర్చును తత్ప్రభావమే
  హరి! హరి! క్రూరజంతువులె యయ్యును ప్రేమను జూపుచుండె నా
  చిరుతలు లేడి పిల్ల యెడ స్నిగ్ధ మనమ్మున నద్భుతమ్ముగా

  రిప్లయితొలగించండి
 2. చిరుతకు కడుపే నిండెను
  చిరు లేడి యెదుట నిలచిన చిక్కిన గానీ
  కరకుగ చంపగ బూనదు
  మరునాటికి దాచు గుణము మనిషికె యుండున్.

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని వారూ,
  ‘స్నిగ్ధ మనోహర భావం’తో నేటి పద్యరచనకు శ్రీకారం చుట్టారు. అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘మనిషి’ అనరాదు, మనిసి, మానిసి అనవచ్చు.
  అక్కడ ‘మనిసికె యుండున్ / మనుజున కుండున్’ అందాం.

  రిప్లయితొలగించండి
 4. ఇది నైమిశారణ్య మిచట
  నొదగుచు మైత్రిఁ బులిజింక లొకటిగ తిరుగా
  డెద వటులే శత్రుత్వం
  బొదిలెడి బుద్ధుల నొస౦గు మురగాభరణా!

  రిప్లయితొలగించండి
 5. చంద్రశేఖర్ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘ఒదిలిపెట్టడాన్ని’ మీరింకా వదిలిపెట్టలేదు. :-)
  ‘.....శత్రుత్వము
  వదిలెడి బుద్ధుల నొస౦గు వ్యాళాభరణా!’ అని నా సవరణ.

  రిప్లయితొలగించండి
 6. మాస్టారూ పిల్లల తప్పులు అసైన్మెంటు అవ్వగానే మర్చిపోతారనుకొన్నాను. రిటైర్ అయినా గట్టిగానే దిద్దుతున్నారురోయ్ మాష్టారు, జాగ్రత్తగా ఉండాలి:-)
  కార్తిక సోమవారం శివనామం రావాలనుకొన్నాను. మీ సవరణలోకూడా నా భావనన ప్రతిబింబించింది. చక్కటి సవరణకి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. మాకు ఆకెళ్ళ సత్యనారాయణగారని తెలుగు మాష్టారుండే వారు. ఆయన ఆ రోజుల్లో వయసు తక్కువ వేయించుకోవటం వల్ల అరవైఐదు వచ్చినా ఇంకా సర్వీసులో ఉండేవారు. విరాటపర్వం బాగా చెప్పేవారు.ఆయనగుర్తుకొచ్చి మీ రిటైర్మెంట్ మీద ఛలోక్తిగా ఒకమాట అన్నాను. అంతే, సార్.

  రిప్లయితొలగించండి
 8. అయ్యా శ్రీ చంద్రశేఖర్ గారూ!

  మీ పద్యము 1వ పాదమును ఇలాగ సవరించుదాము:

  ఇది నైమిశ వన మిచ్చట

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. అయ్యా! చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.

  శ్రీ శంకరయ్య గారు తప్పులు అన్నీ పట్టుకొనుటలేదు నేను గమనించు చున్నాను.
  నేను కూడా తప్పులలో కొన్నిటిని చూచీ చూడనట్లు విడిచి పెట్టుచున్నాను.
  పదే పదే తప్పులను చూపుచూ నుంటే ఎవ్వరు ఏమను కొంటారో మన కెందుకులే అని కొన్ని సార్లు అనుకొంటూ ఉంటాను.

  రిప్లయితొలగించండి
 10. మాస్టరు గారూ ! చక్కని సవరణ.. ధన్యవాదములు.

  చిరుతకు కడుపే నిండెను
  చిరు లేడి యెదుట నిలచిన చిక్కిన గానీ
  కరకుగ చంపగ బూనదు
  మరునాటికి దాచు గుణము మనుజునకుండున్.

  రిప్లయితొలగించండి
 11. శ్రీనేమాని మహాశయులకు వందనములు. మీరు మా తప్పులు సరిచేయకపోయినా మీ కవిత్వపఠనం వల్ల, సూచనలవల్ల చెప్పక చెప్పిన పాఠములెన్నో! అలాగే కొనసాగించమని మనవి.

  రిప్లయితొలగించండి
 12. చూడు డ ల్ల దె చి ఱు తలు లేడి జూసి
  చంప బూనక నెయ్యము నింపు చుండె
  మునుల యాశ్రమ వాటిక దనరు వోలె
  పరిస రంబ ట పచ్చిక పఱచి యుండె

  రిప్లయితొలగించండి
 13. జింకను, చిరుతల జంటను
  వంకలు లేకుండ కలిపి వర్ణచిత్రమునే
  జంకక జేసిన వారల
  నింకను మెచ్చి సెహబాసనియెదను సభలో.

  రిప్లయితొలగించండి
 14. గురువు గారు కొన్ని తప్పులను చూసీ చూడనట్లు వదిలేస్తున్న విషయం నేనూ గమనించాను.
  నేను కూడా కొన్ని పొరబాట్లు చూసినపుడు చెపుదామనుకొని కూడా పెద్దలందరు ఊరుకున్నపుడు నేను చెపితే "కందకు లేని దురద...." అనుకుంటారేమోనని సందేహించి ఊరుకుంటున్నాను.

  కానీ నా విన్నపం ఒక్కటి. గురువుగారు, నేమాని పండితులవారు, పెద్దలందరూ, మిత్రులు ఎవరైనా నా పూరణల్లో పద్యాల్లో ఏ చిన్న లోపమున్నా దయచేసి దయచేసి తెలుపగలరని ప్రార్థిస్తున్నాను. మరీ మరీ ప్రార్థిస్తున్నాను.

  చిన్ని పొరబాటు నేదేని జేసినపుడు
  కొంత సరిదిద్ద వలయును కూర్మితోడ.
  దురద కందకు లేదు కత్తులకు హెచ్చె
  ననుచు దలపగ బోనందు నార్యులార!

  రిప్లయితొలగించండి
 15. అమ్మా! లక్ష్మీదేవి గారూ!
  శుభాశీస్సులు.
  మీరు జింకను అని పద్యమును మొదలిడినారు. ప్రాసను 4 పదములలోను వేసేరు. కాని ప్రాస కొరకు వేసిన పదములు ప్రాస కొరకే అన్నటులున్నవి కాని భావము బాగులేదు. సుమారుగా వ్యర్థ పదములు గానే ఉన్నవి ఆ ప్రాసలోని పదములు. అందుచేత మీరు మరొక ప్రయత్నము చేయండి. ప్రాస మార్చితే కూడ మంచిదే. వర్ణచిత్రము అనే సమాసములో "చి" గురువు అగును కదా. మీరు గమనించినట్టు లేదు. సమాసములో 2 పదములు ఉన్నప్పుడు 2వ పదము మొదటి అక్షరము ప్ర లేక హ్ర మొదలైన రేఫతో కూడిన సంయుక్తాక్షరము అయితేనే ఆ సంయుక్త అక్షరమునకు ముందున్న అక్షరమును మనకు అవసరము బట్టి లఘువుగా గాని లేక గురువుగా గాని వాడుకొన వచ్చును. బాగుగనే వివరించేను అనుకొనుచున్నాను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. రెండవపాదము సవరణతో....

  వంకలు లేకుండ కలిపి వహ్వా యనగన్

  రిప్లయితొలగించండి
 17. అయ్యా,
  మీ వ్యాఖ్య ఇప్పుడే చూసినాను.
  మీ సూచనలకు ధన్యవాదములు.
  నా ఉద్దేశ్యంలో రెండు మూడు ఫోటోలను మిక్సింగ్ చేసి ఒక ఫోటో చేసినారు అని భావించి ఆ భావాన్నే పద్యంలో వ్రాసినాను.
  మీ సూచన ప్రకారము మరొక పూరణ చేయటానికి ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 18. చుక్కల చిరుతకు జింకయు
  ప్రక్కన చేరినదిదెట్లు బ్రతుకునొ యకటా!
  చిక్కక జేయంగవలదు
  నక్కరతో కావుమయ్య హరహర! శంభో!

  రిప్లయితొలగించండి
 19. జాతి వేరైన మృగములు జతగఁ దిరుగు
  చిత్ర రాజమ్ముఁ జూచైన చేత నమ్ముఁ
  బొంద గలరేమొ మానవ మూర్ఖులికట
  మానవ మృగమనుచుఁబోల్చ మాన వలయు.

  రిప్లయితొలగించండి
 20. ఏ ముని వసించు యాశ్రమమ్మిది !? మృగములు
  జాతివైరమును మరచి సఖ్యతన్ మె
  లంగుచు మన కాశ్చర్య మొసంగు చుండె !
  ప్రబలి ధర్మ మిచ్చోటనే పరగె నేమొ !?

  రిప్లయితొలగించండి
 21. చిరుతలచెంతకేగె కడుచిత్రముగానొకలేడితన్ను మై
  మరచి,విచిత్రమేమననమాయకజీవికి కౄరజంతువుల్
  వెఱపునుకల్గనీకతనపిల్లలవోలె భ్రమింపసాగుచున్
  పరమహితోపదేశమును పంచుచునున్నదిగాహితార్థమై.

  రిప్లయితొలగించండి
 22. క్రూరుడౌ ద్విపాదుని కన్న ,ఘోరమైన
  వ్యాఘ్రసింహసర్పాదులు పరమసాధు
  జీవులనిపించు,హానిని జేయవెపుడు
  ఆకటికిగాని లేక భయమ్ము వలన
  గాని చంపవితరముల ,గలుషదుష్ట
  బుద్ధి ,స్వార్థలాభమునకై పొలియజేయు
  కోటి జీవులనైనను గుటిలనరుడు.

  పై చిత్రము నన్నయగారి భారతములో కణ్వాశ్రమ వర్ణనను గుర్తుకి తెస్తున్నది.

  రిప్లయితొలగించండి
 23. శ్రీ సంపత్ కుమర్ శాస్త్రి గారు!
  శుభాశీస్సులు. మీ పద్యములో కౄర జంతువులు అని వాడేరు. క్రూర అని వ్రాయుట సాధు ప్రయోగము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. కలియుగ మందున వింతలు
  పులి జింకలు కలసి మెలసి పొందుగ నుండెన్ !
  కలుగును చోద్యము లెన్నియొ
  కలి పురుషుని మహిమ లెన్న కాలుని తరమే !

  రిప్లయితొలగించండి
 25. మునులు తపమొన రించిన భూమి యందు
  జంతు జాలము లన్నియు వింత గాను
  జాతి వైరము లేకుండ ప్రీతి చెంది
  చిరుత జింకల వలెనుండె చిత్ర మేమొ !

  రిప్లయితొలగించండి