4, డిసెంబర్ 2012, మంగళవారం

శ్రీ లక్ష్మీ స్తవము

శ్రీ లక్ష్మీ స్తవము
రచన
పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు

ఓం నమామి శుభయోగ దాయినీం
ఐం నమామి విజయాం జయప్రదామ్|
హ్రీం నమామి సురబృంద సేవితాం
శ్రీం నమామి సరసీరుహాలయామ్||


జయ జయ! వేద సంస్తుత! ప్రసన్నముఖాంబురుహా! శుభాస్పదా!
జయ జయ! లోకమాత! సురసన్నుత! విష్ణు హృదబ్జవాసినీ!
జయ జయ! శీతలాంశు సహజాత! సుధాంబుధి కన్యకా! రమా!
జయ జయ! ఇందిరా జనని! సర్వ సుఖప్రద! శాంతభూషణా!


శ్రీవిష్ణు హృత్కమల వాసిని! విశ్వమాతా!
శ్రీవాసుదేవ కరుణామృత పానలోలా!
దేవేశి! భక్తవరదా! త్రిదశప్రపూజ్యా!
దేవీ! శుభేక్షణ! ప్రమోదిని! నిన్ను గొల్తున్.


నీ వీక్షణల్ శుభదముల్ నిగమాంత వేద్యా!
వేవెల్గులన్ జగములన్ విలసిల్లజేయున్
నా విన్నపమ్ము వినుమా నను బ్రోవుమమ్మా!
దీవింపుమా శుభమతీ! దివిజప్రపూజ్యా!


ఆనందరూప కలితా! హరిణీ! పురాణీ!
జ్ఞానార్ణవాన్వయ మణీ! సదయాంతరంగా!
దీనార్తి నాశిని! క్షమాది గుణప్రపూర్ణా!
ధ్యానింతు నీదు పదపద్మములన్ మహేశీ!


కమలా! కమలదళాక్షీ!
కమలాసన ముఖ్య దేవ గణ సద్వంద్యా!
కమలాక్ష హృదయవాసిని!
కమలాలయ నీదు చరణ కమలము గొల్తున్


పరితోషమ్మును గూర్చుచు
హరి కరుణామృతము నొంది యనవరతమ్మున్
సిరులు గురియు నీ చూడ్కులు
వరలక్ష్మీ దేవి! మాకు వరదము లగుతన్


త్రిభువన పాలకుడగు శ్రీ
విభునికి పులకలను గొలుపు ప్రేమమయములౌ
శుభవీక్షణములు సంపద్
విభవ ప్రదములగు గాక విమలా! మాకున్.


శ్రీ విభు పాదములొత్తుచు
సేవాభాగ్యమ్ము వలన చెలువొందెడు శ్రీ
దేవీ! మా విన్నపమున
కీవే సంసిద్ధి శ్రీమహేశీ! మాతా!


నీ ముఖమ్ము నుండి ప్రేమతో వెలువడు
చుండు మందహాస సుమము లెపుడు
మమ్ము బ్రోచు గాక మంగళ దేవతా!
పాలకడలి పట్టి! శ్రీలతాంగి!


గాన మొనరింతు నీ దివ్య గాధ లెపుడు
పాన మొనరింతు నీ కృపా పాయసమ్ము
ధ్యాన మొనరింతు నీదు తత్త్వ ప్రశస్తి
దీన జన పోషిణీ నమస్తే శుభాంగి!


సేవింతు నీదు పదముల్ శ్రితపారిజాతా!
భావింతు నీదు గుణ వైభవముల్ కృపాబ్ధీ!
కావింతు నీ భజనముల్ కమలాయతాక్షీ!
దీవింపుమా నను రమా! త్రిజగత్ ప్రపూజ్యా!


శ్రీమహాలక్ష్మి! వరలక్ష్మి! సిద్ధలక్ష్మి!
మోక్షలక్ష్మి! విద్యాలక్ష్మి! ముఖ్య వివిధ
నామరూప సంశోభితా! ప్రేమ హృదయ!
నీ కటాక్షంబు మాకగు నిత్య రక్ష!


వందే హిరణ్మయీం లక్ష్మీం
వందే విష్ణు మనోహరీమ్|
వందే వందారు మందారం
వందే చంద్ర సహోదరీమ్||


వందే సంపత్ప్రదాం దేవీం
వందే దారిద్ర్య నాశినీమ్|
వందే సకల లోకేశీం
వందే మంగళ దేవతామ్||


((శ్రీ చింతా రామకృష్ణారావు గారి ‘ఆంధ్రామృతం’ బ్లాగునుండి ధన్యవాదాలతో)

3 కామెంట్‌లు:

  1. నేమాని పండితార్యా! చక్కని అనువాదాన్ని చేశారు. మాకు అందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. అన్నయ్య గారి శ్రీ మహాలక్ష్మి ప్రశస్తి అందఱికీ శుభంకరము కాగలదు !

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    శ్రీ పండితుల వారు అందించిన లక్ష్మీ స్తవము అందరికీ శుభములను చేకూర్చ గలదు. ధన్య వాదములు

    రిప్లయితొలగించండి