4, అక్టోబర్ 2016, మంగళవారం

వరూధినీ! (ఖండకావ్యము)



వరూధినీ!
రచన - వైద్యం వేంకటేశ్వరాచార్య

 (ఆంధ్రకవితా పితామహుడు అల్లసానిపెద్దన మనుచరిత్రను ప్రబంధంగా మనకు అందించారు. మనుచరిత్ర సాక్షాత్తు "మన చరిత్ర". మన చరిత్ర పుటలు తిరగ వేస్తే వంచనకి గురైన వనితలు ఎందరో........! మనుచరిత్రలో ఒక గంధర్వుడు వరూధినిని కామిస్తాడు. "కళ్ళుగప్పి" ఆమెను వంచించి భోగిస్తాడు. ఆ సంఘటల్ని ప్రబంధోచితంగా చెప్పాడు ఆంధ్రకవితాపితామహుడు. అల్లసానివారి "పదాలకు" అభివందనాలు చేస్తూ, వారి "పదాలను" స్వీకరిస్తూ వంచనకు గురైన వనిత వరూధినిని గురించి రచించిన నా పద్యాలు)

సాహితీ సమరాంగణ సార్వభౌము
భువనవిజయాన విలసిల్లు కవులలోన
కృతి రచింపగబూనె శిరీషకుసుమ
పేశల సుధామయోక్తుల పెద్దనకవి.                  

ఆత డొకనాడు దివ్యానుభూతి నలరి
తీరుబడిగను నిరుపహతిస్థలాన
తూగుటుయ్యాల నల్లన నూగుచుండ
ప్రీతిమెయి రమణీప్రియదూతి వచ్చి.                 

మృగమదపు సౌరభ విభవ ద్విగుణితముగ
కప్పురపు పరిమళమ్ములు గుప్పునట్టి
విడెము నందీయ గొనియు కవి ప్రవరుడు
సరస కావ్యస్ధపాత్ర యప్సరస నెంచె.                 

ఆంధ్రకవితాపితామహు డల్లసాని
పెద్దనార్యుండు తీరిచి దిద్దినాడు
జిగిబిగిని గల్గు సుకవితా శిల్పరమణి
నా వరూధిని నిల చిరంజీవిగాగ.                     

ఐదువందల వత్సరా లయినగాని
వన్నె చిన్నెలవాసి నావంతయైన
తరుగకున్నట్టి దివ్య సుందరివి నీవు
ఓ వరూధిని! ధర చిరంజీవి వీవు.                   

గరిమ గలిగిన పెద్దన్న కలలలోన
కులికి నిలిచితి వాతని కలములోన
నాటినుండియు నాతి! ఈ నాటిదాక
నీకు సాటిగా నీవెయై నిలిచినావు.                    

చిన్ని వెన్నెల కందును వెన్నుదన్ని
పాలకడలిని బొడమిన పద్మనిలయ
నీకు తోబుట్టువట కదా! నీరజాక్షి!
ఓ వరూధిని! పెద్దనార్యుండు తెలిపె.                 

రక్తిబుట్టించు జంత్రగాత్రాలు బలికి
ఱాలు సైతము కరిగింప జాలినట్టి
విమల గాంధర్వమే నీకు విద్యగాగ
దనరినావట నీవు పెద్దన వచించె.                    

విభ్రమము గొల్పు నీతనూ విభవ మెన్న
నించు విల్కానినే మురిపించుగాదె!
కామశాస్త్రమ్మునకె దివ్యకళలు గూర్చు
కామినీ! నీదు రూపురేఖల బెడంగు.                  

తురుము, లేనడుము, కుచముల్ తూగులాడ
ఝళఝళ త్కటకసూచిత చారువేగ
చరణవిన్యాసములు సల్పు చంచరీక
చికురవీవు వరూధినీ! చిగురుబోణి!.                  ౧౦

నవ నవోన్మేషి తోజ్వల నవ్యతార
భోగినీమణి! నీవొక యోగినివలె
అలరి ఆనందమే బ్రహ్మ మనెడునట్టి
‌ గొప్ప సిద్ధాంతమే నీవు చెప్పినావు.                   ౧౧

కచ్చడాల్ గట్టు కొను ముని ముచ్చులెల్ల
తామరసనేత్ర లిండ్ల బందాలు గారె
అనుచు నీతుల రీతిని వినిచినావు
నిష్కలంక కలావతీ! నీజము బలికి.                   ౧౨

అతను శాస్త్రమ్మునందు నధ్యాపనమ్ము
సలుప జాలుదువీవు నెరజాణవంచు
వినుతి సేసె పెద్దన్న కవిప్రవరుడు
విప్రవరుడైన అరుణాస్పద ప్రవరుడు.                 ౧౩

మదనశాస్త్రమ్మునందున మాటకారి
తనమునకు గూర్చితివి నిండుదనము నీవు
గడుసరివె కాని నీ కనుల్ గప్పె నొకడు
కనుక నీవొక బేలవు గాదె బాల!.                     ౧౪

కామమును దీర్చుకొనగ నీ కనులుగప్పి
మోసగించెను గద నిన్ను పురుషు డొకడు
తరతరాలుగ నెందరో తరుణుల నిటు
బలిగొనిరి కాముకులు మోసములు ఘటించి.        ౧౫

గోముఖ వ్యాఘ్రమునుజూచి గోవటంచు
మోసపోతివి యెరుగవు మోసమీవు
కనుక పెద్దన్న నిన్నెన్న గలిగినాడు
మనచరిత్రగ మనె గదే! మనుచరిత్ర.                 ౧౬

చమత్కార పద్యాలు – 216/13


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

13వ అర్థము నవగ్రహ స్మరణ      
                                                                          
భూరి జఠర గురుఁడు = మిక్కిలి కఠినులగు వారికి (రాక్షసులకు) గురువైన శుక్రుఁడును,
నీరజ అంబక భూతి = విష్ణుజన్ముఁడైన యంగారకుఁడును,
మహిత కరుఁడు = ఘనతరమైన కిరణములుగల సూర్యుఁడును,
అహి = రాహుయుక్తమైన
ఇనమణి = రాజసర్ప విశేషమగు కేతువును (రాహుకేతువులును),
కలాపుఁడు = విద్యల కధిపతియగు బుధుఁడును,
అలఘు సద్గణేశుఁడు = విస్తారమైన నక్షత్ర చయమున కధీశుఁడగు చంద్రుఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధాన గీష్పతియగు బృహస్పతియును,
మహామర్త్యసింహుఁడు = గొప్పయగు దేవతలలో సింహప్రాయుఁడైన శనియును,
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2162 (భీరుం డావహమందుఁ బోరె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"భీరుం డాహవమందుఁ బోరెఁ గదరా బీభత్సముం గొల్పుచున్!"
లేదా...
"భీరుఁడు పోరాడె మిగుల బీభత్సముగన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

3, అక్టోబర్ 2016, సోమవారం

చమత్కార పద్యాలు – 216/12


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

12వ అర్థము  అష్టదిక్పాలక స్మరణ         
                                                                          
భూరి జఠర గురుఁడు = లంబోదర జనకుఁడగు నీశానుఁడును,
నీరజ అంబక భూతి = అగ్గికంటి వలన శ్రీమంతుఁడగు కుబేరుఁడును,
మహిత కరుఁడు = ఆధిక్యము గల వాయుదేవుఁడును,
అహీన మణి = వృత్రునకు ప్రభురత్నమైన నిరృతియు,
కలాపుఁడు = కాంతుల కధిపతియగు నగ్నిహోత్రుఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప సుమనోనాయకుఁడగు నింద్రుఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధాన జలాధిపతియగు వరుణుఁడును,
మహామర్త్యసింహుఁడు = ఘనమైన దేవతలలో సింహప్రాయుఁడైన యముఁడును,
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2161 (కారము గన్నులం బడిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కారము గన్నులం బడినఁ గల్గదె మోదము మానవాళికిన్"
(ఆకాశవాణి వారి సమస్య)
లేదా...
"కారము నేత్రములఁ బడినఁ గడు మోద మగున్"

2, అక్టోబర్ 2016, ఆదివారం

చమత్కార పద్యాలు – 216/11


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

11వ అర్థము  కుబేర స్మరణ       
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాడును, (బ్రహ్మ సంతతి యగు పులస్త్యబ్రహ్మ కుమారుఁడు),
నీరజ అంబక భూతి = శివుని వలన లభించిన సంపద గలవాడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణి సముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = విశేషమైన పుణ్యజన సముదాయమున కధీశుఁడైన వాఁడును,
అగ్ర గోపుఁడు = కడపటి (ఉత్తర) దిక్కునకు ప్రభువైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మృతి లేనివారిలో మిక్కిలి శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు కుబేరుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2160 (వైరి స్వదేహ మౌట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"వైరి స్వదేహ మౌట యనివార్యపు శాపము దీర్ఘజీవికిన్"
లేదా....
"తన దేహమె వైరి యగుట తథ్యము ధరణిన్"
ఈ సమస్యను పంపిన పిట్టా సత్యనారాయణ గారికి ధన్యవాదాలు.

1, అక్టోబర్ 2016, శనివారం

చమత్కార పద్యాలు – 216/10


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

10వ అర్థము వాయుదేవ స్మరణ       
                                                                          
భూరి జఠర = పెద్ద కడుపు గల భీమునకు
గురుఁడు = తండ్రి యైనవాఁడు,
నీరజ అంబక =అగ్గికంటి అయిన శివునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత కరుఁడు = ఆధిక్యత గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = అతిశయమే రత్నభూషణముగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ప్రాణాయామ మొనర్చు వాయుభక్షకులగు సాధువుల కధీశ్వరుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ?
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్ఠుఁ డైనవాఁడును (అగు వాయుదేవుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2159 (రాఘవుండు మండోదరీ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రాఘవుండు మండోదరీ రమణికిఁ బతి"
లేదా...
"మగఁడై యొప్పును రాముఁ డింపెసఁగ నా మండోదరీభామకున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.