3, అక్టోబర్ 2016, సోమవారం

చమత్కార పద్యాలు – 216/12


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

12వ అర్థము  అష్టదిక్పాలక స్మరణ         
                                                                          
భూరి జఠర గురుఁడు = లంబోదర జనకుఁడగు నీశానుఁడును,
నీరజ అంబక భూతి = అగ్గికంటి వలన శ్రీమంతుఁడగు కుబేరుఁడును,
మహిత కరుఁడు = ఆధిక్యము గల వాయుదేవుఁడును,
అహీన మణి = వృత్రునకు ప్రభురత్నమైన నిరృతియు,
కలాపుఁడు = కాంతుల కధిపతియగు నగ్నిహోత్రుఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప సుమనోనాయకుఁడగు నింద్రుఁడును,
అగ్ర గోపుఁడు = ప్రధాన జలాధిపతియగు వరుణుఁడును,
మహామర్త్యసింహుఁడు = ఘనమైన దేవతలలో సింహప్రాయుఁడైన యముఁడును,
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

1 కామెంట్‌:

 1. అష్ట దిక్కుల కధిపతు లనగనరయు
  డల కుబే రుండుయ ముండును నగ్ని యింద్రు
  డు వరు ణుండును వాయువు నవని యందు
  మఱియు నీ శాను డనగను మహిత కెక్కి
  రార్య !వందనంబులు సేతు నందఱ కును

  రిప్లయితొలగించండి