2, అక్టోబర్ 2016, ఆదివారం

చమత్కార పద్యాలు – 216/11


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

11వ అర్థము  కుబేర స్మరణ       
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాడును, (బ్రహ్మ సంతతి యగు పులస్త్యబ్రహ్మ కుమారుఁడు),
నీరజ అంబక భూతి = శివుని వలన లభించిన సంపద గలవాడును,
మహిత కరుఁడు = అతిశయ మైనవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణి సముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = విశేషమైన పుణ్యజన సముదాయమున కధీశుఁడైన వాఁడును,
అగ్ర గోపుఁడు = కడపటి (ఉత్తర) దిక్కునకు ప్రభువైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మృతి లేనివారిలో మిక్కిలి శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు కుబేరుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

4 కామెంట్‌లు:

  1. బ్రహ్మ మనుమడు ముక్కంటి వరవిభూతి
    మహిత కరుడును ఘనతర మణినిధిపతి
    దివ్యజనపతి యుత్తర దిక్కు ఱేడు
    ఘన కుబేరుండు మనలను గాచుగాక.

    రిప్లయితొలగించండి
  2. బ్రహ్మ సంతతి యందున బ్రముఖు డతడు
    శివుని మూలాన గలిగిన శ్రీవి భుండు
    మర్త్య సింహుడగు కుబేర మహుడు మనల
    గాచు గావుత నిరతము గరుణ తోడ

    రిప్లయితొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
    బ్రహ్మ సంతతి యగు పులస్త్యబ్రహ్మ కుమారుఁడగు విశ్రవసుని పుత్రుడు కదా కుబేరుడు.

    రిప్లయితొలగించండి