వరూధినీ!
రచన - వైద్యం వేంకటేశ్వరాచార్య
(ఆంధ్రకవితా పితామహుడు అల్లసానిపెద్దన మనుచరిత్రను ప్రబంధంగా మనకు అందించారు.
మనుచరిత్ర సాక్షాత్తు "మన చరిత్ర". మన చరిత్ర పుటలు తిరగ వేస్తే వంచనకి గురైన
వనితలు ఎందరో........! మనుచరిత్రలో ఒక గంధర్వుడు వరూధినిని కామిస్తాడు. "కళ్ళుగప్పి"
ఆమెను వంచించి భోగిస్తాడు. ఆ సంఘటల్ని ప్రబంధోచితంగా చెప్పాడు ఆంధ్రకవితాపితామహుడు.
అల్లసానివారి "పదాలకు" అభివందనాలు చేస్తూ, వారి "పదాలను" స్వీకరిస్తూ
వంచనకు గురైన వనిత వరూధినిని గురించి రచించిన నా పద్యాలు)
సాహితీ సమరాంగణ సార్వభౌము
భువనవిజయాన విలసిల్లు కవులలోన
కృతి రచింపగబూనె శిరీషకుసుమ
పేశల సుధామయోక్తుల పెద్దనకవి. ౧
ఆత డొకనాడు దివ్యానుభూతి నలరి
తీరుబడిగను నిరుపహతిస్థలాన
తూగుటుయ్యాల నల్లన నూగుచుండ
ప్రీతిమెయి రమణీప్రియదూతి వచ్చి. ౨
మృగమదపు సౌరభ విభవ ద్విగుణితముగ
కప్పురపు పరిమళమ్ములు గుప్పునట్టి
విడెము నందీయ గొనియు కవి ప్రవరుడు
సరస కావ్యస్ధపాత్ర యప్సరస నెంచె. ౩
ఆంధ్రకవితాపితామహు డల్లసాని
పెద్దనార్యుండు తీరిచి దిద్దినాడు
జిగిబిగిని గల్గు సుకవితా శిల్పరమణి
నా వరూధిని నిల చిరంజీవిగాగ. ౪
ఐదువందల వత్సరా లయినగాని
వన్నె చిన్నెలవాసి నావంతయైన
తరుగకున్నట్టి దివ్య సుందరివి నీవు
ఓ వరూధిని! ధర చిరంజీవి వీవు. ౫
గరిమ గలిగిన పెద్దన్న కలలలోన
కులికి నిలిచితి వాతని కలములోన
నాటినుండియు నాతి! ఈ నాటిదాక
నీకు సాటిగా నీవెయై నిలిచినావు. ౬
చిన్ని వెన్నెల కందును వెన్నుదన్ని
పాలకడలిని బొడమిన పద్మనిలయ
నీకు తోబుట్టువట కదా! నీరజాక్షి!
ఓ వరూధిని! పెద్దనార్యుండు తెలిపె. ౭
రక్తిబుట్టించు జంత్రగాత్రాలు బలికి
ఱాలు సైతము కరిగింప జాలినట్టి
విమల గాంధర్వమే నీకు విద్యగాగ
దనరినావట నీవు పెద్దన వచించె. ౮
విభ్రమము గొల్పు నీతనూ విభవ మెన్న
నించు విల్కానినే మురిపించుగాదె!
కామశాస్త్రమ్మునకె దివ్యకళలు గూర్చు
కామినీ! నీదు రూపురేఖల బెడంగు. ౯
తురుము, లేనడుము, కుచముల్ తూగులాడ
ఝళఝళ త్కటకసూచిత చారువేగ
చరణవిన్యాసములు సల్పు చంచరీక
చికురవీవు వరూధినీ! చిగురుబోణి!. ౧౦
నవ నవోన్మేషి తోజ్వల నవ్యతార
భోగినీమణి! నీవొక యోగినివలె
అలరి ఆనందమే బ్రహ్మ మనెడునట్టి
గొప్ప సిద్ధాంతమే నీవు చెప్పినావు. ౧౧
కచ్చడాల్ గట్టు కొను ముని ముచ్చులెల్ల
తామరసనేత్ర లిండ్ల బందాలు గారె
అనుచు నీతుల రీతిని వినిచినావు
నిష్కలంక కలావతీ! నీజము బలికి. ౧౨
అతను శాస్త్రమ్మునందు నధ్యాపనమ్ము
సలుప జాలుదువీవు నెరజాణవంచు
వినుతి సేసె పెద్దన్న కవిప్రవరుడు
విప్రవరుడైన అరుణాస్పద ప్రవరుడు. ౧౩
మదనశాస్త్రమ్మునందున మాటకారి
తనమునకు గూర్చితివి నిండుదనము నీవు
గడుసరివె కాని నీ కనుల్ గప్పె నొకడు
కనుక నీవొక బేలవు గాదె బాల!. ౧౪
కామమును దీర్చుకొనగ నీ కనులుగప్పి
మోసగించెను గద నిన్ను పురుషు డొకడు
తరతరాలుగ నెందరో తరుణుల నిటు
బలిగొనిరి కాముకులు మోసములు ఘటించి. ౧౫
గోముఖ వ్యాఘ్రమునుజూచి గోవటంచు
మోసపోతివి యెరుగవు మోసమీవు
కనుక పెద్దన్న నిన్నెన్న గలిగినాడు
మనచరిత్రగ మనె గదే! మనుచరిత్ర. ౧౬
వేంక టేశ్వరాచార్యులు విపులముగను
రిప్లయితొలగించండిదనదు కావ్యాన దెలిపిరి తలిరు లెట్లు
మోసమునకు గురియయిరో ముఖ్యముగను
పురుష పుంగవులవలన పూర్వ మందు
చాలా బాగా వ్రాశారు వరూధిని ఔన్నత్యాన్ని గురించి.
రిప్లయితొలగించండిచాలా బాగా వ్రాశారు వరూధిని ఔన్నత్యాన్ని గురించి.
రిప్లయితొలగించండిసుకవి పండిత మిత్రులు వైద్యము వేంకటేశ్వరాచార్య గారికి నమస్సులు!
రిప్లయితొలగించండిమీ వరూధిని ముగ్ధమోహన సుందరి...అమాయిక...చాలా చక్కని పదజాలంతో విరాజిల్లుచున్నది. ఇంత చక్కని ఖండకావ్యము నందించినందులకు మీకు మనఃపూర్వక శుభానందనలు!
స్వస్తి
భవదీయుడు
గుండు మధుసూదన్
శ్రీవైద్యం వెంకటేశ్వరార్యులకు వందనచందనాలతో
రిప్లయితొలగించండి1.కాముకులకు వైద్యంబా?
ప్రేముకులకు బంచిపెట్టు ప్రేరణ లాగా
భామావరూధిని సొగసు
ధీమాగా వేంకటేశ తెలిపితి రార్యా.|
2.మోసపూరిత పద్ధతుల్ మోజులుంచ
అందచందాల విందున యాడుకొన్న
వెంకటేశ్వరపద్యాలువెలుగునందు
ఆవరూధిని సొగసున కద్దమాయె|