19, అక్టోబర్ 2021, మంగళవారం

సమస్య - 3876

 20-10-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె”
(లేదా...)
“యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ బల్కు టొప్పునే”

21 కామెంట్‌లు:

  1. తగవు లాడుచు నుండెడు తరుణమందు
    దాని వారింప యత్నించి తగిన రీతి
    చక్కనైనట్టి సూచన శాంత పరచు
    యుక్తముగ పల్కుటది సమయోచి తమ్మె !

    రిప్లయితొలగించండి
  2. వ్యక్తము జేయగావలె శుభంబొనరింప జనాళికెన్నడున్
    యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ; బల్కుటొప్పునే
    రిక్తపు మాటలున్ పగను రేపెడి నిష్ఠుర దుష్ప్రలాపముల్
    త్యక్తమొనర్పగావలె హితంబెటులౌనవి మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    పార్థ! సారథిగా ననుఁ బవరమునకు
    వేడుకొని పిల్చి మోహాన వీడనెంచి
    యైన వారినిఁ జంపఁగలేననుచు న
    యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె?

    ఉత్పలమాల
    రక్తిని యుద్ధమెంచి నను లాలస గోరుచు పార్థ! సాదిగన్
    వ్యక్తము సేతువే తగని యారితి మోహమునన్ విరాగివై
    'శక్తుడ గానటంచు' ,విడి ఛాపము, సేనకు స్ఫూర్తినింపెడున్
    యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ, 'బల్కు టొప్పునే?'

    రిప్లయితొలగించండి
  4. వక్తగనీతినావిదురువందితసద్గుణులెక్కఁజేయకే
    సక్తుడుగాకయోధనుడుసంగతిగానకయుద్ధమంచుదా
    యుక్తినికర్ణునమ్మియికయోధులఁజంపగఁజూచెనేగదా
    యుక్తమునైనమాటసమయోచితరీతినిఁబల్కుటోప్పునే

    రిప్లయితొలగించండి
  5. సమస్య :

    యుక్తము నైన మాట సమ
    యోచితరీతిని బల్కు టొప్పునే

    ( పాండవులను ప్రశంసిస్తూ కౌరవులను
    నిరసిస్తూ రాయబారిగా వచ్చినశ్రీకృష్ణుడు
    పలకటాన్ని నిరసిస్తూ ధృతరాష్ట్రునితో దుర్యోధనుడు )

    ఉత్పలమాల
    -------------

    సక్తము గాదు తండ్రి ! మది
    సామము లేనిది కృష్ణుబోధకున్ ;
    ద్యక్తము జేయగా దగునె
    ధాత్రిని పాండవధార్ష్ట్య బుద్ధికిన్ ?
    రక్తము పొంగజేయ పగ
    రాజుకొనున్ గద యేరికైన ! దు
    ర్యుక్తమునైన మాట సమ
    యోచితరీతిని బల్కు టొప్పునే ?

    ( ధార్ష్ట్యబుద్ధి - ధిక్కారపు బుద్ధి )

    రిప్లయితొలగించండి
  6. దుష్టుడైనవానిదుర్మతిఁదోలగఁజేయు
    యత్నమునుఁజేయుతలపులయందునరసి
    కష్టమైనట్టిమాటలఖండితముగ
    యుక్తముగఁబల్కుటదిసమయోచితమ్మె

    రిప్లయితొలగించండి
  7. యుక్తమునైన మాట సమయో
    చిత రీతిని బల్కు టొప్పు, నే
    సూక్తలు జెప్పుచుందు గడు
    సుందరమొప్పగ విప్పిచక్కగా
    వక్త యటంచు మెచ్చుకొని సభా
    ముఖమందున ప్రస్తుతించి నీ
    ప్రోక్తము కర్ణపేయమని భూరి
    జనుల్ వినుతించునట్లుగాన్

    రిప్లయితొలగించండి
  8. శక్తి యుక్తులు గలవారు యుక్త మెరిగి
    పలుకుచుందుట పరిపాటి పదుగురెదుట
    విధిగ నవసర మెదురైన వేళ ననుప
    యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె

    రిప్లయితొలగించండి
  9. శాంతి దూతగ కౌరవ సభకుజొచ్చి
    సంధిపొసగఁగ జేయుము సరసిజాక్ష!
    పక్షపాతములేని సద్వచనములను
    యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె

    రిప్లయితొలగించండి
  10. నచ్చిన పనిని జేయగ మెచ్చు కొమ్ము
    నచ్చని పనులు జేయగ నచ్చ జెప్పు
    వినని వారిపై క్షమజూపి విడువుమనగ
    యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె

    రిప్లయితొలగించండి
  11. ఉ:

    భుక్తి గొనంగ వల్లభుడు ముచ్చటలాడుచు ప్రేమ మీరగన్
    రక్తిని బొంద ప్రేయసిని రమ్మన చేరగ దీయ , నంతలో
    నుక్త మొనర్చ భూషణము నొప్పగ, చప్పున దెప్పిబల్కడే
    యుక్తము నైన మాట సమయోచిత రీతిని బల్కు టొప్పునే ?

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి

  12. తనువుకయినగాయమ్ములు తగ్గుగాని
    మనసు దగిలిన పలుకులు మానవనుచు
    నెరగి కార్యసాధన గోరి యిలను నరుడు
    యుక్తముగఁ బల్కుటది సమయోచితమ్మె.

    రిప్లయితొలగించండి

  13. భుక్తిని గోరి యభ్యకుల మోదము తోడ భజించు వేళలో
    శక్తికి మించు కార్యములు స్థాయికులెంతగ చెపినన్ నిరా
    సక్తిని చూపనేల యట సంయమనమ్మును గల్గి వారితో
    యుక్తము నైనమాట సమయోచిత రీతినిఁ బల్కుటొప్పునే.

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణ ను పరిశీలించ ప్రార్థన.
    సమస్య: తప్పక చెప్పనొప్పు బొగ ద్రాగెడి వాడగు లోక పూజ్యుడౌ.

    నా పద్యం:
    తప్పుగ నెంచ బోకు పొగ త్రాగక యుండు నతండు దున్నయై
    దప్పక పుట్ట బోవుననె ధారగ సాగిన కైత నొక్కడున్
    గొప్పగ మత్తు మందు గొని కూలెడి వారల నెంచి చూడగా
    తప్పక చెప్పనొప్పు బొగ ద్రాగెడి వాడగు లోక పూజ్యుడౌ!
    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  15. భుక్తము చేయు వేళ మరి పోల్చుట తప్పగు భార్య వంటలన్
    శుక్తమదైన చారు రస శోభిత కమ్మని యమ్మ వంటతో,
    వ్యక్తము చేయవచ్చు నది వ్యాకులతన్ కలిగించకున్నచో!
    యుక్తమునైన మాట, సమయోచితరీతినిఁ, బల్కు టొప్పునే?

    రిప్లయితొలగించండి
  16. ఉత్పలమాల:
    వక్తగ నున్న సద్గురువు పట్టుదలన్బలుమార్లుఁ బల్కుగా
    *యుక్తమునైన మాట సమయోచిత రీతినిఁ, బల్కు టొప్పునే*
    రిక్త విలంబవక్రపద రీతు లవాక్కులు విద్యనేర్పుచోన్!
    శుక్తి ప్రభావదీప్తమగు సూక్తులు పెక్కులు చెప్పగాదగున్

    ---కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  17. తే.గీ

    సకల ప్రాణులందు పలుకు సాధనముగ
    వరము నొందెను మనుజుడు తెరపి జూడ
    మంచి చెడులవిచక్షణ మరువకుండ
    యుక్తముగ పల్కుటది సమయోచితమ్మె

    ఆత్రేయ🙏🙏

    ఉ.మా..

    వ్యక్తిగ జన్మనొందితగుప్రాగ్ర్యమునైనవ రమ్ము తోడునన్
    భుక్తినివెళ్ళదీయుటకుమోసము పంచన చేరనేరమే
    శక్తిని కూడగట్టుకొని శత్రువు నైనను గెల్వగన్ సదా
    యుక్తమునైన మాట సమయోచిత రీతిని బల్కు టొప్పునే

    ఆత్రేయ🙏🙏

    రిప్లయితొలగించండి
  18. భక్తిని జూపి బంధులను భావ మొకించుక లేక కృష్ణుడే
    శక్తికి మించి యాడుచును శాంతికి భగ్నము వాటిలన్ యధా
    శక్తిని పాండవాగ్రజుని సాంతము సంస్తుతి జేయు నీతడే,
    యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ బల్కు టొప్పునే.

    రిప్లయితొలగించండి
  19. తేటగీతి
    రాయబారిగ కృష్ణుని రాజరాజు
    కడకు పంపుచు పాండవాగ్రజుడు సంధి
    కొఱకు నుడివెడి మాట తగు విధముగనె
    యుక్తముగ బల్కుటది సమయోచితమ్మె

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  20. మాట లింపైనచో నూరు మంచి దగును
    జేత లింపైనచోఁ గీర్తి సెలఁగు నీకు
    నిత్తరిం గరుణా హీన మిట్లు నర్మ
    యుక్తముగఁ బల్కు టది సమయోచితమ్మె


    సూక్తులు సెప్పఁగా వలె నరోత్తమ! పెద్దలు మెచ్చు రీతినిన్
    నక్తచర ప్రభావము ఘనమ్ముగఁ గల్గిన యట్లు తోఁపఁగా
    రిక్తపు మాట యేల విపరీతపు టాత్రము తోడ నివ్విధిన్
    యుక్తము నైన మాట సమయోచిత రీతినిఁ బల్కు టొప్పునే

    రిప్లయితొలగించండి
  21. వ్యక్తమొనర్చిరమ్ముయదువంశ విభూషణ మాదు కోర్కెలన్
    శక్తివిహీనులంచలఁతి చందముగామమునెంచ వారికిన్
    యుక్తమునైన మాట సమయోచితరీతినిఁ బల్కు టొప్పు నే
    సక్తుఁడగాను యుద్ధమున శాంతినికోరుదు నెట్టులేనియున్

    రిప్లయితొలగించండి