6, అక్టోబర్ 2024, ఆదివారం

సమస్య - 4904

7-10-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మూర్ఖుఁడు రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా”

(లేదా...)

“మూర్ఖుఁడు పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రు పో”

14 కామెంట్‌లు:

  1. మూర్ఖపు జనులెన్నుకొనగ
    మూర్ఖుఁడు రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా
    మూర్ఖత్వమెదిగి నందున
    మూర్ఖులయి పరమమునింక పూజించరుగా

    రిప్లయితొలగించండి
  2. కందం
    మూర్ఖుని నమ్మితి మనచు త
    దర్ఖము కాదనుచు నెంచి 'యర్హుడు' నిలువన్
    మూర్ఖతవిడి యెన్నఁ, దొలఁగ
    మూర్ఖుఁడు, 'రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా! '

    ఉత్పలమాల
    మూర్ఖుడు మాటలన్ జిలికి పొందుచు గద్దెను స్వార్థచిత్తుఁడై
    మూర్ఖులఁ జేసి పౌరులను బొక్కసమెల్లను దోచఁజూడఁగన్
    మూర్ఖత వీడి, 'యోగ్యుఁడట పోరున నిల్వఁగ నెన్నఁ' ,గూలఁగన్
    మూర్ఖుడు, 'పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రు పో! '

    రిప్లయితొలగించండి
  3. మూర్ఖత సహింపని జనులు
    మూర్ఖుని రాజ్యమ్ము విడిచి పోయిన వేళన్
    మూర్ఖుడు వచించె నిటులన్
    మూర్ఖుఁడు రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా

    మూర్ఖుని పాలనమ్ము కడు మూర్ఖత నిండిన కార్యవర్గమున్
    మూర్ఖుని రాష్ట్రమందున సమూలపు మార్పులు ప్రోది చేయగా
    మూర్ఖుని పాలనమ్ముగని మూర్ఖుడొకండు వచించెనిట్టులన్
    మూర్ఖుఁడు పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రు పో

    రిప్లయితొలగించండి
  4. కం॥ మూర్ఖత యున్నను ముదముగ
    మూర్ఖుఁడు మేధావులు హితమున్ దెల్పంగన్
    మూర్ఖత విడి యొప్పి మెలఁగ
    మూర్ఖుఁడు రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా!

    ఉ॥ మూర్ఖత యున్న మొండితనమున్ విడనాడుచు బుద్ధిమంతులన్
    మూర్ఖుడు గౌరవించుచును ముద్దుగ విజ్ఞుల దారి నెంచుచున్
    మూర్ఖుఁడు సర్వమానవులుఁ బొందఁగ క్షేమము రాజ్యమేలఁగన్
    మూర్ఖుఁడు పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రుపో!

    ముర్ఖుడు తెలివిలేని వాడు
    మూర్ఖత తెలివిలేమి

    బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి బెంగుళూరు శతావధానములో
    మూర్ఖుని చిత్తమున్ అను ప్రారంభ పదములతో ఒకరు సమస్య ఇచ్చారండి వార్ఖని లాంటి పదాలు వారు సమస్యలో వాడినారు కాని నేను పూర్తిగా వ్రాసుకోలేక పోయానండి.

    రిప్లయితొలగించండి
  5. మూర్ఖుండు కాని సుమతిని
    మూర్ఖుని పైన గెలిపించ పోరాటములో
    మూర్ఖత వీడిన యోడుచు
    మూర్ఖుఁడు, రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా.


    మూర్ఖులు పాలకుండ్రయిన మోసము జేయీట ధర్మమంచు నా
    మూర్ఖులు పంచు హాలహల భోగము లెల్లను స్వీకరించినన్
    మూర్ఖత వీడి యెన్నికల పోరున యోగ్యుని మెచ్చ
    యోడగా
    మూర్ఖుఁడు , పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రు పో.

    రిప్లయితొలగించండి
  6. మూర్ఖుని చిత్తమే విషపు బుంగ కదా! యది మానుటెట్లగున్!
    మూర్ఖుడు రాజుకన్న మరి మొక్కడు! భూపతి మూర్ఖుడైననా
    మూర్ఖుని డెందమున్ హరుడె పూనిన, మారిన మానసంబునన్
    మూర్ఖుఁడు పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రు పో!!

    విషపు బుంగ = విషభాండము
    పాలకుండ = క్షీరభాండము

    రిప్లయితొలగించండి
  7. మూర్ఖుని రాజ్యమందున సమూహముగా పలు మూర్ఖ మానవుల్
    కార్ఖనలోని వస్తువులుగా జనియింతురు, దేశసంపదల్
    మూర్ఖతతో త్యజింపఁగను మోసఁపు మాటలునమ్మి, యెవ్విధిన్
    మూర్ఖుఁడు పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రు పో?

    రిప్లయితొలగించండి
  8. మూర్ఖుఁడు పాలకుడైనను
    మూర్ఖత్వము ప్రబలిపోవు పురజనులందున్
    మూర్ఖతతో నిటులనకుడు
    మూర్ఖుఁడు రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా

    రిప్లయితొలగించండి
  9. మూర్ఖుల దేశమ్మునకును
    మూర్ఖుడె రాజౌనుసుమ్మి మూర్ఖత్వముతో
    మూర్ఖుల పరిపాలించే
    మూర్ఖుడు రాజైన బ్రజకు మోదమ్మె కదా

    రిప్లయితొలగించండి
  10. మూర్ఖులె ప్రజ లై యుండగ
    మూర్ఖుడె రా జవును సుమ్ము ము మ్మాటి కి నీ
    మూర్ఖులు దని యు చు నుండ గ
    మూర్ఖుడె రాజైన ప్రజకు మో దమ్మె కదా!

    రిప్లయితొలగించండి
  11. మూర్ఖుని రాజ్యము నందున
    మూర్ఖులులేయుందురచట మొత్తమువారే
    మూర్ఖునిఁజూచుచుఁనితరుడు
    మూర్ఖుఁడు రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా”

    రిప్లయితొలగించండి
  12. మూర్ఖులె యందఱున్ గలుగ మోసముఁజేయగఁదేలికౌటనున్
    మూర్ఖుఁడు రాష్ట్రమంతటిని ముక్కలు సేయుచు మభ్య పెట్టగా
    మూర్ఖుఁడొకండుఁదాననియె మూర్ఖుని తోడను నిబ్బరంబుతో
    మూర్ఖుఁడు పాలకుండయిన మోదమునంది ప్రజల్ సుఖింత్రు పో”

    రిప్లయితొలగించండి
  13. మూర్ఖులె నిండుదురిలలో
    *"మూర్ఖుఁడు రాజైనఁ, బ్రజకు మోదమ్మె కదా”*
    మూర్ఖులమతిసరిదిద్దుచు
    మూర్ఖత్వము మాన్పినంత ముదమగు ప్రజకున్

    రిప్లయితొలగించండి
  14. కం:జార్ఖండున గెలుపొంద న
    మీర్ఖాన్ ముస్లిం మహిళల మెప్పులు బడయన్
    బుర్ఖా లిచ్చె నుచితముగ
    మూర్ఖుఁడు రాజైనఁ బ్రజకు మోదమ్మె కదా”

    రిప్లయితొలగించండి