8, అక్టోబర్ 2024, మంగళవారం

సమస్య - 4906

9-10-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్”

(లేదా...)

“కొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్”

14 కామెంట్‌లు:

  1. కందం
    ఆదుకొన దీన జనులన్
    మోదంబుననెంచు విద్య పూర్ణముగ నిడున్
    వేదించి దోచ నెంచఁగ
    రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్

    చంపకమాల
    తలఁచి పరోపకారము నుదాత్తమనంబున నేర్చు విద్యలున్
    గొలదిని మించి పొందువడఁ గూర్చును మానవ సేవ మాధవున్
    మెలకువ నెంచు సేవగ, నమేయ ధనమ్మును దోచనెంచుచున్
    గొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  2. వేదము వ్రాసిన దేవుని,
    మోదక ములమెక్కువాని మూషికవాహున్,
    ఆదినఁబూజించనిచో
    రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్”
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  3. కం॥ మేదిని విద్యలఁ బొందఁగ
    సాదనఁ జేయఁగ నిరతము సాధ్యమగునొకో
    కాదని సోమరిగఁ దిరుగ
    రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్

    చం॥ వలచుచు గొప్ప విద్యలను బద్ధతిఁ గాంచుచు సౌఖ్యమెంచకన్
    వెలయఁగ సాధనా పటిమ విద్యలు నేర్వఁగ నొప్పు ధాత్రిలోఁ
    జెలఁగక సాముఁ జేయకను సిద్ధినిఁ బొందఁగ సాధ్యమే కనన్
    గొలచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్

    రిప్లయితొలగించండి

  4. పేదలను స్వార్థ పరులై
    వేదించుచు సతము వారి విధ్వంసమదే
    మోదమని తలచు వారికి
    రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్.


    తలవక లోక శ్రేయము నధర్మపథమ్మున సంచరించుచున్
    బలువిధ పాపకార్యములు వాసిగ జేయుచు హింస మార్గమున్
    జెలగెడు స్వార్థచిత్తులగు చేతకు లైన యబాసి వారలే
    కొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్.

    రిప్లయితొలగించండి
  5. ఏదైన నేర్వ దలచిన
    వాదమువిడి కోర . వచ్చు వాణి కరుణతో
    కాదని వేరుగ జేసిన
    రాదఁట కోరిన చదువు . సరస్వతిఁ గొలువన్

    రిప్లయితొలగించండి
  6. మోదముతో నేర్వనిచో
    రాదఁట కోరిన చదువు, సరస్వతిఁ గొలువన్
    రాదు పరిమాణ మెంచన్
    వేదాగ్రణిఁ దలపనొప్పు విద్యలకొరకై

    తలచినఁ జాలుఁ భారతిని తప్పక నేర్వగ వచ్చుఁ విద్యలన్
    నిలకడ సుస్థిరత్వమును నిశ్చయమొప్పు కుతూహలంబుతో!
    మలచిన విగ్రహంపు పరిమాణము కొల్చెడి సాధనంబుతో
    కొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్!


    రిప్లయితొలగించండి
  7. జూదము లాడుచు సతతము
    వాదము జేయుచు తిరుగుచు వ్యసనంబు
    మోదము జెందె డు వానికి
    రాదట కోరిన చదువు స ర స్వతి గొలు వన్

    రిప్లయితొలగించండి
  8. ఔదలదాల్చక గురువుల
    బోధనలను పగలురేయి ప్రొద్దెరుగకనే
    జూదము మరిగిన నరునకు
    రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్

    రిప్లయితొలగించండి
  9. కొలువుల కోసమై చదువు కొమ్మని పెద్దలు పాఠశాలకున్
    పలువిధమైన సౌఖ్యముల పన్నుగ గూరిచి పంప పిన్నలన్
    విలువగు బ్రాయమంతయును వేడుకలందున వమ్ము చేయుచున్
    కొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  10. కం:ఏది యెవరికిన్ దగునో
    ఆ దేవి యొసంగు వేద మట్లిడె నీ కా ,
    వేదము విడి కవిత లనకు
    రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్
    (నీకు తగినది వేదం కనుక సరస్వతి అది ఇచ్చింది.దాన్ని వదలి కవిత్వం రాస్తాను అనకు.నీ కేమి ఇవ్వాలో ఆమెకి తెలుసు.)

    రిప్లయితొలగించండి
  11. చం:కొలిచితి వీవు శారదను గొప్పగ నే పలు విగ్రహమ్ములన్,
    తలచెద వామె యోగమును,తత్త్వము నీయగ, నీ సుషుమ్న లో
    నిలచిన బ్రాహ్మినిన్ విడువ నీకు లభించునె?విగ్రహమ్ములో
    కొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్”
    (నువ్వు విగ్రహం లో ఉన్న సరస్వతిని కొలుస్తూ ,యోగం,తత్త్వజ్ఞానం కోరితే ఎలా? నీ సుషుమ్న లో ఉన్న సరస్వతిని ధ్యానించాలి.ఆ బ్రాహ్మిని ధ్యానించు.)

    రిప్లయితొలగించండి
  12. కాదన లేక స్వజన సం
    చోదితుఁడై పల్కు నట్లు సూ మూర్ఖపు టా
    వాదనల నెల్ల వినుమా
    రాదఁట కోరిన చదువు సరస్వతిఁ గొలువన్


    కలినిఁ బ్రయత్న మించుకయుఁ గైకొన కున్న ఫలింప నేర్చునే
    తలఁపుల నుంచ దైవమును దద్ధిత వాంఛలు మానవాళికిన్
    వెలుపల నుంచ దీప మది వెల్గుచు నుండునె యాఱకుండఁగాఁ
    గొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  13. నిలుపుచువిఘ్ననాయకునినిశ్చలభక్తిని జాటకుండ,వే
    గలతల బాపు దేవతనుగౌరిని స్థాపన జేయకుండఁదా
    బిలువక వేదమూర్తులనుఁబెద్దగ విందులు సేయుచున్ సదా
    కొలిచినచో సరస్వతినిఁ గోరిన విద్యలు రావు రూఢిగన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి