13, అక్టోబర్ 2024, ఆదివారం

సమస్య - 4911

14-10-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”

(లేదా...)

“సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”

15 కామెంట్‌లు:

  1. కోరికతో భర్త పిలువఁ
    నారీమణి పడక చేరె నాలస్యముగన్
    సూరుడు క్రుంగిన తదుపరి
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్

    [సారంగము = రాత్రి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారంగంబనెనా శకుంతలను దుష్యంతుండు సంప్రీతితో
      సారంగధ్వజుడే ప్రశాంత రుచులన్ భాసిల్లు వేళన్ గనన్
      సారంగాక్షి మనోవిపంచి పలికెన్ సంకోచమున్ వీడుచున్
      సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్

      [మొదటి పాదములో : సారంగము = పద్మము]
      [నాల్గవ పాదములో : సారంగము = ఒక రాగము]

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. కందం
      నీరజనయన శకుంతల
      వీరుఁడు దుష్యంతుఁడొల్క ప్రియవచనంబుల్!
      సారింప తూపు మన్మథ
      సారంగము, రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్!

      శార్దూలవిక్రీడితము
      ఆరాటాన శకుంతలన్ గనుచు దుష్యంతుండు మోహంబునన్
      గారాబంబొలికించుచున్ మనువనన్ గాంధర్వ మేపారగన్!
      సారింపన్ విరితూపులన్ మరుడహో! సౌగంధ వ్యాప్తమ్మునౌ
      సారంగంబు, నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్!

      తొలగించండి
  3. కం॥ వారాంతమ్మున కవులకుఁ
    బూరించ సమస్య నొసఁగెఁ బోటీ పడఁగన్
    సారించి మేధ రయముగ
    ”సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”

    శా॥ వారాంతమ్మునఁ బద్య ధారలసుధల్ భాసిల్లఁగన్ విజ్ఞులై
    బూరించంగ సమస్య నిచ్చెదఁ గవుల్ పోటీ పడంగాఁ దగున్
    సారంశమ్మును గాంచి మేధ విరియన్ సారించుచున్ వ్రాయరో
    ”సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”

    రిప్లయితొలగించండి

  4. పేరుగల యారటిని శృం
    గారియగుచు వెంటపడగ కాదన లేకన్
    పేరిమి తో నా నటి వా
    సా! రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్.

    *(వాసు అను వానికి మిత్రుడు చెప్పినట్లుగ)*


    ఔరా యెంతటి సుందరాంగి యిట సన్యాసాశ్రమమ్మందు టం
    కారమ్మంచు దలంచినట్టి నృపుడా కామాంధ దుశ్యంతుడే
    చేరన్ కణ్వుని పుత్రి యా వనములో చెన్నొందెడందాల యా
    సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్.

    రిప్లయితొలగించండి
  5. ఊరి చివరి కాననమున
    కోరలు లేనట్టి యాడు కుంజరమచటన్
    చేరువన నుండిన పురుష
    సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్

    ( ఆడ ఏనుగకు దంతములుండవు , ఉన్నా బహు చిన్నవి ఉంటాయట )

    రిప్లయితొలగించండి
  6. నీరంబేదియొ క్షీరమేదొ మనమున్ నేర్వంగ లేనట్టి క
    న్యారత్నంబు శకుంతలన్ ప్రభువు దుష్యంతుండె కాంక్షించగా
    సారంగాధిపయాన,కాంత, రజనీ సారంగ ధమ్మిల్ల దృ
    క్సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్!!


    సారంగాధిపయాన = గజగామిని
    రజనీ సారంగ ధమ్మిల్ల = చీకటి వలె నల్లగా ఉన్న తుమ్మెదల వంటి కొప్పు కలిగినది
    దృక్సారంగంబు = జింక వంటి చూపులు కలిగినది

    రిప్లయితొలగించండి
  7. మేరయ లేని విధంబున
    తోరపు కల్లలను బ ల్కు తుంటరి వాడై
    నేరు గ మిత్రు ని తో ననె
    " సారంగము రాజు గూడి సత్పుత్రు గనె న్ "

    రిప్లయితొలగించండి
  8. వీరునిఁగని లలనామణి
    కోరిక మదినుప్పతిలఁగ కుసుమాస్త్రుడుతా
    సారింపఁగ పూశరముల
    సారంగము, రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్

    రిప్లయితొలగించండి
  9. మారునకు వశుం డయి వెస
    రా రమ్మని పిలువ రాజు రయముగఁ దన దే
    వేరి తమినిఁ జింత ఫలము
    సా రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్

    [ఫలము+ చారు+ అంగము = ఫలము సా రంగము ; అంగము = విధము]


    పారావార పరీత భూ వలయముం బాలింప సామర్థ్యునిం
    దారా నాథ సమాన సుందరుఁ గులోద్ధారున్ మహా వీరునిన్
    నారీ రత్న శకుంతలా రమణి స్వర్ణద్యోత రాజద్వపు
    స్సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్

    రిప్లయితొలగించండి
  10. కం:ఆ రంగసాని తన వే
    శ్యారంగము వీడి పెండ్లి యాడెను వలపే
    పొంగుటచే వాచా మన
    సా,రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”
    (భోగం వారిని రంగసానులు అంటారు.ఆమె రంగం రాజు అనే అతన్ని మనసా,వాచా ప్రేమించి పెళ్లి చేసుకొని కొడుకును కున్నది.)

    రిప్లయితొలగించండి
  11. ధీరోదాత్తుఁడు వీరవర్యుఁడటవిన్ దిర్గాడు దుష్యంతుఁడే
    చేరెన్ కణ్వమునీంద్రునాశ్రమము గాంచెన్ కన్యకా రత్నమున్
    మారుండంతటమార్గణమ్ముగొని సమ్మానంబుగానెక్కిడన్
    సారంగంబు, నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్

    రిప్లయితొలగించండి
  12. శా:నా రాజ్యమ్మున నర్తకీమణివి యెన్నన్ లేడి కన్నుల్ కదా!
    ఆ రమ్యాంగియె నాదు రాణి యని ప్రేమావేశ మున్ బొందగా
    నా రాజేంద్రుడు,మోజు పెంచి తనదౌ నందమ్ము జూపించి యా
    సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”
    (ఆ నర్తకివి లేడి కన్నులు అని రాజు మెచ్చుకొనే వాడు.ఆ లేడి రాజుని పెళ్లి చేసుకున్నది.)

    రిప్లయితొలగించండి