21, అక్టోబర్ 2024, సోమవారం

సమస్య - 4919

22-10-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్”

(లేదా...)

“రక్తము పీల్చెదన్ తరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో”

10 కామెంట్‌లు:

  1. కందం
    ముక్తము గాదు ప్రతినయని
    యుక్తమ్మన దుస్ససేను నురమును గొనుచున్
    సక్తతగనునని, నీచుని
    రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్

    ఉత్పలమాల
    ముక్తము గాదు నా ప్రతిన పూర్వము సేసినదాచరించెదన్
    యుక్తమనంగ నీ యురము నుక్కిరిబిక్కిరి సేసి చీల్చుచున్
    సక్తత దుస్ససేను గని శాంతము నొందునటంచు నెంచుచున్
    రక్తము పీల్చెదన్ తరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో!

    రిప్లయితొలగించండి

  2. భక్తిగ కోవెల జని యట
    శక్తిని పూజించువేళ సర్పమె కుట్టన్
    యుక్తిగలవాడు కావున
    రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్.



    యుక్తము కాదు ద్రౌపది మహోన్నత సద్గుణ శీలి సాధ్వి యా
    శక్తివిహీన నీసభను చైలవిహీనగ జేయబూన నా
    సక్తిని జూపినట్టి ఖలు సంగర మందున చీల్చి వక్షమున్
    రక్తము పీల్చెదన్ తరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో.

    రిప్లయితొలగించండి
  3. కం॥ భుక్తి పిదపఁ గలఁగనెనిటు
    రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్
    రక్తపు రూపున నరుణుఁడు
    శక్తినిఁ గనఁ పతి పలికెను సతి లెమ్మనుచున్

    ఉ॥ భుక్తినిఁ జేసి నిద్రయును బొందఁగ స్వప్నముఁ గాంచెనిట్టులన్
    రక్తముఁ బీల్చెదన్ దరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో
    శక్తిగ మారి తానటుల శాంభవి వోలెను దూకునంతలో
    యుక్తము గాదు మేల్కొనవొ యుగ్మలి యంచు మగండు తెల్పెనే

    రిప్లయితొలగించండి
  4. కందం:
    రక్తినిగొని తనసతిపై
    వ్యక్తియొకఁడు వెంటబడుచు వ్యాకుల పరచన్
    శక్తిని జూపెద దుష్టుని
    రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్

    ఉత్పలమాల:
    రక్తినిగొంటి నీపయిన రమ్మిటు తాళ విలంబమంచునా
    సక్తిని జూపి దుండగుఁడు సాధ్విని సంకట పెట్టబోవనా
    వ్యక్తినిఁ గొట్టి వల్లభుఁడు వ్యాకులపాటదియేల నుక్కివున్
    రక్తము పీల్చెదన్ తరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  5. యుక్తము గాదని యె రిగియు
    ముక్తము సేయంగ వచ్చె మూర్ఖుడు సభలో
    శక్తుని గ దు స్స సే నుని
    రక్తము బీ ల్చె ద నని పతి రమణిని బిలి చెన్

    రిప్లయితొలగించండి
  6. యుక్తిగ దేవుని దయగొన
    శక్తి కొలది యారగింపు సమకూర్చినచొ
    భక్తిగ గొలచి యతని యను
    రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్

    రిప్లయితొలగించండి
  7. ఉక్తులు చాలు చాలు మరి యూరక కాలము రిక్త పోవదే
    యుక్తమె నీకు నేడిటుల యుగ్మలి!చేరక జాగుఁ జేయగన్
    వ్యక్తము కావె నా హృదయ భావములివ్వవె భాండమున్ పయో
    రక్తము పీల్చెదన్ తరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో!!


    పయో రక్తము = కుంకుమ పువ్వు కలిపిన పాలు

    రిప్లయితొలగించండి
  8. భర్త స్టైలుగా సిగిరెట్ త్రాగుతుంటే చూడాలని భార్య కోరిక. భర్తకు ఆ అలవాటు లేదు. కాని భార్య బలవంతం మీద సిగిరెట్ త్రాగటానికి ఒప్పుకొని భార్యను పిలిచే సందర్భము:-

    యుక్తమె సిగిరెట్ చెలి? యా
    సక్తి మదిన్ లేదు! వినవు! సరి యిక విలువల్
    త్యక్తము! నీకై నీదను
    రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్!!

    రిప్లయితొలగించండి
  9. రక్తిని కలిగిన రసికుడు
    వ్యక్తము చేసె తనకోర్కె భార్యామణితో
    యుక్తిపరుడు వాతెఱ సం
    రక్తముఁ బీల్చెదనని పతి రమణినిఁ బిలిచెన్

    [సం రక్తము = మిక్కిలి ఎఱ్ఱనైనది]


    యుక్తిగ కార్యశీలుడు ప్రయోక్తగ మారిన పుష్పకేతువై
    రక్తినికల్గియుంటి నధరామృతమీయవె యాలి యంచు తాఁ
    వ్యక్తము చేసి కోరికను వాతెఱ లెంచగ నొప్పు వర్ణమే
    రక్తము పీల్చెదన్ తరుణి రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి