18, సెప్టెంబర్ 2025, గురువారం

సమస్య - 5248

19-9-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”

(లేదా...)

“ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”

(రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి ధన్యవాదాలతో...)

30 కామెంట్‌లు:

పఠానేని కార్తిక్ చెప్పారు...

చ.
చిర సుయశోధనార్జనకు చిత్రమునందు నటించె వాడు పే
రు రయము దక్క వేషములు, రూపులు మార్చుచు పాత్రలందు తా
నెరుగని రీతి తోచెను, యథేచ్ఛను దృశ్యములోన వచ్చెడా
యిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా !

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sitharamayya Solasa చెప్పారు...


కరిముఖుని పూజకొరకై 
విరాళమును గైకొనుటకు విచ్చేసిరిగా 
మరల మరల నేతెంచెడు
ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”

విరించి చెప్పారు...


అరివీరభయంకరులే
విరటుని సేవించుటదియె వింతయె సుమ్మీ
నరుడవు వలలుండను మీ
రిరువురు, మువ్వురును, నలువు, రేవు రొకరె పో.


విరటుని కొల్వుకూటమున వీరులు పాండు కుమారు లెల్లరున్
పరిచరులై చరించుటది వాస్తవ మంచన నుత్తరుండనెన్
నరుడవు నీవు భీముడును నారియు ధర్మజు, మాద్రి పుత్రులా
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా.

Radha krishna Sharma చెప్పారు...

స్థిరమగు కీర్తితోడుతను చిత్రపరిశ్రమ యందు ఎంటియార్
సిరులు గడించినాడు పలు చిత్రములందు నటించి చక్కగన్
విరివిగ మార్చుచున్ తనదు వేషము పాత్రలు కానవచ్చె తా
యిరువురు మువ్వురున్ నలువురేవురు నార్గురు నొక్కరే కదా

M.B.G.TILAK చెప్పారు...

హరికథకుఁడు చావడిలో
పరికించెను ప్రేక్షకాళి పరిమిత మవగా
సరియగు సంఖ్యను కనుగొన
నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో

హరికథ చెప్పఁ దానరిగె నచ్చటి చక్కని రచ్చపట్టుకున్
బరిమితమైన ప్రేక్షకులు వచ్చెడి పోయెడి జాడ తోచగా
సరియగు సంఖ్యతేల్చుటకు చప్పున లెక్కలు పెట్టి చూడగా
నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా

రామోక్తం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామోక్తం చెప్పారు...

హరిహరులును త్రిభువనములు
పరికించగ నాల్గు శ్రుతులు ప్రకృతీ ఋతువుల్
అరయగనద్వైతమ్మున
ఇరువురు మువ్వురును నలువురేవురొకరెపో

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఇరవగు కామము మూలము
యరిషడ్వర్గమ్ము లనెడు యడుసున గూలన్
నరులకునీ యొక్కండును
ఇరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఇరవుగనొక్క కోర్కి మదినెల్లలు దాటగ వైరి షట్కముల్
తెరకుగ వచ్చి చేరునది తీరక కొందలపాటు గూర్చుచున్
వరుసగ నొక్కటొక్కటిగ వచ్చెడు దాయలు నెమ్మనమ్మునం
దిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరేకదా

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

పురమున శంభు ని చిత్రము
లరుదగు రీతిగను గి్చి యలరిన వేళ న్
మురిపము లొల్క గ గన బడె
నిరు వురు మువ్వురు ను నలువు రే వు రొక రె పో

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:"సరిగా జెప్పుము పాండవు
లిరువురొ,మువ్వురొ, నలువురొ,యేవురొ" యన తిం
గరి మనుమ డిట్లనెను "వా
రిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో!"
(తెలియనిదో,మర్చిపోయిందో అడిగితే కొందరు పిల్లలకి చికాకు పుట్టి తింగరి సమాధానా లిస్తారు. )

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
పరమేశ్వరు ప్రతిబింబము
వరుసగ నద్దాల మండపమ్మున గాంచన్
మెరయగఁ బైన నలుదిశల
నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో!

చంపకమాల
దరిసెనమొంద పంచభుజ దర్పణ మండపమందు కృష్ణునిన్
బరవశమొందమే మిగుల పంకజనేత్రుని తేజమొప్పగన్
మెరయగఁ జూడ పైనఁగన మిన్నగ చుట్టును దివ్యరూపమే
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చం:ఇరువురు రామలక్ష్మణులె యిందున,నిందున సీత కూడె,ద
గ్గర భరతుండు జేరె నిట ,దాపున బావని నిల్చె నందు,న
ల్వుర ,మరి సీతయున్ హనుమ నచ్చగ గీసితి నిందు,బ్రేమ లో
నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”
(ఒక బొమ్మలో రామలక్ష్మణు లిద్దరిని,ఇంకో బొమ్మలో సీతారామ లక్ష్మణుల్ని,ఇంకో బొమ్మలో ఈ ముగ్గురితో హనుమంతుడు,మరొకదానిలో అందరినీ బొమ్మలుగా గీసాను.ఎందరైనా ప్రేమలో వారందరూ ఒకటే కదా!)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ ధరణిని మనుజులు కొల్చిన
స్థిరమగు చిత్తమున వివిధ దేవతలనటుల్
సరియగు జ్ఞానము నొందఁగా
నిరువురు మువ్వురును నలవు రేవు రొకరె పో

చం॥ ధరణినిఁ బెక్కు దేవతలఁ దత్పరులౌచు జనాళి కొల్చినన్
బరము నొసంగు వాఁడు హరి భక్తుల పాలిటి కామధేనువై
స్థిరమగు జ్ఞానసంపదల సిద్ధినిఁ బొందఁగఁ దేట తెల్లమౌ
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!

మరొక పూరణ అండి

చం॥ అరయఁగ సూర్యబింబములు నబ్థినిఁ బెక్కులు కానఁగానగున్
విరియు తరంగముల్ కదల విస్మయ మొందెడు రీతి మధ్యలో
నెరుగఁగ నాదిత్యుండొకడె యీవిధి దైవము నొక్కఁడే సుమా
యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!

సముద్రము మధ్యలో అలలు చిన్నవిగా ఉండి నెమ్మదిగా కదులుతుంటే అనేక సూర్యబింబాలు కనపడుట సామాన్యమే నండి.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కర మాశించి పడయఁగాఁ
ద్వరితం బెద నిర్ణయించి తత్క్షణమే య
ప్పురమునఁ గొన్న దడుగఁగా
నిరువురు మువ్వురును నలువు రేవు, రొకరె పో


నర వరు లెవ్వరేన్ వరుస నైపుణ మేర్పడ నెంచి చూచినం
దరుణులు నశ్వులున్, హర విధాతృ రమేశులు, ఋత్విజుల్, పృథా
వర తనయుల్, నిజ ద్విషులు, బ్రహ్మము సంఖ్యల యందు నింపుగా
నిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dr H Varalakshmi చెప్పారు...

వరమును వేడి రక్ష నిలువంగనుఁగోరిరి వేల మౌనులే
నరకుని సత్య కూల్చగను నాయము దీరును వారి కోర్కెయన్
సరసపు లాటలన్ వనిని చల్లని పున్నమిఁజేర శ్రీహరే
ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!

Dr H Varalakshmi చెప్పారు...

తరములు మారి సంతతియు తగ్గెను నింటను నొక్కరిద్దరన్
తిరిగియు వ్రాయనోపు నిక తీరుగ దాట సుతుండు నానుడిన్
ఇరువురి బేధమేమి మరి నింతయు తిండియు పెట్టి పెంచగన్
ఇరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా!

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

హరియున్ గోపికలందరి
సరసన నొక్కండు చేరి సరసములాడన్
మెరిసెన్ అందరి చెంతను
నిరువురు,మువ్వురును,నలువు,రేవు
రొకరె పో!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కరములతోబంధించగ
చిరునగవులుచిందజేసి శ్రీకృష్ణుడటన్
స్థిరముగ నిలవగ దలచిరి
*“నిరువురు మువ్వురును నలువు రేవు రొకరె పో”*

కరమునవిల్లుజారగనుకౌరవసేనలజూచి భీతితో
సరుగునద్రిప్పుమయ్యనటుస్యందనమంచునుత్తరుండనన్
చిరుదరహాసమొప్పగనుచెప్పగగుట్టునువిస్మయంబుతో
*“యిరువురు మువ్వురున్ నలువు రేవురు నార్గురు నొక్కరే కదా”*