29, సెప్టెంబర్ 2025, సోమవారం

సమస్య - 5259

30-9-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దయ్యమ శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా”
(లేదా...)
“దయ్యమ వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్”

15 కామెంట్‌లు:

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
కయ్యము జీవితంబిచట కాంచన గర్భుని వ్రాత వింత మే
మొయ్యన సద్గుణౌఘముల నోరిమి నేరిచి యుండలేము మా
నెయ్యము సాగబెప్డు కట నేరిమి పోదిక ముక్తికడ్డు పె
న్దయ్యమ, వేంకటేశ్వర సదా నిను గొల్తుము చూడుమా దయన్ !

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నెయ్యము బ్రహ్మోత్సవమదె
యియ్యవనిని జన్మధన్యమే యగు గనినన్
కయ్యములుఁ దొలఁగ జేయ హృ
దయ్యమ! శ్రీవేంకటేశ! దయఁ గనుమయ్యా!

ఉత్పలమాల
నెయ్యము తిర్మలన్ నలువ నిష్ఠగ జేసెడునుత్సవాలు మా
కియ్యవనిన్ గనన్ దనర, నీప్సితముల్ నెరవేర్చు వేడినన్
గయ్యము లాడఁ జూచి మము గాసిల బెట్టెడు వారి పాలి ప్రా
దయ్యమ! వేంకటేశ్వర! సదా నినుఁ గొల్తుము చూడుమా! దయన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అయ్యా తిరుమలవాసా
సయ్యన నా మొరలు వినఁగ చలమేలను రా
వయ్య కరుణఁ గావఁగ నా
దయ్యమ శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అయ్యవు నీవటంచు మది యార్తిని బాపెదవంచు నమ్మితిన్
చయ్యన నాదుకొమ్ము మనసార భజించెద నీదునామమున్
కయ్యములేల నల్పుడను గావర దేవర నీదు భక్తునిన్
దయ్యమ! వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్

విరించి చెప్పారు...


ఇయ్యవనిని వెలసిన మా
యయ్యవు నీవనుచు నమ్మి యగచాటనకన్
తొయ్యలితో జేరితి మా
దయ్యమ! శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా.


ఇయ్యవనీతలమ్మునకు నెల్ల గుధేరుడ వీవె కావునన్
దొయ్యలి వెంటబెంటుకుని దూరమటంచుదలంచ కుండనే
చయ్యన జేరుకుంటిమి ప్రజాళినికాచెడి వాడవౌ మహా
దయ్యమ వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్.

Radha krishna Sharma చెప్పారు...

నెయ్యము జూపబోరు యను నిత్యము కారణ మేమి లేకనే
కయ్యము పెట్టు కొంచు మము గాసిల జేతురు మాదు వైరులన్
చయ్యన వచ్చి కావు మయ శత్రుభయంబును మాపు మయ్య యో
దయ్యము వేంకటేశ్వర సదా నిను గొల్తుము చూడుమా దయన్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ మెయ్యికొన భక్తి ధరణిని
నెయ్యము వీడక మనమున నిలిపితి మయ్యా
పెయ్యిని వంచి కొలిచితిమి
దయ్యమ శ్రీవెంకటేశ దయఁగను మయ్యా

ఉ॥ మెయ్యికొనంగ భక్తి యిల మేటిగ విచ్చెను దత్పరోధృతిన్
గయ్యము లాడమెప్పుడును గామిత మంతయు సత్వమే కదా!
నెయ్యముఁ జూపు మయ్య మము నెమ్మినిఁ బ్రోచు పరాత్పరా భువిన్
దయ్యమ వెంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్

మెయ్యికొను పుట్టు, పెయ్యి శరీరము ఒడలు

Sitharamayya Solasa చెప్పారు...

నెయ్యుడు మరుని గొమరుడట
కయ్యము జేయుచు నయినను గంతుని దోడన్
వియ్యము దలపో సితి నా
దయ్యమ శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా”

M.B.G.TILAK చెప్పారు...

తియ్యనిదౌ జీవితమునఁ
జెయ్యక తప్పని పనులని చేసితి నఘముల్
కయ్యములేర్పడె రయమున
దయ్యమ! శ్రీవేంకటేశ! దయఁ గనుమయ్యా

తియ్యని దైన జీవనము తీరగు సంపద మాకొసంగినన్
జెయ్యక తప్పలేదనుచు చేసిన పాపము వెంబడించగా
చయ్యన నిన్నువేడెదము సంభవ కారక మమ్ముగాచు మా
దయ్యమ! వేంకటేశ్వర! సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్

[దయ్యము = దేవుఁడు]

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

అయ్యా తి రుమల వాసా!
సయ్యా టలు మాని మమ్ము చల్లగ బ్రో వన్
నెయ్య ము తో వేడు గొ నె ద
దయ్యమ! శ్రీ వేంక టేశ! దయ గను మ య్యా!

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ఇ "య్య" ను బ్రాసగ బెట్టితి
తియ్యగ "దైవ"మన బ్రాస తీర్చుట యెటులౌ
నయ్యా! దొరకెను వికృతిగ
దయ్యమ, శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా!
(స్వామీ!నిన్ను పొగిడే పద్యం లో "య్య" ని ప్రాసగా పెట్టుకు అఘోరించాను.మరి "దైవము" అంటే ప్రాస కుదరక వికృతి ఐన "దయ్యం" వాడాను.మన్నించు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:దయ్యము బట్టి నా సుతుడు తల్లడ బొందుచునుండె,పుత్రు మా
దయ్యకు స్వాస్థ్యమి మ్మతడు దారికి వచ్చిన గొండ నెక్కెదన్
చెయ్యన నీ కృపన్ బరుప చెంగున బారదె క్రూర యైన యా
దయ్యమ! వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడు మాదయన్”
(కొడుకు పేరు మాదయ్య.వాడికి దయ్యం పెట్టింది.మాదయ ని కాపాడ మని తండ్రి వెంకన్న కి మ్రొక్కుకుంటున్నాడు.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

నెయ్యి సెలంగ నొసంగుదు
మయ్య ప్రసాదముల నిత్య మంచిత రీతిన్
నెయ్యము మీఱ దయా నిధి
దయ్యమ శ్రీవేంకటేశ దయఁ గనుమయ్యా

[దయ్యము = దైవము]


దయ్య మొసంగుఁ బీడలను దైవ మొసంగ శుభమ్ము లింపుగా
నియ్యెడ సుప్రసన్నులను నిర్వురఁ జేయఁ గడింది మే లగున్
వెయ్యి విధమ్ములం దనరి వేడెద మిత్తఱి మమ్ము వీడుమా
దయ్యమ వేంకటేశ్వర సదా నినుఁ గొల్తుము చూడుమా దయన్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...




చెయ్యన పనులను చేయగ
నయ్యా యొసగుము బలమునుననయము నాకున్
నెయ్యము తోడుత ననునో
దయ్యమ శ్రీ వేంకటేశ దయ గనుమయ్యా


నెయ్యము తోడ గొల్చెదను నిత్యము నిష్టగ మ్రొక్కుచుందునే
చయ్యన వీడబోకుమము స్వాంతము నందలి కోర్కె తీర్చుమా
యయ్యవు నీవెమా కిలను హర్షము తోడనుమమ్ముగాంచుమా
దయ్యమ వేంకటేశ్వర సదా నిను గొల్తుము చూడుమా దయన్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

వియ్యము నందెడు వారలె
కయ్యమునకు ముందుగానె కాలును దువ్వన్
నెయ్యపు గుణముల నిడుమా
దయ్యమ!శ్రీవేంకటేశ దయగనుమయ్యా!