2, మార్చి 2026, సోమవారం

సమస్య - 5396

3-3-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అత్తయు నొకయింటి కోడలనఁగఁ దగదు పో”
(లేదా...)
“అత్త యొకింటి కోడలని యందఱు వల్కుట యొప్పునా భువిన్”

14 కామెంట్‌లు:

  1. కందం
    పెత్తనమొసంగ నన్నయె
    యత్తగ నా తల్లిలేని యల్లుని పెంచన్
    గుత్తముగఁ బెండ్లి మానఁగ
    నత్తయు నొకయింటి కోడలనఁగఁ దగదు పో!

    ఉత్పలమాల
    పెత్తనమప్పగించి తన ప్రేమను జాటఁగ సోదరుండహో!
    యత్తగఁ దల్లి లేదనెడు నల్లుని పెంచెడు బాధ్యతన్ గొనన్
    జిత్తమునందు రాగమునఁ జిక్కుచుఁ బెండ్లిని మానినంత న
    య్యత్త యొకింటి కోడలని యందఱు వల్కుట యొప్పునా భువిన్?

    రిప్లయితొలగించండి
  2. అత్తయినను కోడలిపై
    పెత్తనమును చేయక కడు పేరిమి తోడన్
    గుత్తగ ప్రేమను పంచఁగ
    నత్తయు నొకయింటి కోడలనఁగఁ దగదు పో

    రిప్లయితొలగించండి
  3. అత్తయెగాని నిచ్చలము నమ్మగ భావన కల్గు రీతిగా
    పెత్తనమేమి సల్పక నభీష్టమునెర్గి చరించుచున్ సదా
    గుత్తగ ప్రేమఁ బంచి తన కోడలి క్షేమముఁగోరుచుండునా
    యత్త యొకింటి కోడలని యందఱు వల్కుట యొప్పునా భువిన్

    రిప్లయితొలగించండి


  4. కొత్తగ వచ్చిన కోడలు
    నత్తయె గయ్యాళి దగుచు నారడి పెట్టన్
    చిత్తమున నున్న బయటకి
    యత్తయు నొకయింటి కోడలనఁగఁ దగదు పో.



    అత్తలనంగ సంతతము నాఱడి పెట్టెడి వారలై సదా
    చిత్తము నందు నిల్చిరని చెప్పిరి పెద్దలు నాడు, ప్రస్థుతం
    బత్తలు కోడలన్న పెనుచాదరణన్ గురిపించుచుండగా
    యత్త యొకింటి కోడలని యందఱు వల్కుట యొప్పునా భువిన్.

    రిప్లయితొలగించండి
  5. మెత్తని మనసును గలిగియు
    పెత్తనము ను జూప బోక ప్రీతి గ మసలే
    యత్తను గాంచి న తరి నా
    యత్తయు నొక యింటి కోడ లన గ దగదు పో!

    రిప్లయితొలగించండి
  6. కొత్తగ వచ్చిన స్నుషను
    నెత్తిన పెట్టుకొని చూచు నెలతలు మనగన్
    నిత్తెము జనులను నట్లుగ
    నత్తయు నొకయింటి కోడలనఁగఁ దగదు పో”

    రిప్లయితొలగించండి
  7. అనాథను పెండ్లియాడిన వనిత యొక్క అంతరంగము. అనాథకు యిల్లుండదు. కావున లేని యింటికి కోడలుండదు.....

    క్రొత్తగ జన్మించిన సిరి
    చిత్తము వరియించె గాదె శ్రీవిష్ణువునే
    బొత్తువు కత్తయినను నా
    యత్తయు నొకయింటి కోడలనఁగఁ దగదు పో

    క్రొత్తగ నుద్భవించి సిరి కోరెను విష్ణువు గారవమ్ము తా
    నత్తగ మారె బ్రాహ్మికి సనాతని తానొక కోడలౌకనే
    బొత్తిగ తాననాథను బ్రమోదముతోఁ దగ పెండ్లియాడఁగా
    యత్త యొకింటి కోడలని యందఱు వల్కుట యొప్పునా భువిన్

    [సనాతని = లక్ష్మి]

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. కం॥ చిత్తమునఁ బ్రేమ వరలఁగ
      మెత్తగఁ గూతురు వలెఁగన మేదిని స్నుషనే
      అత్తఱి తప్పుల నెన్నుచు
      నత్తయు నొకయింటి కోడలనఁగఁ దగదు పో

      ఉ॥ చిత్తము నందు నర్మిలిని శ్రేయము నెంచుచు వృద్ధిచెందఁగన్
      మెత్తని మానసమ్ముఁ గని మేదిని కూతురు వోలె చూడఁగా
      నత్తఱి సామరస్యముగఁ నత్తయుఁ గోడలనంగఁ జెల్లునో
      అత్త యొకింటి కోడలని యందఱు వల్కుట యొప్పునా భువిన్

      తొలగించండి
  9. కం:అత్తయు కోడలగుటయె జ
    గత్తున సాజ మ్మరయగ , కానీ మా మే
    నత్తయె సన్యాసిని యా
    అత్తయు నొకయింటి కోడలనఁగఁ దగదు పో”
    (అతని మేనత్త సన్యసించింది కనుక ఆ సామెత ఆమె యెడల చెల్లదు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:అత్త యె లక్ష్మి శారదకు, నా సిరి విష్ణువు నే గ్రహించె లో
    కోత్తరు డైన యా హరికి నొక్కరు తల్లి యటంచు దెల్పుమా!
    ఉత్తర మేది పల్కెద? వహో గణుతింపగ నామె పట్ల నీ
    యత్త యొకింటి కోడలని యందఱు పల్కుట యొప్పునా భువిన్?
    (లక్ష్మీ దేవికి సరస్వతి కోడలు కానీ లక్ష్మీ దేవికి అత్త గారు లేదు. )

    రిప్లయితొలగించండి
  11. సత్తెం బెన్నిన నింటికి
    నత్తయుఁ గోడండ్రు నెట్టు లమరుదు రయ్యా
    యెత్తఱి నేని జడమునకు
    నత్తయు నొక యింటి కోడ లనఁగఁ దగదు పో


    అత్తకు మున్ను పెం డ్లయిన నప్పుడు నిక్కము నెంచ మిత్రమా
    యత్త యొకింటి కోడ లని యందఱు వల్కుట యొప్పుఁ జక్కఁగా
    నెత్తఱిఁ బెండ్లి కాని యెడ నిద్దర నప్పుడు వాలుఁగంటి మే
    నత్త యొకింటి కోడ లని యందఱు వల్కుట యొప్పునా భువిన్

    రిప్లయితొలగించండి
  12. కొత్తగ పెండ్లి జేసుకొని కోమలి
    వచ్చెను భర్త యింటికిన్
    నిత్తెము దానె యింటి పని నేర్పున
    జేయుచునున్న యంతయున్
    చిత్తము లేని యత్త నను చిత్రపు
    హింసలు బెట్టుచుండె నీ
    అత్త యొకింటి కోడలని యందరు
    వల్కుట యొప్పునా భువిన్.

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    క్రొత్తగ వచ్చిన కోడలి
    నత్తయె కూతురు విధమున నాదరమొప్పన్
    హత్తుకొని ప్రేమ జూపగ
    నత్తయు నొకయింటి కోడలనగఁ దగదు పో!

    రిప్లయితొలగించండి