3, మార్చి 2026, మంగళవారం

సమస్య - 5397

4-3-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్”
(లేదా...)
“భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై”

13 కామెంట్‌లు:

  1. కందం
    ఏమరి వడ్డించి సుధను
    దామెఱిగింపంగ జంపి తలగామునటన్
    మా మా గ్రహణ కతమనుచు
    భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్

    ఉత్పలమాల
    ఏమరి చేసి వడ్డనను ఇంతిగ విష్ణువు, మారువేషమున్
    దామెరిగింప రాహువును దండనఁ జేయఁగ ఖండఖండమై
    గాముగొనంగ మా గ్రహణకారణ మయ్యె నటన్న ద్వేషమై
    భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై

    రిప్లయితొలగించండి
  2. గాముల నిరోధన వలన
    తామగుపడకుండునటుల దాగెదమంతే
    యేమాత్రము వెరలేదను
    భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్

    రిప్లయితొలగించండి

  3. ప్రేమను తెలుపగ రాగా
    భామము గని భయము తోడ పారె నటంచున్
    గామార్థులు మేచకమనె
    భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్.


    చామన వర్ణమందుగల చక్కని చుక్క యటంచు నెంచి వా
    రామెకు ప్రేమ సంగతిని యాదర మందున తెల్ప జేరగా
    భామము గాంచి భీతిలుచు పారిన యట్టి రజో రసమ్మనే
    భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై.

    రిప్లయితొలగించండి
  4. కామిని వివరములు దెలిసె
    నామెను భాస్కరుడు పెండ్లి యాడిన పిదపన్
    భామకి భర్త శశియనుచు
    భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్

    ప్రేమను వెల్లడించగనె వేగమె కాముకి సమ్మతింపగా
    భామను బెండ్లియాడెనట భాస్కరుడొక్కడు జ్ఞానశూన్యుడై
    కాముకి వల్లభుండు శశి కన్యులు చెప్పిరి ఘోరకృత్యమున్
    భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై

    రిప్లయితొలగించండి
  5. ప్రేమించెను మొదట శశిని
    భామామణి మోసగించి భాస్కరుఁతోడన్
    ప్రేమను నటియింప దెలిసి
    భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్

    రిప్లయితొలగించండి
  6. ప్రేమను జూపియున్ శశికి పిమ్మట వానిని మోసగించి భా
    మామణి గూఁడె భాస్కరుని మాయల మాటలుబల్కి వానికిన్
    కామపిశాచిగా నెఱిఁగి గాటపు నల్కనుబూని యామెపై
    భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై

    రిప్లయితొలగించండి
  7. కం॥ భూమినిఁ బ్రాణుల కాసర
    నేమముఁ దప్పక నొకఁడిడు నిత్యము, నిసిలో
    ధామమొసంగు నొకఁడు నే
    భామను దూషించిరి శశిభాస్కరు లలుకన్

    ఉ॥ నేమముఁ దప్పకుండ నటు నిత్యము మండుచు నగ్నిగోళమై
    భూమిని జీవ సంపదలు బుద్ధిగఁ గాచు నొకండు, చల్లఁగన్
    సీమకు కాంతి రేఖలిడు శీతకరుండొకఁ డైనఁ దెల్పు మే
    భామను దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై

    ధామము కాంతి

    రిప్లయితొలగించండి
  8. కం: "ఏమి పనిమనిషి?" వని యా
    భామను దూషించిరి శశిభాస్కరు లలుకం
    గా మట్టి చిమ్మకయె, మరి
    యే మాత్రము నలుక రాక యింటి నలుకగన్ .
    (ఇక్కడ అలకట మంటే యిల్లు అలకటం.మట్టి కూదా చిమ్మకుండా, అలకటం చేత కాకుందా అలికి నందుకు శశి,భాస్కర్ అనే దంపతులు పనిమనిషిని తిట్టారు.)

    రిప్లయితొలగించండి
  9. లేమ గ మారిన విష్ణువు
    తామసు లకు సుధను బంచి తప్పొన రించె న్
    నీమము చెడె ననుచయ్యె డ
    భామను దూషించి రి శశి భాస్కరు లలుక న్

    రిప్లయితొలగించండి
  10. (2)ఉ:ప్రేమను జూపుచున్ సుధను బెట్టగ మోహిని దేవతాళికిన్
    క్షేమము నిచ్చినా వనుచు కేలు మొగిడ్చి ప్రశంస జేసి యా
    భామను, దిట్టినారు శశిభాస్కరు లిద్దరు క్రోధచిత్తులై”
    పాముకొనంగ రాహువును ప్రక్కన జేరగ వాని జూచుచున్.
    (అమృతం కోసం రాహువు తమ ప్రక్కన కూర్చోగా సూర్యచంద్రులు దూషించారు.)

    రిప్లయితొలగించండి
  11. లేమల నెదిరింపన్ సు
    త్రామునకును లేదు శక్తి రవ్యుదయమునే
    తా మాన్ప సతీ సుమతిన్
    భామను దూషించిరి శశి భాస్కరు లలుకన్


    ధీమతి! చందురుండు చనుదెంచ నొకింతయె జాగు సేయఁగా
    భీమ తరమ్ము వెల్గు నిడి పృథ్వికి సూర్యుఁడు విశ్రమింపఁగా
    భూమిని నెల్లఁ గప్పఁ దన పోడిమిఁ జాటఁగ నా నభో రజో
    భామను దిట్టినారు శశి భాస్కరు లిద్దఱు క్రోధ చిత్తులై

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కోమలిగా మారి హరియు
    గోముగ నమృతమును పంచ కూరిమితోడన్
    ఏమఱుచుచు నసురులకున్
    భామను దూషించిరి శశి భాస్కరు లలుకన్.

    రిప్లయితొలగించండి
  13. డా. బల్లూరి ఉమాదేవి
    కామజనకుడైనహరియు
    కోమలిగా మారి సుధను కూరిమి తోడన్
    గోముగపంచెడితరినా
    భామను దూషించిరి శశి భాస్కరులలుకన్

    డా బల్లూరి ఉమాదేవి

    కోమలిపంచుచున్ సుధను కూరిమితోడసురాళికిన్వడిన్
    కామపు చూపులన్ విసరి కాంక్షను పెంచుచు దైత్యమూకకున్
    నేమరుపాటుగానొసగ నింతయుగాంచుచుసైగచేయుచున్
    భామనుదిట్టినారు శశిభాస్కరులిద్దరు క్రోధచిత్తులై

    రిప్లయితొలగించండి