15, మార్చి 2026, ఆదివారం

సమస్య - 5409

16-3-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె”
(లేదా...)
“గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్”

15 కామెంట్‌లు:

  1. భీకరమయినటుల బెల్లిదముగ సుడి
    గాలి వీచెఁ , గొమ్మ గదలదయ్యె ,
    ఎన్నికల సమయము నెంతయో నమ్మించి
    చెప్పి నట్టి పనులు జేయరయ్యె

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    గోకులమ్ము పైన నాక లోక పతియె
    యలిగి రాళ్లవాన కలుగఁ జేసె
    గొడుగు జేయ హరియె గోవర్ధనముఁ, గ్రింద
    గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె!

    ఉత్పలమాల
    ఏలిక కృష్ణమూర్తి పలుకే తమకాజ్ఞగ నింద్రపూజలన్
    దేలికఁ జేయ గోకులము, దిగ్గున రాల్చగ రాళ్ల వర్షమున్
    వేలుపు ఱేడు, గోట హరి పేరువు నెత్తియుఁ గాచఁ గ్రిందుగన్
    గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్!

    రిప్లయితొలగించండి

  3. ఉక్క పోయు చుండ నువిద తాళగలేక
    నవసధమ్ము వీడి యారు బయట
    జేరి నట్టి వేళ శిఖినుండి చల్లని
    గాలి వీచెఁ, గొమ్మ గదలదయ్యె.


    కాలము మోసగించు తరి కాటక మేర్పడి పంట లెండగా
    హాలికు లైన వారికి సహాయము చేయు మటంచు బాధతో
    పాలకులన్ గృషాణులట వ్యాకుల మందుచు గోర నేమిరా
    గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్.

    రిప్లయితొలగించండి
  4. పట్టున సృజియించె ప్రముఖుడౌ నిర్మాత
    చలన చిత్ర మొకటి సందడిపడి
    చిత్రమైన రీతి చిత్రమందున చూడ
    గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె

    బాలల కోసమే ననుచు వాస్తవ గాథల నెంచి గొప్పగా
    నాలుగు చిత్రరాజముల నాతడు దీసె వినూత్న రీతినిన్
    మేలగు రీతినున్నవని మెచ్చిరి కొందరు చిత్రమందునన్
    గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్

    రిప్లయితొలగించండి
  5. ఉ॥ మేలగు రీతిఁ దెల్పెఁ గద మేదిని, విజ్ఞుఁడు వీర బ్రహ్మమే
    కాలము మారఁగన్ గలినిఁ, గాంచెడు వింతలు నచ్చటచ్చటన్
    దేలెను నీటిపై శిలలు తీరుగఁ నట్టులఁ జూడఁగా నహో
    గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్

    రేఫమునకున్న లఘు న్యాయముననుసరించి యండి

    రిప్లయితొలగించండి
  6. ఆ.వె;ప్రియుని రాక కొరకు వేచె వృక్షము క్రింద
    ప్రియుడు రాక యున్న విడక యాశ
    నిలచి యుండ నామె కలచి వనము వాన
    గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె
    (ఇక్కద కొమ్మ అంటే స్త్రీ. వాన గాలి వచ్చినా ప్రియుని కై ఎదురు చూస్తూ ఆమె కదల లేదు. )

    రిప్లయితొలగించండి
  7. ఉ:ఏలనొ చింత చెట్టు మన యింటికి వెన్ కన చింత బెంచునన్
    గోలను సేయగా వినవు, కొంత శ్రమించవె నాథ !మూర్ఖపున్
    గోలగ నెంచినావొ! యది కూలు నటంచు భయమ్ము లేపగా
    గాలులు వీచెఁ దీవ్రముగఁ, గాని కదల్చవు వృక్షశాఖలన్”
    (ఇంటి వెనుక చింత చెట్టు మంచిది కాదనేది ఒక సెంటిమెంట్. అది ఎలా ఉన్నా గాలులు పెరిగి అది ఇంటిమీద కూలుతుం దనే భయం కలుగుతోంది. నువ్వేమో ఆ కొమ్మలని కదల్చవు అని భార్య భర్త తో అంటోంది. )

    రిప్లయితొలగించండి
  8. తాళ వృంత మేల తగ దంచుఁ జక్కఁగ
    నొంటి కొసఁగ సుఖము నింటి లోన
    వేగ వేసి నంత విద్యుద్వ్యజనమును
    గాలి వీచెఁ గొమ్మ గదల దయ్యె

    [కొమ్మ = వనిత]


    తూలిరి వింత శబ్దములు తోరము విన్పడ లోకు లెల్లఁ బా
    పా లొనరింప మానవులు వారక నిత్యము దేవ సంఘ శా
    పాలు సెలంగ పట్టణ నివాసులు వొంద భయమ్ము వింతగా
    గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్పవు వృక్ష శాఖలన్

    [గాలులు = పిశాచములు]

    రిప్లయితొలగించండి
  9. వేసవి యరు దెంచ వేడిమి హెచ్చె ను
    గాలి కొఱకు జనులు గాసి పడగ
    మేను దాకు నట్లు మెల్ల మెల్ల గ చిరు
    గాలి వీచె గొమ్మ గదల ద య్యె

    రిప్లయితొలగించండి
  10. మండుటెండ దెచ్చె మెండుగా నూష్మము
    పుడమి జనుల కస్తి కడిది గాఁగ
    విసనకర్ర నుండి వేడిగా రవ్వంత
    గాలి వీచెఁ, గొమ్మ గదలదయ్యె

    రిప్లయితొలగించండి
  11. వానకాలమందు వడగండ్ల తోఁబాటు
    గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యెఁ
    యెండ కాల మదియ మెండుగా గాలులు
    వీచు భయముఁగొల్ప,వేవడిగను

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. గాలులు వీచెఁ దీవ్రముగఁ గాని కదల్చవు వృక్షశాఖలన్
    చాలును సామి!మీపలుకు సంతస మబ్బెను గుండెలోతులో
    గాలులు వీచగాఁగదలు కాండముతోడన శాఖలన్నియు
    న్గూలును నొక్కసారిగను గూకటి వ్రేళ్ళను దెంపుకొంచహో

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సిద్ధహస్తుడైన చిత్రకారు డొకడు
    ప్రకృతి ప్రేమికుండు పరవశించి
    వృక్ష రాజములను వేయగ చక్కగా
    గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె.

    రిప్లయితొలగించండి
  15. డా బల్లూరి ఉమాదేవి

    వర్షము కురిపించి వజ్రిసంతసమొంద
    చేరబిలిచిజనుల శీఘ్ర గతిని
    గిరినె గొడుగు చేసి కేలనెత్తగ శౌరి
    *"గాలి వీచెఁ గొమ్మ గదలదయ్యె”*

    రిప్లయితొలగించండి