9, అక్టోబర్ 2016, ఆదివారం

చమత్కార పద్యాలు – 216/18


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

18వ అర్థము హిమవన్నగేశ్వర స్మరణ   
                                                                          
భూరి జఠర గురుఁడు = లంబోదరుఁడగు గణపతికి తాత యైనవాఁడును,
నీరజాంబక భూతి = అనలాక్షుఁడగు శివునివంటి యైశ్వర్యము గలవాఁడును,
మహిత కరుఁడు = గొప్ప (మంచుకొండ) కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = అధికతరమైన మణిసముదాయము గలవాఁడును (పర్వత సానువులందు మణు లుండును),
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధుమున కధీశ్వరుఁడైనవాఁడును (తాపసోత్తముల కునికిపట్టయినవాఁడు),
అగ్ర గోపుఁడు = పై భాగమున దిక్పతులు గలవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మృతి లేనివారిలో మిక్కిలి శ్రేష్ఠుడైనవాఁడును (అగు హిమవంతుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2166 (ఆతఁడు నా మగండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

 "ఆతఁడు నా మగండు పతియౌ నితఁ డూరికిఁ బోయె భర్తయే" 
లేదా...
"అతఁడు నా పతి మఱి మగఁ డౌ నితండు"

8, అక్టోబర్ 2016, శనివారం

చమత్కార పద్యాలు – 216/17


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

17వ అర్థము మేఘ స్మరణ          
                                                                          
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారిలో గొప్పవాఁడును (దొడ్డ జలోదరుఁడు),
నీరజాంబక భూతి = అగ్నిబాణ సత్తా (పిడుగులు) గలవాఁడును,
మహిత కరుఁడు = మిక్కిలి వడగండ్లు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప మణికాంతులు (మెఱుపులు) గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి యొప్పులకుప్ప యగు నేలిక యైనవాఁడును (జీవకోటికి జీవమిచ్చు దాత),
అగ్ర గోపుఁడు = పైభాగమున స్వర్గాధిపతియగు నింద్రుఁడు గలవాఁడును (ఇంద్రునకు వాహనము),
మహామర్త్యసింహుఁడు = గొప్ప మృత్యుకాలమున సింహప్రాయమైన మేఘ గర్జనలు గలవాఁడును (అగు మేఘుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2165 (మొయిలు రక్తమ్ముఁ గురిపించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మొయిలు రక్తమ్ముఁ గురిపించె భూమిపైన"
లేదా...
"మొయిలు తటాలునన్ గురిసె భూమిపయిన్ రుధిరం బుదగ్రతన్"

7, అక్టోబర్ 2016, శుక్రవారం

చమత్కార పద్యాలు – 216/16


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

16వ అర్థము సముద్ర స్మరణ       
                                                                          
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారలలో గొప్పవాఁడు (సర్వ నదులను భరించు కడుపు గలవాఁడు),
నీరజాంబక భూతి = చేపలే నేత్రసంపదగా గలవాఁడును,
మహిత కరుఁడు = అతిశయమైనవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప రత్న సముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనమైన సాధుగణాధ్యక్షుఁ డైనవాఁడును (సముద్రస్నాన ఫలాపేక్షితుల కనుట),
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన జలాధిపతి యైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = నాశనము లేనివారిలో మిక్కిలి శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు సముద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

దత్తపది - 99 (వనము)

నాలుగు పాదాలను 'వనము'తో ప్రారంభించి
దేవీ నవరాత్రులను గురించి 
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

6, అక్టోబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/15


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

15వ అర్థము చంద్ర స్మరణ          
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మకు మామయైనవాఁడును (బ్రహ్మ విష్ణుపుత్రుఁ డైనందున లక్ష్మి సోదరుఁడు చంద్రుఁడు బ్రహ్మకు మామ యగును)
నీరజాంబక = పద్మమే తల్లిగా గల బ్రహ్మయొక్క
భూతి = పుట్టువు గలవాఁడును,
మహిత కరుఁడు = గొప్ప కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప రత్నభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = అధికమైన నక్షత్రగణాధీశ్వరుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన చంద్రుఁడను ప్రభుఁ డైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు చంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2164 (తులసీమాతను గొలిచిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తులసీమాతను గొలిచిన దురితము లబ్బున్"
లేదా...
"తులసీమాతను గొల్చినన్ దురితముల్ దోరంబులై యబ్బురా"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

5, అక్టోబర్ 2016, బుధవారం

చమత్కార పద్యాలు – 216/14


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

14వ అర్థము సూర్య స్మరణ         
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును,
నీరజ అంబక భూతి = ఈశ్వరుని వంటి (తరగని కిరణముల) యైశ్వర్యము గలవాఁడును,
మహిత కరుఁడు = అధికతరమైన హస్తములు గలవాఁడును (సహస్రకరుఁడు),
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన శమంతకాది మణిసముదాయము గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = అధికమైన సాధు గణాధీశ్వరుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య నేత్రమైన ప్రభుఁడును,
మహామర్త్యసింహుఁడు = గొప్ప దేవతా శ్రేష్ఠుఁడైనవాఁడును (అగు సూర్య భగవానుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2163 (కవి యనఁ జులుకనగ నయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కవి యనఁ జులుకనగ నయ్యె కలికాలమునన్"
లేదా...
"కవి యన్నన్ గలికాలమందుఁ గడు చుల్కం జూతురే యెల్లరున్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.