8, అక్టోబర్ 2016, శనివారం

చమత్కార పద్యాలు – 216/17


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

17వ అర్థము మేఘ స్మరణ          
                                                                          
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారిలో గొప్పవాఁడును (దొడ్డ జలోదరుఁడు),
నీరజాంబక భూతి = అగ్నిబాణ సత్తా (పిడుగులు) గలవాఁడును,
మహిత కరుఁడు = మిక్కిలి వడగండ్లు గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప మణికాంతులు (మెఱుపులు) గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి యొప్పులకుప్ప యగు నేలిక యైనవాఁడును (జీవకోటికి జీవమిచ్చు దాత),
అగ్ర గోపుఁడు = పైభాగమున స్వర్గాధిపతియగు నింద్రుఁడు గలవాఁడును (ఇంద్రునకు వాహనము),
మహామర్త్యసింహుఁడు = గొప్ప మృత్యుకాలమున సింహప్రాయమైన మేఘ గర్జనలు గలవాఁడును (అగు మేఘుఁడు)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

2 కామెంట్‌లు:

 1. నీలి మేఘము ల్గగనా న నిండి యుండి
  యేక ధారగా గురియుచు యేరు వాక
  కునిల వీలు గలుగగ జే సిన జలధర
  మునకు జేతును వందన ములిపు డార్య !

  రిప్లయితొలగించండి
 2. ఆర్యా, "స్వకుచ మర్ధన" అనే మాటలను ఏ సందర్భములో ఏ ఆర్థములో వాడతామో దయచేసి తెలుపగలరు.

  రిప్లయితొలగించండి