7, అక్టోబర్ 2016, శుక్రవారం

దత్తపది - 99 (వనము)

నాలుగు పాదాలను 'వనము'తో ప్రారంభించి
దేవీ నవరాత్రులను గురించి 
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

50 కామెంట్‌లు:

  1. వనమున జంతుజాలముల పాలిటనేలిక వాహనమ్మునై
    వనమునఁబుట్టు పుష్పపు నిభమ్ముగనై వదనమ్ము వెల్గ జీ
    వనముగఁ బ్రాణికోటికి శుభమ్మగు బోనమునిచ్చుతల్లి పా
    వనమగు దుర్గ తొమ్మిది క్షపమ్ముల పూజలనంది బ్రోచెడున్ ||

    క్షపా = రాత్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా, కవిమిత్రులకు మార్గదర్శకంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వనమున గుడిలో నుండి భు
    వనము నరయుచు శుభమిడు పాత్రిని సరి జీ
    వనమును గోరగ నే పా
    వనముగ నవరాత్రులందు వందించితిగా.

    (పాత్రి= గౌరీదేవి/పార్వతి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. 'వనము నరయుచును శుభమిడు/ వరము నరయుచు శుభమిచ్చు...' అనండి.

      తొలగించండి
    2. గురువుగారూ! నమస్కారములు . పొరబాటయినది . సరిజేసినందులకు కృతజ్ఞతలు.

      తొలగించండి


  3. వనముల మూలపుటమ్మ భు
    వనముల కాపాడు తల్లి వమ్మ జనుల పా
    వనముగ జూడుము నిత్తు హ
    వనముగ నిట పాదములను వందన మిడుచూ

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వందన మిడుచున్' అనండి.

      తొలగించండి
  4. వనములలోని పుష్పములు భక్తిగ దెచ్చుచు గొల్చువారి జీ
    వనమున సౌఖ్యసంపదలు వైభవవృద్ధులొనర్చుచుండి పా
    వనమగు సద్యశంబులిడి పాలన జేసెడు తల్లి నాదు భా
    వనమును శుద్ధి చేయునిది వాస్తవ మీనవరాత్రిదీక్షతోన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      చక్కని పూరణ చేశారు. అభినందనలు.

      తొలగించండి
  5. వనములు పలుగల భరతభు
    వనమునవిహరించుతల్లి పార్వతి జనజీ
    వనముల నవరాత్రులు పా
    వనమొనరింపంగవచ్చె ప్రణతులనిడరే !!!

    రిప్లయితొలగించండి
  6. వనమున పూసిన సుమములు
    వనమున శోభించు నంట వనదేవతకై
    వనమున సంతస మొంధుచు
    వనమున తమతల్లి యొడిని పరవశ మొందున్

    రిప్లయితొలగించండి
  7. వనమున సంపదయై పా
    వనమున మా తోడగుచును భాసిలు హేలా
    వనమున మేమిట నీ జీ
    వనమును సాగింతు మమ్మ పార్వతి! దుర్గా!

    రిప్లయితొలగించండి
  8. సిలికానాంధ్ర వారి సుజనరంజని పత్రికలో నా దత్తపది పూరణ....
    దత్తపది: పివి(పీవీ), సింధు, సాక్షి, మాలిక్ పదాలను అన్యార్ధములతో వాడుతూ ఒలింపిక్ క్రీడలను వర్ణించాలి.

    చూపి వివిధ క్రీడా ప్రతిభా పటిమను
    ప్రేక్షక జన సింధువు ఘోష పెచ్చరిలగ
    సకల క్రీడాభిమానమే సాక్షి కాగ
    విజయమాలికా ధారణ వేడ్క నొసఁగు.

    సుజనరంజని పత్రికలో నా దత్తపది పూరణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ దత్తపది పూరణ వేడ్కనొసగినది మాష్టారు....ప్రణామాలు

      తొలగించండి
    2. బాగున్నది గురువు గారు. నేను కూడా వ్రాసినాను. నా ప్రియ మిత్రులొకరు ఉపజాతులలో 4 పాదాలుంటేనే పద్ధతి అని చెప్పారు. మార్చి వృత్తము వ్రాస్తామనుకున్నాను కాని సమయము కుదరలేదు. అదే వుండిపోయింది.

      సారసాక్షి నియుద్ధపు సమరమందు
      చెలగిసింధువై వరుసమ్రోయించెగంచు
      బంతియాటలయందు పూబంతి యొకత
      వెండివెలుగులు చిందుచు విహృతి సలిపె
      భరత కీర్తి నిలిపి విశ్వ పటమునందు
      విజయమాలిక లొందిరి వెలదులటుల
      ఘనయొలంపిక్ చరిత నయగారమిదియె

      తొలగించండి
    3. సుమలత గారూ,
      కేవలం విషమపాదాలున్న (కందం, ఆటవెలది వంటి) పద్యాలకే 4 పాదాల పరిమితి. తేటగీతి, సీసం, సమవృత్తాలకు ఎన్ని పాదాలైనా వ్రాయవచ్చు. మీరు వ్రాసింది తేటగీతిక. దోషం లేదు!

      తొలగించండి
  9. వనమున విరులనొసంగి భు
    వనముల గాచు బహుభుజకు వందనమిడి పా
    వనముగ నవరాత్రుల జీ
    వనమున సౌఖ్యముల గోరి ప్రార్థింతుమదిన్!!!

    రిప్లయితొలగించండి
  10. వనముల బుట్టువు సుఖజీ
    వనముల మూలము నమేయ వసుతతి కిరవున్
    వనములదేలు దొరసతి, భు
    వనముల నేలు వరలక్ష్మి పదముల గొలుతున్

    రిప్లయితొలగించండి
  11. వనమున జేరి యచ్చటనె వాసము జేయగ నిశ్చయించి జీ
    వనమున శాంతి సౌఖ్యములు వచ్చుటకై తప మాచరించి పా
    వనముగ మానవాళికిని వాసి తప: ఫల మిచ్చుత !సుసే
    వనమును జేయగన్ మనకు వాసవి యీ నవ రాత్రి వేళలన్.
    ***&&&***
    "పాదాదిన" అనే నియమం మరచి పూరణ చేసినది"
    ***&&&***
    శాంతి నిండు గాత ! సకలమౌ భువనము
    జీవనమున హాయి చేరు గాత !
    గౌరి యిచ్చు గాత ! కమనీయ కవనము
    పావనముగ జగతి పరిఢవిల్ల !

    రిప్లయితొలగించండి
  12. వనమున వెలసిన గిరిజా !
    వనమున నినుశుద్ది జేసి పలువిధములుగన్
    వనమున గలిగెడు పూల భు
    వనమునకే తల్లి యైన పావని !గొలుతున్

    రిప్లయితొలగించండి
  13. వనముల నుండి భక్తిమెయి వర్షములెన్నియొ భీకరాన-జీ
    వనమునుజేయలేను సురవందితదివ్యకళామతల్లి -పా
    వనమునుజేసికొంచు హృది భాసురలీలచెలంగు భావనా
    వనమున విచ్చుకొన్నవిరి పాదములన్నవరాత్రులుంచెదన్.

    రిప్లయితొలగించండి
  14. వనములఁ దోగి శుచి యయి భ
    వనమున నవరాత్రుల నిల భక్త జన ఘనా
    వనమున మురియు భవాని భు
    వనముల నేలెడి లలితను భద్రను గొలుతున్

    [భవాని, లలిత, భద్ర లమ్మ వారి నామములు. ]

    రిప్లయితొలగించండి
  15. వనమున నిత్యము నీ భా
    వనములు మదిలోన మెదల పరమేశ్వరి పా
    వనమగు నీ సేవల జీ
    వనమును చేయుచు ముదమున వరలుచు నుంటిన్

    రిప్లయితొలగించండి
  16. వనముల నుండి భక్తిమెయి వర్షములెన్నియొ భీకరాన-జీ
    వనమునుజేయలేను సురవందితదివ్యకళామతల్లి -పా
    వనమునుజేసికొంచు హృది భాసురలీలచెలంగు భావనా
    వనమున విచ్చుకొన్నవిరి పాదములన్నవరాత్రులుంచెదన్.

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. వనమున బూయు పూలను సువాసిను లెల్లరు కూర్పుజేసి పా
      వనమగు గౌరిరూపమున వాసిగగ పేర్చుచు నృత్య సేవతో
      వనముగ కొల్చుచుందురిల పాటలబాడుచు నాడి వేడ్కతో
      వనమున కంపుచుందురట భక్తిఁ శరన్నవరాత్రులందునన్

      వనము=తోట
      వనముగ=సమూహముగా
      వనమున=జలమున

      వనముగ సువాసినులిట భు
      వనమ్ము లేలెడు జననిని బతుకమ్మను పా
      వనమగు రూపము నందు కవనముల బాడుచు కొలుతురు భక్తిగ గనరే

      వనము =సమూహము

      తొలగించండి
  18. వనమున నిష్ట తోడుతను పావనమైన తదీయనామ ని
    స్వనమును వల్లెవేసినను స్వాంతమునన్ నవరాత్రులందు జీ
    వనమున మంచి యౌనుకద! భార్గవి మన్నన తోడ కాచ, సాం
    త్వనము లభించు భక్తులకు ధారుణిలోనను నిశ్చయమ్ముగా

    రిప్లయితొలగించండి
  19. వనములు విరబూయును జీ
    వనములు పులకించు దుర్గ పదములు సోకన్
    వనములు పావనమౌ భా
    వనములు విలసిల్లు దివ్య భార్గవి కృపతో.

    రిప్లయితొలగించండి
  20. కవి మిత్రులకు విన్నపం ! "శంకరాభరణం' హోం పేజీ లోని "వర్గాలు" శీర్షిక క్రింద " నా కవిత" అనే ఉప శీర్షిక క్రింద శ్రీ కంది శంకరయ్య గారు రచించిన పద్య కవితలు చదవమని మనవి. చక్కగా ఆస్వాదించుటకు అనువైనవే గాక పద్య రచన చేయు వారికి బాగా ఉపయుక్తమని నా భావన.
    --గుఱ్ఱం జనార్దన రావు.

    రిప్లయితొలగించండి
  21. వనము వసంత లక్ష్మి|పరివారముగాచు ననంతశక్తి|భా
    వనమును బంచుభారతి|సవాలుగ దుష్టుల జంపుకాళి|దీ
    వనముగ తోడుగా విజయవాడన దుర్గనుపూజజేయ?జీ
    వనమున సౌఖ్యమౌ దసర|భాగ్యమగున్ నవరాత్రు లంతటన్|

    రిప్లయితొలగించండి
  22. వనమందొంటరియై చరించుపసిపాపాయేడ్చునేరీతిఁ జీ
    వనమంతామహిషాసురాజ్ఞ వశమై పాపాత్ముగానైతి సాం
    త్వనమే బొందకనేడ్చుచుంటి జననీ! పాషండుఁమర్దించి ని
    స్వనమై నామనమందునీవుఁగొలువై పాలింపవేయీశ్వరీ !

    రిప్లయితొలగించండి
  23. వనము, వహ్ని, వాయు వవనియు నీవె, జీ
    వనము పొంగు నీ భువనము నీవ!
    వనము నందు జిక్కు జనులను బ్రోచి పా
    వనము చేయు దుర్గ! వందనమిదె!

    రిప్లయితొలగించండి
  24. P.Satyanarayana
    వనమున దుర్గవై గృహపు వాకిట గౌరివి మట్టిబుట్టి పా
    వనముగ వాడలో శివుని పత్నివి బంగరు పూల రాణి! జీ
    వనమున నాటపాటల సభాస్థలి నీశ్వరి!తెల్గు బిడ్డ!యౌ
    వనమును బాల్య వృద్ధ జతివై నవరాత్రుల వెల్గు శాంభవీ!!
    P.Satyanarayan

    రిప్లయితొలగించండి
  25. వనములఁగాల్చివేయుదురు! వహ్నులఁదాచిరిపెట్టెలందు! పా
    వనమునుపాఱవోయుదురు! వాయువులే విషతుల్యమైనవే! జీ
    వనమికయెట్లు సాగవలెఁ? స్వార్థముఁబాపి మనుష్యజాతి సాం
    త్వనమిడఁగొల్వుడీప్రకృతిఁ పాతకనాశిని వీక్ష్యరూపమున్!

    రిప్లయితొలగించండి
  26. వనమున పూచిన పూలు భు
    వనమున వెలుగుచునె వాణి పదములబడి పా
    వనమును పొందునటులె జీ
    వనమున నవరాత్రి నంబ ప్రార్ధింత్రు జనుల్

    రిప్లయితొలగించండి
  27. వనమున్ శిరమున, గిరినే
    వనముగ గలవాని మేనిఁ బఱగుచు విష సే
    వనముఁ గొనినఁ బతి, జన జీ
    వనమునకది మేలను సతిఁ బ్రణతుల గొలతున్

    రిప్లయితొలగించండి
  28. వనమున విచ్చి నట్టి 'గిరిబాలవు,శారద 'శుక్ల పాద్యమిన్,
    వనముల సి0హ వాహనము పై మహిషాసురు గూల్తు వష్టమిన్
    వనములదేవి దుర్గవయి, వాసిగ పూజలనంది మాదు జీ
    వనముల బ్రోతు వమ్మ నవ వాసురలన్ నిను గొల్వ నివ్విధిన్

    రిప్లయితొలగించండి
  29. వనముగ మారె నా మనము వన్య మృగమ్ములు జేరె నారు యౌ
    వనమను క్రొవ్వు పేరి యవి వాంఛల కొమ్ముల క్రుమ్ముచుండె జీ
    వనమున శాంతి మృగ్యమయె భవ్య శరన్నవ రాత్రులన్ శ్రితా
    వనమున మేటి తల్లి నిను ప్రార్థన జేతును రక్ష సేయవే.

    రిప్లయితొలగించండి
  30. వనముల సుమములు గొని పా

    వనమగు పదములను గొల్చి భక్తుడు తమ జీ

    వనమున సుఖముల గోరి భు

    వనముల గాచు వరలక్ష్మి ప్రార్ధింత్రు మదిన్.

    రిప్లయితొలగించండి
  31. కవిమిత్రులకు మనవి...
    రేపు రాజమండ్రిలో తాతా సందీప్ శర్మ గారి పుస్తకావిష్కరణకు వెళ్ళాలని మధ్యాహ్నం నుంచే ఏర్పాట్లలో ఉండి సాయంత్రం స్టేషనుకు చేరుకున్నాను. టికెట్టు తీసుకొని రైలు కోసం నిరీక్షించాను. ఒకదాని తర్వాత ఒకటిగా రైళ్ళు విపరీతమైన (పండుగ) రద్దీతో నిండి కాలు పెట్టే అవకాశం లేకుండా ఉన్నాయి. వరంగల్లు నుండి రాజమండ్రిదాకా నిల్చొని ప్రయాణం చేసే ఓపిక లేదు. అందువల్ల టికెట్టు తిరిగి ఇచ్చేసి బస్టాండు చేరుకున్నాను. విజయవాడ బస్సు కిటకిటలాడుతున్నది. ఇక లాభం లేదనుకొని తిరుగుముఖం పట్టి ఇప్పుదే ఇల్లు చేరాను.
    రాజమండ్రిలో మిస్సన్న గారు కలుస్తారనుకున్నాను. గతమాసం వెళ్ళినప్పుడు 'గౌతమీ గ్రంధాలయం' చూడలేకపోయాను. ఈసారైనా చూడాలి అనుకున్నాను. దురదృష్టవంతుణ్ణి!
    ఈకారణంగా ఈ మధ్యాహ్నం నుండి మీ పూరణలను సమీక్షించలేకపోయాను. ఇప్పడు కూడా అలసిపోయి ఉన్నాను. రేపు ఉదయం చూసి స్పందిస్తాను.
    మన్నించండి.

    రిప్లయితొలగించండి
  32. ఎలాగూ రాజమండ్రి తప్పిపోయింది కనుక రేపు సాయంత్రం విజయవాడ, సత్యనారాయణ పురంలో రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అష్టావధానానికి వెళ్తున్నాను.

    రిప్లయితొలగించండి