26, జులై 2025, శనివారం

సమస్య - 5194

27-7-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“విజయోత్సాహమ్ము మిగుల వేదనఁ గూర్చెన్”

(లేదా...)

“విజయోత్సాహము తీవ్ర వేదనల ప్రాప్తిం గూర్చె నో దైవమా”

10 కామెంట్‌లు:

  1. అపజయమంచున నిల్చిన రారాజు అంతరంగం:

    కందం
    స్వజనులన ద్రోణ భీష్ములు
    విజయమ్మందింతు రన్న విశ్వాసమ్మే
    త్యజియింపగననిఁ జెలగెడు
    విజయోత్సాహమ్ము మిగుల వేదనఁ గూర్చెన్!

    మత్తేభవిక్రీడితము
    స్వజనమ్మౌ గురు, భీష్మకర్ణులొగి నిస్సందేహమౌ రీతిగన్
    విజయమ్మందఁగ జేతురంచుననిలో విశ్వాసమే వీగుచున్
    ద్యజియింపన్దగు నమ్మకమ్మదె వడిన్ తార్మారనన్ రేగెడున్
    విజయోత్సాహము తీవ్ర వేదనల ప్రాప్తిం గూర్చె నో దైవమా!

    రిప్లయితొలగించండి

  2. సుజనులు చెప్పిన నేమిర
    విజయము చేజారి పోయి వృత్రునిచే నే
    నజయము పొందితి, విమతుని
    విజయోత్సాహమ్ము మిగుల వేదనఁ గూర్చెన్.


    ప్రజలాశించు విధమ్మునన్ పటిమతో ప్రత్యర్థి నోడించుచున్
    విజయంబొందెదనంచు నే దలచి ప్రావీణ్యమ్ము నే జూపినన్
    విజయంబయ్యది జారిపోయె నచటన్ విద్వేషికిన్ దక్కెడిన్
    విజయోత్సాహము తీవ్ర వేదనల ప్రాప్తిం గూర్చె నో దైవమా.

    రిప్లయితొలగించండి
  3. (దుర్యోధనుడు కర్ణునితో చెప్పే మాటలు)

    మ.
    గజ సంభార గభీర దర్ప తతి దోర్గాండీవ నిర్ముక్త బా
    ణజ ఘోరాగ్ని దహింపగన్ మదిని తన్నైపుణ్యముం జూచి నా
    నిజ శౌర్యంబులు డస్సె సూర్యసుత నిన్నే నమ్మితిం, గయ్యమున్
    విజయోత్సాహము తీవ్ర వేదనలఁ బ్రాప్తిం గూర్చె నో దైవమా !

    రిప్లయితొలగించండి
  4. భజనల్ జేసితి దేవదేవునకు నేపంపిస్తి
    కాసుల్ గడున్
    ప్రజలన్ వేడితి వోటు వేయమని నే
    ప్రార్థించుచున్ జిత్రమే!
    ధ్వజమెత్తెన్ గెలుపొంది నా యెదుటి
    ప్రత్యర్థియే వాని యా
    విజయోత్సాహము తీవ్ర వేదనల
    ప్రాప్తిన్ గూర్చె నోదైవమా!

    రిప్లయితొలగించండి
  5. నిజముగ దురమున మనమే
    విజయము నొందెద మనుకొని వీగుచు నుండే
    ధ్వజిని యొనరిఃచు చుండిన
    విజయోత్సాహమ్ము మిగుల వేదనఁ గూర్చెన్

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. విజయము సముపార్జించగ
    సృజియించితి క్రొత్త దళము శ్రీకరమనుచున్
    స్వజనులు వీడిన పిమ్మట
    విజయోత్సాహమ్ము మిగుల వేదనఁ గూర్చెన్

    సృజియింపందగు నూత్న పక్షమనుచున్ సృష్టించితిన్ గ్రొత్తగా
    ప్రజలే తీర్పునొసంగ పొందితిగదా రాజ్యాధికారంబునే
    స్వజనుల్ కొందరు వీడిపోవ మిగిలెన్ సంక్షోభమే చూడగా
    విజయోత్సాహము తీవ్ర వేదనల ప్రాప్తిం గూర్చె నో దైవమా

    రిప్లయితొలగించండి
  8. విజయపు టా శలు వదలియు
    స్వజనులతో పలికె రాజు బాహా టముగా
    నిజము న్నారయ విమతుల
    విజయో త్సా హమ్ము మిగుల వేదన గూ ర్చె న్

    రిప్లయితొలగించండి
  9. స్వజనులు గురువులు విహితులు
    త్యజియించఁగ ప్రాణములను దందడియందున్
    విజయము సంప్రాప్తించెను
    విజయోత్సాహమ్ము మిగుల వేదనఁ గూర్చెన్

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సుజనులపై గెలుచుటకై
    కుజనులు వ్యూహాలు పన్ని కుట్రలు చేయన్
    విజయము వరించె, కుమతుల
    విజయోత్సాహమ్ము మిగుల వేదనఁ గూర్చెన్.

    రిప్లయితొలగించండి