27, జులై 2025, ఆదివారం

సమస్య - 5195

28-7-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ గనుమా”

(లేదా...)

“రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ”

(28వ తేదీ అయోధ్యా రాముని దర్శనం)

6 కామెంట్‌లు:

  1. కందం
    రాముడు ధర్మము గాచుచుఁ
    బ్రాముఖ్యమ్ము గొనె నేక పత్నీవ్రతుఁడై
    కాముకులనఁ బోలెడు సు
    త్రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ గనుమా!

    ఉత్పలమాల
    రామునిదొక్కమాటతగు! రాల్చును శత్రులనొక్క బాణమే!
    స్వామికి భామయొక్కతిగ! భాసిలె కీర్తిని ధర్మమూర్తిగన్
    కాముక రావణున్ దునిమె, కాంచగ కొల్వున వేశ్యలుండు సు
    త్రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ!

    రిప్లయితొలగించండి
  2. ఉ.
    శ్రీ మదఖర్వ ధర్మ గుణ శిల్పిత మంజుల వైభవాభలన్
    ద్యో మహిమన్ మహిం దనరఁ దోషము నింపుచు సజ్జనాళితో
    ప్రేమపు ధామమై పొలుపుఁ బెంపుగఁ జేసెడి లంకిణీ పురా
    రాముని పాలనంబుఁ గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ !

    రిప్లయితొలగించండి

  3. భూమిని ధర్మము నిలిపెడి
    యా మహనీయుని వనమున కంపితివట హే
    భామరొ యయోధ్య నేడది
    రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ, గనుమా.


    భూమిని ధర్మమున్ నిలుప భూజని పుట్టె మహీతలమ్మునన్
    కోమలివీవు కోరగనె కూరిమితోడను కానకేగెనా
    క్షేమకరుండు మాతరొ విచిత్రము గాంచవె నేడయోధ్యయే
    రాముని పాలనంబు గనరాని ప్రదేశమె, రామరాజ్యమౌ.

    రిప్లయితొలగించండి
  4. ఏమనుకొంటివి వినుమిక
    భూమిని గంజ దరి దులసి పుట్టిన రీతిన్
    ఈ మహినందునగల యే
    రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ గనుమా

    రిప్లయితొలగించండి
  5. రాముడు కానలకేగగ
    రాముని పాదుకల తోడ రాజ్యమునేలెన్
    రాముని తమ్ముడు భరతుడు
    రాముఁడు లేనట్టి రామరాజ్యముఁ గనుమా

    రాముని పాలనంబు కడు రమ్యమటంచు వచింతురెల్లరున్
    సేమము కూడునెల్లరకుఁ జీవనమే సుఖ శాంతు లీనగా
    రామపదాబ్జ రేణువులు గ్రక్కున భూమిని తాకినంతటన్
    రాముని పాలనంబు గనరాని ప్రదేశమె రామరాజ్యమౌ

    రిప్లయితొలగించండి