4, జులై 2025, శుక్రవారం

సమస్య - 5172

5-7-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాకర గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె”

(లేదా...)

“కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ”

6 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వింత యేమున్నదిందున విజ్ఞులార!
    చేదు తొలగంగ బెల్లముచింతపండు
    కూర్చి కూర్మినివండిన కూరతినఁగ,
    కాకర. ,గుడమ్ము వలెఁ, బుల్లగా రుచించె!

    ఉత్పలమాల
    శాకములెన్నియో గలవు స్వాస్థ్యము గూర్పగ భోజనమ్మునన్
    జేకురు గొప్పగన్ రుచులు శ్రేష్టమనంగను చింతపండు తోఁ
    జేకొని బెల్లమున్ తొలఁగ చేదది వండగ కూరరీతిగన్
    కాకరకాయఁ, దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ, పుల్లనౌ!

    రిప్లయితొలగించండి
  2. బాలునికి షడృచులదీరు పట్టువడక
    ఏ రుచిని యేమని బలుక నెరుకలేక
    వస్తువులను దినినగూడ బలికెనిటుల
    "కాకర గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె

    రిప్లయితొలగించండి
  3. ఉ.
    ప్రాకట మాధురీ భరిత వాంఛిత మద్యము గ్రోలి రాతిరిం
    బాకకుఁ జేరెఁ గర్షకుడు, బాతిగ భార్యయె బువ్వఁ బెట్టగం
    గాకర కూరఁ జూచుచు వికారపు మత్తునఁ బల్కెనిట్లు "నీ
    కాకర కాయఁ దెచ్చి తినగా నది బెల్లము వోలె పుల్లనౌ !"

    రిప్లయితొలగించండి

  4. ఇక్షు దేహపు యౌషధ మేది తెలుపు
    చెక్కరరుచి దేనివలెనో చెప్పు మంటి
    చింత పండే విధమున రుచించునంటి
    కాకర , గుడమ్ము వలెఁ , బుల్లగా రుచించె.


    పోకిరి మిత్రులంగలిసి మూర్ఖుడొకండట మద్యశాలకై
    చీకటి గొంగ తూర్పుదెస జేరక ముందున నేగుదెంచుచున్
    పీకల దాక ద్రావియట వెంగళు డట్లుగ వాగె నిట్టులన్
    కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ

    రిప్లయితొలగించండి
  5. సీధువును చాటు మాటున చేయువారు
    నల్లబెల్లము వండుట తెల్లముగద
    నల్ల బెల్లపు పాకాన నానినపుడు
    కాకర గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె

    చీకటిలో వినాశకర సీధువు సిద్ధముచేయ నెంచుచున్
    దేకువతోడ వండెదరు తియ్యని పుల్లని తాటిబెల్లమే
    ప్రాకటమైన భిన్నమగు పాకము నందున నాని యున్నదౌ
    కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ

    రిప్లయితొలగించండి
  6. చింత పండును బెల్లము చే ర్చి వండి
    నట్టి కాకర దినుచు తా నని యే విభుడు
    కాకర గుడ మ్ము వలె పుల్ల గా రుచి o చె
    మరియు కొంచము వడ్డించు మగువ నాకు

    రిప్లయితొలగించండి