12, జులై 2025, శనివారం

సమస్య - 5180

13-7-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వరద ముంచె జనులు ప్రమదమంద”

(లేదా...)

“వరదలు ముంచె నూరుఁ దమ భాగ్యమటంచు జనుల్ దలంపఁగన్”

7 కామెంట్‌లు:

  1. కరువుకాటకముల కష్టాలు చవిచూచి
    త్రాగు నీరు లేక తల్లడిల్లి
    వాన కొరకు జనులు ప్రార్థించుచుండగా
    వరద ముంచె జనులు ప్రమదమంద

    సరియగు వర్షపాతమును సాగుకునీరు లభింపకుండగా
    కరువుకు చిక్కి గ్రామటిక కష్టములన్ జవిచూచి యుండగా
    చెరువులు నిండునట్లు వరిచేలకు చాలినయంత నీటితో
    వరదలు ముంచె నూరుఁ దమ భాగ్యమటంచు జనుల్ దలంపఁగన్

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    వరదరూపమందు వారిధిఁ జేరెడు
    నంబువు కొరకని జలాశయమ్ము
    గట్టినంత, నింపు కాల్వలఁ బారుచు
    వరద ముంచె! జనులు ప్రమదమంద!

    (నింపు కాల్వలు = Reservoir feeder channels)

    చంపకమాల

    గురుతర బాధ్యతన్ ప్రభుత కూర్చ జలాశయ, మందునొక్కటే
    బురమది మున్గ వారలకు పుష్టిగ నా పరిహారమంచనన్
    మరియొక యూరినేర్పరచి మన్నన పంపఁగ, సాగునీరుగన్
    వరదలు ముంచె నూరుఁ దమ భాగ్యమటంచు జనుల్ దలంపఁగన్!

    రిప్లయితొలగించండి
  3. పంట పండి చేరు నింటికని దలచి ,
    మారుమూల నున్న మందు జల్ల ,
    చీడ పట్టి నట్టి చేను నంత నిపుడు
    వరద ముంచె ; జనులు ప్రమదమంద

    రిప్లయితొలగించండి
  4. పంట లెండు చుండె వర్షమ్ము కురియక
    నింగి వైపు చూచె నీరస ముగ
    వరుణ కరుణ చేత వర్షమ్ము లధిక మై
    వరద ముంచె జనులు ప్రమద మంద

    రిప్లయితొలగించండి
  5. చ.
    సరస విలాస భావముల సాంద్ర పటుత్వ గుణాఢ్య బుద్ధితో
    మురిసి కవీశుడచ్చట ప్రమోదముతోడుత నిల్పి, సత్కళా
    భరిత వినూత్న పద్యముల భాసిలఁ జేసెను దీపి కైతలౌ
    వరదలు ముంచె నూరుఁ దమ భాగ్యమటంచు జనుల్ తలంపగన్ !

    రిప్లయితొలగించండి

  6. ఉచితముగ ధనమ్ము నువిదల కిత్తుము
    వృద్ధులకు నెలనెల విత్తమిత్తు
    నోట్లకొరకు నచట నుచిత వాగ్దానాల
    వరద ముంచె జనులు ప్రమదమంద.


    ఇరువులు లేని పేదలకు నిచ్చెదమిండ్లను పేదవారలా
    దరణయె లేని వారకుచితమ్ముగ విత్తము పంచుచుందుమే
    మరువక నోటువేయుమను మాన్యుల వ్యర్థపు మాటలంచనే
    వరదలు ముంచె నూరుఁ దమ భాగ్యమటంచు జనుల్ దలంపఁగన్.

    రిప్లయితొలగించండి
  7. ఆ॥ కష్టములను సైఁచి కలసిమెలసి చన
    సేద్యమందు ప్రజలు చివరి వరకు
    విరియ ఫలములెన్నొ విరివిగ శుభముల
    వరద ముంచె జనులు ప్రమదమొంద

    చం॥ విరియఁగ నైకమత్యమటు ప్రీతినిఁ గాంచుచు సేద్య మెంచఁగన్
    బరఁగఁగఁ గష్టనష్టముల వాడి భరించుచు గ్రామమందునన్
    వరలఁగ సౌఖ్యసంపదలు భవ్యత మీరఁగఁ దృప్తి వెల్లువై
    వరదలు ముంచె నూరుఁ దమ భాగ్యమటంచు జనుల్ దలంపఁగన్

    వెల్లువ ప్రవాహము

    రిప్లయితొలగించండి