10, జులై 2025, గురువారం

సమస్య - 5178

11-7-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు”

(లేదా...)

“కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే”

 (పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

9 కామెంట్‌లు:

  1. జీవితమున దరికి జేర వచ్చెడి వారు
    పలు రకముల లావు బడయు చుంద్రు , 
    మనను కదియు వాని మంచి గూ ర్చి వినుట 
    కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    మధురకేగెదనని మాత యశోదను
    కృష్ణమూర్తి యడుగ, ఖేదమొంది
    యెందుకనుచు?ననియె,"నెక్కువ దినములు
    కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు!"

    ఉత్పలమాల
    "తిన్నగ వెళ్లియున్ మధురఁ దీరిచి కార్యము లెల్ల"వత్తునన్
    వెన్నునితో యశోదయనె, "వేడుక లెన్నియొ సల్పు నీవు నా
    కన్నులముందరన్ దిరుగ కమ్మని విందగు నిత్యమయ్య! నా
    కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే!"

    రిప్లయితొలగించండి

  3. మడుగు లోన మునిగె కొడుకని తెలిసి య
    శోద యటకు జేరె శోక మందు
    గొల్ల బాలలెల్ల గుమిగూడి రచ్చోట
    కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు.


    కన్నుల నీరునిండ నట కాంత యశోదయె చేరె పుత్రుడా
    పన్నుడు దుష్టపన్నగము వాసము నున్నతటాక మందునన్
    వెన్నుడు మున్గెనంచువిని వేగము నందట జేరె నామెకున్
    గన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే.

    రిప్లయితొలగించండి
  4. ఆ॥ భోగ లాలసతను మోదమొందు జనులు
    సుఖపు వేటయందు సొమ్మసిల్లు
    విధము నెంచి చూడ నధిక తృప్తి మధువు
    కన్నఁ గాంచ కున్నఁ గలత రేఁగు

    ఉ॥ ఎన్నుచు జీవితమ్మనఁగ నెప్పుడు నన్యముఁ దల్చకుండఁగన్
    మిన్నగు భోగ లాలసత మిక్కిలి మోదమటంచు సర్వదా
    గ్రన్నన పొందఁ గోరఁగను గాఢత హెచ్చుగ మద్యమాంసముల్
    కన్ననుఁ, గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే!

    కన్న ను పంచమీ విభక్తి ప్రత్యయంగా తీసుకున్నానండి నిఘంటువు సూచన ప్రకారము

    రిప్లయితొలగించండి
  5. సన్నుత భక్త పాలకుడు సాధు జనాళికి దిక్కు సప్త శై
    లోన్నత శేషతల్ప పురుషోత్తమ మాధవ పద్మనాభుడే
    యిన్నగ పాలుడై తిరుమలేశుడు దీపిలుచుండ స్వామి వెం
    కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే!!

    రిప్లయితొలగించండి
  6. తిరుమలగిరిపైన దరిసెన మమరినన్
    దిరుమలేశునిగన మరియొకపరి
    పర్వతంబు నెక్కి పావనమూర్తి వెం
    కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు

    పన్నుగ వేంకటేశ్వరుని పావనమూర్తిని జూచి వచ్చినన్
    గ్రన్నన జేయవచ్చని పరాత్పర రూపుని దర్శనంబుకై
    తిన్నగ కొండనెక్కెదరు దివ్యమనోహర రూపుడైన వెం
    కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే

    రిప్లయితొలగించండి
  7. మ్రొ క్కు బడిని దీర్చి ముడుపులు చెల్లి o చి
    ద ర్శినo బు సేయ దపన దీరు
    తగిన సమయ మందు తప్పని సరిగవెం
    కన్న గాంచ కున్న గలత రే గు

    రిప్లయితొలగించండి
  8. కన్నులార గాంచ కళ్యాణగుణధాము
    సరగున నరుదెంచ తిరుమలగిరి
    గాంచనైతినొక్క క్షణమైన, స్వామి వెం
    కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు

    రిప్లయితొలగించండి
  9. కన్నుల పండువై దనరు కైటభవైరి మనోజ్ఞ రూపమున్
    పన్నుగ గాంచనేగితిని పావన ధామము వేంకటాద్రికిన్
    కన్నుల వేంకటేశ్వరుని గానగనైతి నిమేషమైన వెం
    కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే

    రిప్లయితొలగించండి