25, జులై 2025, శుక్రవారం

సమస్య - 5193

26-7-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ”

(లేదా...)

“కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ” 

11 కామెంట్‌లు:

  1. ఉ.
    ప్రేముడిఁ జంద్రుఁ బోలు ముఖ లీలల నబ్బురమంది చూచి త
    త్కామ శరంబుచే మదిని గాయము నొందిన పెన్విటుండు నా
    రీమణి నింపుగా వలచి రిక్కలు మించగఁ బిల్చెనిట్లు "హే
    కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ !"

    రిప్లయితొలగించండి
  2. ఏమనుచు బిలువమందువు
    కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ
    ఆమని మొదలయ్యెనుగద 
    నీమము దప్పని విధముగ నికటకు రావా!

    రిప్లయితొలగించండి

  3. భామకు పర్యాయ పదము
    లేమిటొ వివరింపమనుచు నిష్యుడడుగగా
    నా మాణవకుడు తెలిపెను
    కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ.


    ఏమి పదమ్ములో తెలుపు మింతికి తుల్య పదంబులంచనన్
    శ్రీమతి మందహాసమున చెప్పెను చెల్వున కిట్లు వెంటనే
    తామరకంటి తోయలి నితంబిని పైదలి సద్యుపాస్యయున్
    గోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ.

    రిప్లయితొలగించండి
  4. ఏమని చెప్పగా వలయు నీధర
    స్త్రీలను గౌరవంబుగా
    "కోమలి వారిజాక్షి సఖి కొమ్మ
    తలోదరి నారి భామినీ"
    తామర కంటియంచునతి తాల్మని
    పిల్చుదు రెల్ల మానవుల్
    ఈమహి భారతావనిని యింతులు
    గేహపు లక్ష్ములే కదా.

    రిప్లయితొలగించండి
  5. శ్రీమతివై నా మదిలో
    ప్రేమను నింపిన గృహిణివి ప్రియమారగ ని
    న్నేమని పిలిచెదనో గద
    కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ!

    శ్రీమతివై నిరంతరము చెంతను నిల్చిన చారులోచనా!
    ధీమతివై సదా బ్రతుకు తియ్యగ మార్చిన పల్లవాధరా!
    ప్రేమను పంచినావుగద ప్రేయసి నిన్నిక నెట్లు పిల్తునో
    కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ!

    రిప్లయితొలగించండి
  6. నామదిలో నీతలఁపే
    భామరొ నిను వలచినాడ పర్వేందుముఖీ
    వామనయన లోలాక్షీ
    కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ

    రిప్లయితొలగించండి
  7. నామది నిండె నీ తలఁపు నా కనుపాపల నీదు రూపమే
    భామరొ నీదు సంగడిని బాయక నిల్పెద నెల్లకాలమున్
    నీమముతోడ నిన్నెపుడు నిక్కపు యర్మిలి జూచుకొందునో
    కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ

    రిప్లయితొలగించండి
  8. (ఇలాంటి వారు అరుదు. కాని ఉండక పోరనే ఆశతో)

    కం॥ ప్రేమగఁ బిల్లలఁ బెంచెనె
    నేమము వీడక చరించె నిరతముఁ దోడై
    యేమని పిల్వగఁ దగునో
    కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ

    ఉ॥ నేమముఁ గాంచి కష్టముల నిత్యము సైఁచెనె తోడునీడగన్
    బ్రేమము మీరవర్తిలుచుఁ బిల్లలఁ బెంచెనె మాతృమూర్తియై
    యేమని పిల్వగన్ దగునొ యెప్పుడు వీడని స్నేహశీలినిన్
    గోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ

    రిప్లయితొలగించండి
  9. శ్రీమతి ప్రా ణే శ్వరి యై
    భామ గ లాలించు చుండ పరమానంద o
    బై మగడు బిలి చె నామెను
    కోమలి జలజా క్షి సకియ కొమ్మ లతాంగీ!

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. ఏ మాత్రము సిగ్గూనక
      పో మగువలఁ గనిన నిత్యము పలవరించుం
      గామాతురుఁ డిబ్భంగినిఁ
      గోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ


      నీ మెయి చాల కోమలము నీ కను లందము లొల్కు పూవులే
      నా మది దోఁచితీ వడరి నా పర మాశ్రయ శాఖ వీవు నే
      నే మెయి గాంతు నీ యుదర మీ విల దేవత వల్గు దాటలం
      గోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ

      తొలగించండి