23, మార్చి 2026, సోమవారం

సమస్య - 5417

24-3-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వీణాధరీ దుర్గ విభవమ్ము లిమ్ము”
(లేదా...)
“వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా”

4 కామెంట్‌లు:

  1. ద్విపద
    వాణివై యొకచోట వాసిగా వెలసి
    రాణివై పరమేశు ప్రాణసఖివన
    రాణకెక్కితివె కొల్హాపురి రమగ
    వీణాధరీ! దుర్గ! విభవమ్ము లిమ్ము

    మత్తేభవిక్రీడితము
    స్థిరకీర్తిన్ గని బ్రోచితే జనని కాశ్మీరమ్మునన్ వాణివై!
    వర విశ్వేశ్వర తీర్థమందు మము గావంగన్ విశాలాక్షివై
    కురువన్ సంపద లక్ష్మివై మిగులగన్ గొల్హాపురంబందునన్
    వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ !సిరుల్ గూర్చుమా!

    రిప్లయితొలగించండి
  2. మ.
    స్థిర హృత్పీఠమునందు నీదు రుచిమత్సిందూర యుక్తాంఘ్రులం
    గరమౌ పూనికతోడి నిల్పెదను నీకై వేచి సద్బుద్ధికై
    వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ, సిరుల్ గూర్చుమా
    ధర నారాయణపత్నివౌచు సకలాధారంబు నీవే చుడీ !

    రిప్లయితొలగించండి

  3. ప్రాణ భాస్వంతపు వశవీవు నా పు
    రాణ పురుషునకు ప్రాణ సఖి రమ
    పాణిని పొత్తమున్ వాసిగ దాల్చు
    వీణాధరీ, దుర్గ, విభవమ్ము లిమ్ము.


    హరి డెందమ్మున నుందువో శివుని దేహార్ధంబునన్ నిల్తువో
    యరవిందాసను నాననమ్ము వగు విద్యాదేవివో నీవు మా
    మొర లాలింపగ రమ్ము వేగమున నంభోజాక్షి ధ్యానింతు నే
    వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా.

    రిప్లయితొలగించండి
  4. వాణివి నీవని వచియింతురమ్మ
    ప్రాణ రక్షవు నీవు భ్రామరివమ్మ
    క్షోణిపై వెలసిన గోమిని వమ్మ
    వీణాధరీ దుర్గ విభవమ్ము లిమ్ము

    గిరిపై నీగుడిఁ జేరి కొల్తుముగదా క్షేమంకరీ! శాంభవీ!
    మరినీరూపము రోజుకొక్కటనుచున్ మాతంగి నిన్ దీర్చగా
    పరమానందము గల్గజేయు దసరా భక్తాళి నేత్రాలకే
    వరవీణామృదుపాణివై వరలు శర్వాణీ సిరుల్ గూర్చుమా

    [విజయవాడ దుర్గ గుడిలో దసరా వేడుకల్లో అమ్మవారి అలంకారములు రోజు కొక్క రీతిని జేయుట విదితమే]

    రిప్లయితొలగించండి