11, మార్చి 2026, బుధవారం

సమస్య - 5405

12-3-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్”
(లేదా...)
“వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్”

15 కామెంట్‌లు:

  1. అలరెడు భక్తిగ పితరులు
    విలసిత మగు రీతి గాగ వేడుక మీరన్
    సలిపె డు గుడికి వినాయక
    తలి దండ్రుల పెండ్లి గనగ దరలిరి పుత్రుల్

    రిప్లయితొలగించండి
  2. కందం
    సలుప మనువు సీతారా
    ముల మాతాపితరులనుచుఁ బూనఁగ, వేదిన్
    వెలయగ శ్రీరామనవమిఁ
    దలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్


    ఉత్పలమాల
    పచ్చని పందిరిన్ మలచి పాప వినాశను రామచంద్రునిన్
    విచ్చిన పద్మనేత్రముల వేడ్కను పంచెడు జానకీ సతిన్
    మెచ్చియుఁ గన్నవారిగను మిన్నగ జేయఁగఁ బూనినంతటన్
    వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్

    రిప్లయితొలగించండి

  3. మలయమ్మకు శివునకు కో
    వెలలో నాడంబరమున పెండ్లి యటంచున్
    దలవగ గణపతి స్కందుడు
    తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్.


    పచ్చని తోరణమ్ములట వాసిగ గట్టిరి దేవళములో
    చిచ్చర కంటి గౌరులకు జేయ వివాహము భక్త కోటియే
    హెచ్చుగ రాగ స్కందుడు గణేశ్వరులిర్వురు గాంచ నెంచుచున్
    వచ్చిరి, తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్.

    రిప్లయితొలగించండి
  4. నెలవీడునందు గుడిలో్
    ఎలమిగ దమ తల్లితండ్రులిమ్ముగ జేయున్
    అలవాటయిన కుశలవుల
    తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్

    రిప్లయితొలగించండి
  5. తలచిరి రామయ తండ్రికి
    కులసతియౌ తల్లి సీతకును కోవెలలో
    నెలమిని పెండ్లి యొనర్పగ
    తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్

    పచ్చని తోరణమ్ములును పండుగ పొంకము సందడింపగా
    నచ్చిన తండ్రిరాముడని నచ్చిన తల్లిమహీజ యంచు వా
    క్రుచ్చిన భక్తులా దినము కోవెలకేగిరి పెండ్లి సేయగా
    వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్

    రిప్లయితొలగించండి
  6. కలగా గడచెను కాలము
    సలుపు యరువదేండ్ల నాటి సంబరములలో
    మలివయసున జరుపుకొనెడు
    తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్

    రిప్లయితొలగించండి
  7. కం:పిలువగ బెండ్లికి "వారల్
    తొలి నుండియు శత్రువు"లని దూరుచు "బోవన్
    వల"దనగ లెక్క జేయక
    తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్”
    (ఆ ఇంట్లో పెళ్లికి వెల్ల వద్దని చెపితే తల్లిదండ్రుల్ని లెక్క చెయ్యకుండా కొడుకులు వెళ్లారు. )

    రిప్లయితొలగించండి
  8. కం॥ తలఁపఁగఁ దండ్రి రఘువరుఁడు
    వలచిన తల్లి ధరణిజ వివాహముఁ జేయన్
    బలువురు వీరికి నవమిన
    తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్

    ఉ॥ అచ్చెరువేల రామయయె యందరి తండ్రి మహీజ తల్లియౌ
    త్రచ్చఁగఁ బూరుషుల్ సుతులు ధన్యతఁ గాంచఁగ దేవళమ్ములన్
    మెచ్చుచుఁ జేయ రామనవమిన్ మనువున్ బ్రతి యేఁడు ప్రీతితో
    వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్

    రిప్లయితొలగించండి
  9. ఉ:మెచ్చక తల్లిదండ్రులను, మీరుచు నీతి ననాథలట్లుగా
    నెచ్చటొ యాశ్రమమ్మున వసింపగ బంపిన ,బౌత్రు బెండ్లి నా
    వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ, పుత్రులెల్లరున్
    జచ్చు ముఖమ్ములన్ తగిన శాస్తి యటంచు దలంచి రాత్మలన్.
    (తల్లిదండ్రులని కొదుకులు వృద్ధాశ్రమానికి పంపించేసారు. కానీ మనుమడి పెండ్లి అనగానే వాళ్లే చూడటానికి వచ్చారు. అది చూసి కొడుకులు తమ తప్పు గ్రహైంచి చచ్చు ముఖాలు వేసుకున్నారు. అది వాళ్లకి నిజం గా అవమానమే. "తల్లిదండ్రుల" అంటే "తల్లిదండ్రులే" అనే అర్థం లో వాడాను.)

    రిప్లయితొలగించండి
  10. ఇలలో భక్త సమాజము
    సలలిత రీతి నొనరింప సంతోషముతోఁ
    గులుకుచు నుమామహేశుల
    తలిదండ్రుల పెండ్లిఁ గనఁగఁ దరలిరి పుత్రుల్


    మెచ్చఁగ నెల్ల బంధువులు మిత్రులు నందఱు మిక్కటమ్ముగా
    నచ్చపు వృద్ధ దంపతుల కత్యధికమ్ముగఁ బ్రీతి నీయఁగా
    వచ్చెను షష్టిపూర్తి కడు వైభవ మొప్పఁగఁ జేయ నెంచుచున్
    వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగఁ బుత్రు లెల్లరున్

    రిప్లయితొలగించండి
  11. ఆలయ రంగ స్ధలమునఁ
    దలిదండ్రులపెండ్లిఁగనఁగదరలిరి పుత్రుల్
    సలలిత విన్యా సంబుల
    విలసింపంజేసిరచట వీనుల కింపౌ

    రిప్లయితొలగించండి
  12. పచ్చని కాపురమ్ము పసిపాపలు తారటలాడు లోగిలిన్
    పచ్చనితోరణాలు పొలుపారగ గట్టిరి షష్టిపూర్తికిన్
    వచ్చితిరెల్ల బందుగులు వావిరిగా తిలకించ వేడుకన్
    వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁ జూడఁగ పుత్రులెల్లరున్

    రిప్లయితొలగించండి
  13. ముచ్చట గొల్పునాసతిని మూఁడగు కన్నులు గల్గువానికిన్
    బచ్చగనుండు గద్దెపయి పాణికి పాణిని గల్పఁజేయగా
    వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁజూడఁగ పుత్రులెల్లరున్
    జెచ్చెర దేవలోకమును జిన్మయ మూర్తులఁజూడ వచ్చెనే

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కలిసి చరవాణి యందున
    తలచి సలుప షష్టిపూర్తి తలిదండ్రులకున్
    పలు దేశమ్ముల నుంచియె
    తలిదండ్రుల పెండ్లిఁ గనగఁ దరలిరి పుత్రుల్.

    రిప్లయితొలగించండి
  15. షష్టిపూర్తికిదియె తగు సమయ మనుచు
    తండ్రి మరల తల్లికిపుడు తాళిబొట్టు
    కట్టు ననుచు సంబరమున గనగ సంతు
    తల్లి దండ్రుల పెండ్లికి దరలిరెల్ల

    రిప్లయితొలగించండి