4, ఆగస్టు 2025, సోమవారం

సమస్య - 5203

5-8-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కరమునఁ దిలకమ్ము గంటఁ గంగణ మమరెన్”

(లేదా...)

“కరమున బొట్టు నేత్రమునఁ గంకణ మొప్పెను భామ కయ్యెడన్”

(రావిపాటి లక్ష్మినారాయణ గారి 'సమస్యాపూరణ' గ్రంథం నుండి)


15 కామెంట్‌లు:

  1. కందం
    సరసమ్మున నవవధువును
    వరుండు వివిధ రతికేళి భంగిమలందున్
    బరవశమొందించు కతనఁ
    గరమునఁ దిలకమ్ము గంటఁ గంగణ మమరెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      సరసమె శోభనంపు సిరిసంపద నూత్నవధూవరాళికిన్
      వరుఁడు వధూటి సోయగఁపు భాగ్యమునన్ రతికేళి మున్గుచున్
      బరిపరి భంగిమల్ దెలిసి వాంఛలరంజిలి జంట దేలఁగన్
      గరమున బొట్టు నేత్రమునఁ గంకణ మొప్పెను భామ కయ్యెడన్!

      తొలగించండి
  2. సురుచిరఛాయాగ్రహణము
    వరనిశ్చయవేళయందుఁబఱగుచునుండన్ఁ
    బరిఁబరిభంగిమలలరగ
    కరమునఁ దిలకమ్ము గంటఁ గంగణ మమరెన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  3. చ.
    సురవర మౌని సంతతులు సొంపుల ద్వీపమునందు చేరి ప్ర
    స్ఫురదసమాన కాంతులను జూచుచు భక్తిని చేగొనన్ మహ
    త్తరమగు పీఠమందున సదాశివు దేవికి నొప్పె తారకా
    కరమున బొట్టు నేత్రమునఁ, గంకణమొప్పెను భామకయ్యెడన్ !

    (తారకాకరము - ఆకాశం)
    ఆకాశానికి సూర్యుడు, చంద్రుడు బొట్లుగా ప్రకాశిస్తుంటారు. అమ్మవారికి నేత్రాలే కదా !

    రిప్లయితొలగించండి
  4. గరువముగ బొట్టు దిద్దుచు
    నెరవుగ కడెము నొకదాని నిలుపు మనగనే
    చిరుతడు గీసిన పటమున
    కరమునఁ దిలకమ్ము గంటఁ గంగణ మమరెన్

    రిప్లయితొలగించండి

  5. పిరిమిని చేరగ రమ్మని
    తరుణియె గోరింట పెట్టె దక్షత తోడన్
    మరదలి సుకుమారంబగు
    కరమునఁ దిలకమ్ము , గంటఁ , గంగణ మమరెన్.


    తరుణి కురంటకమ్మెచట దాల్చును? ఫాలము బెట్టునేమిటో?
    నరయగ నంజనమ్మదియె యద్భుత రీతి ధరింతు రెచ్చటో?
    కరమున భూషణమ్మగుచు కల్పము నెవ్వరి కొప్పు చెప్పుమా
    కరమున , బొట్టు , నేత్రమునఁ , గంకణ మొప్పెను భామ కయ్యెడన్.

    రిప్లయితొలగించండి
  6. -

    మొరలిడి వేడెను మోడ్చిన
    కరమున; తిలకమ్ము కంట, కంకణ మమరెన్
    మురిపెము జూపెడు పతియున
    మరె; వేంకటనాధుని మహిమయిదియె గనరే


    రిప్లయితొలగించండి
  7. విరిని సపత్నికొసగగా
    కరములలోమోముదాచి కలవరపడుచున్
    మరి సత్యభామ వగచెను
    కరమునఁ దిలకమ్ము గంటఁ గంగణ మమరెన్

    మురరిపుడిచ్చె పుష్పమును ముద్దియ రుక్మిణి కన్నవార్తయే
    వరలగ కిన్కబూనెనట వారిజలోచన సత్యభామయే
    కరముల మోము దాచుకొని క్రందెను కోపము వృద్ధినొందగా
    కరమున బొట్టు నేత్రమునఁ గంకణ మొప్పెను భామ కయ్యెడన్

    రిప్లయితొలగించండి
  8. తిరుమల దేవుని ప్రతిమకు
    కర మొ ప్ప గ దీర్చి దిద్ధ కమనీ యము నై
    నిరుపమ రీతి గ గనపడె
    కరమున తిల కమ్ము గంట గంక ణ మమరె న్

    రిప్లయితొలగించండి
  9. కం:ధరియించగ తిలకమ్మును
    కరమున సీసాను బట్ట గా నిదిగో! ఆ
    భరణము గొంటి ననగ పతి
    కరమునఁ దిలకమ్ము గంటఁ గంగణ మమరెన్”

    రిప్లయితొలగించండి
  10. కం॥ త్వరగ లిఖించఁగ బాలుఁడు
    పరీక్ష యందున ముడివడి వర్ణనఁ జేసెన్
    సరగునను దలక్రిందుగఁ
    గరమునఁ దిలకమ్ము గంటఁ గంగణ మమరెన్

    చం॥ త్వరగ లిఖించు యత్నమున వర్ణన సేయుచు సంభ్రమమ్మటుల్
    పరఁగఁగ ప్రశ్నలన్నిటిని వ్రాయఁగ నెంచి పరీక్ష యందునన్
    బిరబిర వ్రాసె బాలుఁడిటు పెండిలి కూతురు సోయగమ్మునున్
    గరమున బొట్టు నేత్రమునఁ గంకణ మొప్పెను భామ కయ్యెడన్

    (ఇది చాలా సామాన్యమైన psychological phenomenon అండి. ఆత్రముగా ఉన్నపుడు. అలాగే 7568 నంబరు చెప్పమంటే టక్కున 7658 అని కూడ చెప్పేది సర్వసామాన్యం. Retrieving from memory under haste causes such mistakes)

    రిప్లయితొలగించండి
  11. చం:కరముల పొట్టు పొయ్యి గొని గట్టిగ పొట్టు ను గూరుచుండి దు
    ర్భరమగు పేద జీవితము బట్టిన సుందరి భాగ్య శాలియౌ
    వరుడు లభించె నంచు విన బంగరు కంకణ మూహ నిల్వగా
    కరమున బొట్టు నేత్రమునఁ గంకణ మొప్పెను భామ కయ్యెడన్”
    (పూర్వం గ్యాస్ స్టౌలు కొత్తగా వస్తున్న రోజుల్లో పొట్టు పొయ్యిలు ఉండేవి.అంద మైన ఆ పేదపిల్ల చేత్తో పొట్టు కూరుతుండగా తనకి భాగ్యవంతుడైన వరుని సంబంధం కుదిరిందని తెలిసింది.ఆమె చేతిలో పొట్టు ఉంది కానీ కళ్లలో బంగారు కంకణం ఊహగా మెరిసింది.)

    రిప్లయితొలగించండి
  12. అరుదెంచిన నా కృష్ణుని
    నరయు తమకము మితిమీఱ నక్కట విరహా
    తుర యైన గోప కాంతకుఁ
    గరమునఁ దిలకమ్ము గంటఁ గం కణ మమరెన్

    [కం కణము = నీటి బొట్టు]


    విరులు శిరమ్ము నందుఁ గనిపింపఁగఁ గర్ణము లందు దుద్దులుం
    బరఁగఁ పసిండి యొడ్డణము భవ్య పదాంగుళి వెండి మట్టెలుం
    దరుణి ధరింపఁగా నుదుటఁ, దద్దయుఁ దన్మయయై కరమ్మునం,
    గరమున బొట్టు నేత్రమునఁ గంకణ మొప్పెను భామ కయ్యెడన్

    [నుదుట ధరింపఁ గరమున బొట్టు; కరమ్మునన్ ధరింప నేత్రములో (మెఱసిన) కంకణము నొప్పెను]

    రిప్లయితొలగించండి