16, ఆగస్టు 2025, శనివారం

సమస్య - 5215

17-8-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గ్రామసింహ మగుచు రాజు నెగడె”

(లేదా...)

“గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా?”

9 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    శత్రుదేశమెగసి సమరమ్ముబూనగన్
    సాహసానమేటి వ్యూహమెంచి
    యప్రతిహతరోషుఁడనఁ జెలరేఁగి సం
    గ్రామసింహ మగుచు రాజు నెగడె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తకోకిల
      సేమ మన్నది వీసమెంచక చేవలేకయె వైరులున్
      గామితమ్ములు దీర్చు దేశము గ్రమ్మినంతట దూకఁగన్
      ధీమసమ్మగు వ్యూహమెంచియుఁ దేజమొప్పెడు రీతి సం
      గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా!

      తొలగించండి
  2. తేజరిల్లు సాహితీసమరాంగణ
    సార్వభౌముడనుచు సన్నుతింత్రు
    కృష్ణరాయవిభుడు కృతకృత్యుడుగద సం
    గ్రామసింహ మగుచు రాజు నెగడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నామమాత్రపు శక్తిఁ జూపగ నాశమేగద శత్రువుల్
      రామ రాజ్యముఁ బోలురీతిన రాజ్యమేలెను రాయలే
      సామరస్యము తోడఁ గాంచెను సత్కవీంద్రులనెల్ల సం
      గ్రామసింహముగాఁ జరించిన రాజు సన్నుతులందఁడా?

      తొలగించండి
  3. మత్తకోకిల.
    సేమమందగ జేయ పూనెను క్షిప్రమౌ గతి చూడగా
    నేమముం జని శత్రువీరుల, నీచ యూధము చంపి యీ
    భూమి కావ జనాళి మెచ్చిన భూరి కీర్తిని గొన్న సం
    గ్రామ సింహముగా జరించిన రాజు సన్నుతులందడా ?

    రిప్లయితొలగించండి


  4. జనుల క్షేమమంచు శాంతిగోరిననేమి
    శత్రు వొప్పకున్న స్వాతి దాల్చి
    మొగ్గరమున గొంగ మూకల ద్రుంచ, సం
    గ్రామసింహ మగుచు రాజు నెగడె.


    రామరాజ్యము వోలె తానును రాజ్యపాలన చేయుచున్
    ప్రేమతోజన బాధలన్నియు విన్నవెంటనె తీర్చుచున్
    భీమరమ్మున శత్రుమూకల విత్తుమాల్చెడి జవ్రి సం
    గ్రామసింహముగాఁ జరించిన రాజు, సన్నుతులందఁడా?.

    రిప్లయితొలగించండి
  5. క్షేమమెంచియు నెల్లవేళల జేర
    దీసియు పౌరులన్
    రామరాజ్యము తీరునేలుచు
    రక్ష చేసెడు రాజు తా
    క్షామమందున పేదవారల
    కష్ట మార్పగ జూడ సం
    గ్రామ సింహముగా చరించిన
    రాజు సన్నుతులందడా

    రిప్లయితొలగించండి
  6. రాజ్య ప్రజల కెపుడు రక్షణ నొసగుచు
    వారి నెపుడు బరుల బారి నుండి
    కాపు కాయు చున్న కతన దే శమునకు
    గ్రామసింహ మగుచు రాజు నెగడె

    రిప్లయితొలగించండి
  7. రాజ్య ప్రజల నెల్ల రక్షించు కొఱకు నై
    యరి భయంకరు డు గ నలరు చుండి
    యుద్ధ మందు గొప్ప యో ధు డై మి o చి సం
    గ్రామ సింహమగుచు రాజు నెగడె

    రిప్లయితొలగించండి