14, ఆగస్టు 2025, గురువారం

సమస్య - 5213

15-8-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సుధ పంటలు పండ జనుల క్షోభలు దీరున్”

(లేదా...)

“సుధ పండన్ పలు పంటలన్ జనుల విక్షోభంబు దీరున్ గదా”

6 కామెంట్‌లు:

  1. కందం
    విధి యనుకూలింపంగన్
    వ్యధతీరఁగ కర్షకాళి వ్యవసాయమునం
    దధికమ్మగు శ్రమనొలుక వ
    సుధ పంటలు పండ జనుల క్షోభలు దీరున్

    మత్తేభవిక్రీడితము
    విధి ప్రావమ్మయి వర్షముల్ గురిసి సంప్రీతిన్ ప్రవర్తింపఁగన్
    వ్యధతీరంగను కర్షకాళి వ్యవసాయంబెంచి సద్వృత్తినం
    దధికమ్మైన శ్రమన్ గమింప దిగ శ్రాంతంబున్ 'వ' పూర్వంబునౌ
    సుధ పండన్ పలు పంటలన్ జనుల విక్షోభంబు దీరున్ గదా

    రిప్లయితొలగించండి

  2. విధివక్రించుచు నెప్పుడు
    నధిక దిగుబడులవి లేక నందక పంటల్
    వ్యధ జెందెను జాతియె, హే
    సుధ ! పంటలు పండ జనుల క్షోభలు దీరున్.


    అధికంబయ్యె జనాభ పంటలవియే యల్పంబుగా దక్కగా
    వ్యధచెందన్ ఫలముండబోదుకద ప్రత్యామ్నాయ మార్గాలకై
    బుధవర్గమ్మును సంప్రదించి యెరువుల్ మోతాదునే మార్చు హే
    సుధ ! పండన్ పలు పంటలన్ జనుల విక్షోభంబు దీరున్ గదా.

    రిప్లయితొలగించండి
  3. కందం:
    క్షుధతో నటమట నొందుచు
    వ్యధలన్ జిక్కిన మనుజుల పల్లటముడుగన్
    ప్రథితమగు విత్తుఁ జల్లి వ
    సుధ పంటలు పండ జనుల క్షోభలు దీరున్

    మత్తేభము:
    క్షుధతో నంకిలిపాటునొంది కడు నస్తోకంబుగా నిచ్చలున్
    వ్యధలం జిక్కిన కర్షకాళి యిడుముల్ బాపంగ శాస్త్రీయమౌ
    పథముల్ కన్గొని జేయ సేద్యమపుఁడే ప్రాప్తించునా క్షోణిలో
    సుధ పండన్ పలు పంటలన్ జనుల విక్షోభంబు దీరున్ గదా

    రిప్లయితొలగించండి
  4. మ.
    విధు రత్నాంచిత జూటధారి విలసద్విఖ్యాత కారుణ్య కాం
    తి ధరన్ వాసి వెలింగి క్షామను వడిన్ తీర్పంగ వీతెంచుగా
    విధిలో నమ్మిక ముఖ్యమౌ వినుమ సుప్రీతిన్, వరాకల్పమౌ
    సుధ పండన్ పలు పంటలన్ జనుల విక్షోభంబు తీరుం గదా !

    రిప్లయితొలగించండి
  5. పృథివిపయి పుట్టిన మొదలు
    విధిగా సమకొనవలసిన విపణుల దలచన్
    అధమముగ ప్రజకు సరిపడు
    సుధ , పంటలు పండ జనుల క్షోభలు దీరున్

    రిప్లయితొలగించండి
  6. అధికంబౌ వర్షముతో
    వ్యథలన్ గర్షకులు చిక్కి వాపోదురిలన్
    విధి యనుకూలంబైన వ
    సుధ పంటలు పండ జనుల క్షోభలు దీరున్

    వ్యథలందీర్చు కృషీవలుల్ శ్రమముతోఁ బండింతురీనేలపై
    విధివంచింపగ పంటనాశమవగా విభ్రాంతితో వారిటన్
    వ్యథలంజిక్కుట చూచుచుంటిమికదా హర్షంబు తోడన్ ధరా
    సుధ పండన్ పలు పంటలన్ జనుల విక్షోభంబు దీరున్ గదా

    రిప్లయితొలగించండి