27, ఆగస్టు 2025, బుధవారం

సమస్య - 5226

28-8-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు”

(లేదా...)

“మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా”

6 కామెంట్‌లు:

  1. జనుల చీత్కరింపు దొరకు శాశ్వతముగ
    మదిరఁ గ్రోలు వారలకె ; సన్మానమబ్బు
    తాను త్రాగెడు నీటినె దప్పి గొనిన
    వారి దాహము దొలగించ వలనుగనిడ

    రిప్లయితొలగించండి
  2. మ.
    విదితంబైన విధానముల్ విడువ క్రొవ్వెర్రుల్ తలల్ వీచు న
    ప్డు దశల్ ధోరణి మారు సంఘమున వ్యామోహంబు వ్యాపించు, నీ
    మద మాత్సర్య గుణాన్విత ప్రకట దుర్మార్గాఢ్య లోకంబులో
    మదిరాపాన విశేష మత్తులకె సన్మానంబు దక్కుం గదా !

    రిప్లయితొలగించండి

  3. అదియె మధురమైనదనుచు నమృత తుల్య
    మనుచు విశ్వసించి సతము మనము నందు
    రామ యని స్మరియింప నా నామమనెడి
    మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు



    హృదయంబందున రామనామమునె ప్రత్యేకమ్ముగా దాల్చి య
    య్యదె మోక్షార్థికి దివ్యమంత్రమని నిత్యంబయ్యదే ధ్యానమై
    వదలన్ లేని జపానురక్తులగుచున్ భక్తాళి రామమ్మనే
    మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా.

    రిప్లయితొలగించండి
  4. వలలుడు సైరంధ్రితో....

    తేటగీతి
    మదిరఁ గోరఁగ రాణియె, బెదరకుండ
    కీచకుని కడకేగి కన్గీటి బిలిచి
    నర్తనంపు శాలకుఁ జేర్చ, నా పిడికిట
    మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు!

    మత్తేభవిక్రీడితము
    సుదతీ! రాణియె కోరగన్ మదిరకై సొంపారగన్ జేరియున్
    మదనోద్రేకమునందుఁ దేలు పగతున్ మారాముగన్ బిల్చియున్
    గుదరన్ నర్తనశాలఁజేర్చఁ గనుమా! కోరన్ బరస్త్రీఁ గుతిన్
    మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా!

    రిప్లయితొలగించండి
  5. ఆంధ్ర గీర్వాణ భాషల నభ్యసించి
    ధారణయు,ధాటి,ధారయు,ధైర్యమబ్బ
    పృధ్వి నవధానులగుచు కవిత్వమనెడు
    మదిర గ్రోలు వారలకె సన్మానమబ్బు.

    మదిలో నిత్యము భారతింగొలుచుచున్ మాన్యుల్ సదా మెచ్చ,సం
    సదులందున్ మధురంపు పద్యకవితా సౌందర్యముంజూపగా
    పదముల్, భావము,రీతి,శయ్యలు తగన్ వర్తిల్ల తత్ సాహితీ
    మదిరా పాన విశేష మత్తులకె సన్మానంబు దక్కున్ గదా!

    రిప్లయితొలగించండి
  6. మధుర భావనా సాహిత్య మనగ నొప్పు
    పద్య రచనకై నిరతము పాటు పడుచు
    రచనలు వెలువరించి సారస్వతమను
    మదిరఁ గ్రోలు వారలకె సన్మానమబ్బు

    మది సాహిత్యము పైన నిల్పి సతతంబాలోచనల్ చేయుచున్
    మృదుభావాన్విత కావ్య సృష్టి సలుపన్ మేధావులే మెచ్చగా
    విదితంబౌ కవి చాకచక్యము భళా! విజ్ఞాన సారస్వతా
    మదిరాపానవిశేషమత్తులకె సన్మానంబు దక్కున్ గదా

    రిప్లయితొలగించండి