10, ఆగస్టు 2025, ఆదివారం

సమస్య - 5209

11-8-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శనివారము నాఁడు భార్య శత్రువగుఁ గదా”

(లేదా...)

“శనివారమ్మున నా పతివ్రతయె వైషమ్యమ్ముఁ జూపున్ గదా”

11 కామెంట్‌లు:

  1. మ.
    దినరాడ్జృంభణ కాల సంవృత విపత్తీక్షాంశు తాపంబులో
    పని నే దైవముగాఁ దలంచితి ధనంబాశించి కష్టింప నా
    చిని చాపల్యము సేత మత్తులెసగన్ సేవింతు మద్యంబు నీ
    శనివారమ్మున, నా పతివ్యతయె వైషమ్యమ్ముఁ జూపుం గదా !

    రిప్లయితొలగించండి

  2. పెనిమిటినే పరమాత్ముని
    గను దలచుచు పాదపూజ ఘనముగ సేయన్
    మునిభేషజమందుంచుచు
    శనివారము నాఁడు భార్య శత్రువగుఁ గదా.


    ఘనుడౌ వేంకటనాథ తుల్యుడనుచున్ గాంతుండనే జేరుచున్
    వినయమ్మెంతయొ జూపుచున్ బతిని సేవింపన్ నిరాహారియై
    మనువున్ సైతము పస్తులుంచి సతి సమ్మానింప తానెంచినన్
    శనివారమ్మున నా పతివ్రతయె వైషమ్యమ్ముఁ జూపున్ గదా.

    రిప్లయితొలగించండి
  3. ఈ నెల శ్రావణ మగుటన
    వనిత పతి  ససి కయి శుక్రవారము నందున్ 
    నొనరించె నోము , మగనికి
    శనివారము నాఁడు భార్య శత్రువగుఁ గదా

    రిప్లయితొలగించండి
  4. దినకరతనయుని మహిమను
    కొనియాడగనెవరి తరము కొంపలు ముంచున్
    శని పిరివీకులువెట్టిన
    శనివారము నాఁడు భార్య శత్రువగుఁ గదా

    శనిసంప్రాప్తము కల్గజేయునుకదా సర్వాత్మకున్ గ్లేశముల్
    శనితేజస్సున చెట్టుతొఱ్ఱఁ బ్రబలెన్ సాక్షాన్మహాదేవుడే
    శనివెంటాడిన దాపురించు వెతలే సంసారమే ధ్వంసమౌ
    శనివారమ్మున నా పతివ్రతయె వైషమ్యమ్ముఁ జూపున్ గదా

    రిప్లయితొలగించండి
  5. పనులందు విరామమెపుఁడు
    గననోచక సతిని విడచి గడపిన కతనన్
    కినుక వహించఁగ పతియెడ
    శనివారము నాఁడు భార్య శత్రువగుఁ గదా

    రిప్లయితొలగించండి
  6. కం:శనివారపుటుపవాస
    మ్మును వదలుచు బెండ్లి విందు ముచ్చట బడగా
    నను మానిపించె నా సతి
    శనివారము నాఁడు భార్య శత్రువగుఁ గదా”
    (ఉపవాసాల పట్టింపు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువ.విందు భోజనం ఎంజాయ్ చేద్దా మనుకుంటుంటే ఆడవాళ్లు శనివారాన్ని గుర్తు చేస్తారు.)

    రిప్లయితొలగించండి
  7. కం॥ దినదినము మాంస భక్ష్యముఁ
    దిను భర్తను సతియు మిగుల తృప్తి పరచినన్
    వినయముగఁ బూజ సేసెడి
    శనివారము నాఁడు భార్య శత్రువగుఁ గదా

    మ॥ కనఁగన్ భర్తయె మాంస భక్షణము నాకాంక్షించఁగన్ సర్వదా!
    తనరెన్ భార్యయు భర్త యిచ్ఛనటు సంధానించుచున్ నెమ్మితో
    మనమున్ మిక్కిలి భక్తి భావమెగియన్ మాంసమ్మునే తాకకన్
    శనివారమ్మున నా పతివ్రతయె వైషమ్యమ్ముఁ జూపున్ గదా

    (కొందరు ప్రతిరోజు మాంసాహారం తిన్నా ఒక్క శనివారం తినరండి. పురుషులలో కొంతమంది శనివారం కూడ తింటారు)

    మా బెంగుళూరులో నేను
    శనివారమ్మున వాహనమ్ము నడుపన్ సాధ్యమ్ము కాదిచ్చటన్
    అంటుంటానండి.

    రిప్లయితొలగించండి
  8. మ:పనిలో మున్ గెడు నైదు నాళ్లు,మరియున్ పాకమ్ము దాజేయు,నే
    పనిలో సాయము నన్ను గోరదు సదా పాటించు సాధ్వీత్వమే,
    తనకున్ నచ్చిన చిత్ర దర్శనము బొందన్ గోరు ,నే వద్దనన్
    శనివారమ్మున నా పతివ్రతయె వైషమ్యమ్ముఁ జూపున్ గదా”
    (ఐదు రోజులు సాఫ్ట్ వేర్ పనిలో,ఇంటి పనిలో ఉన్న పతివ్రత వీకెండ్ లో సినిమా వద్దంటే మాత్రం ద్వేషం చూపిస్తుంది.)

    రిప్లయితొలగించండి
  9. ఘనమౌరీతి వివాహమాడి బుధ సంఘంబుల్ దెగన్ మెచ్చగన్
    మనువాడంగ విహారయాత్రలకునై మాల్దీవులన్ జేరగా
    అనుకోకుండ బహిష్టు కాగ సతియే వ్యాఘాతమ్మునన్ భర్తపై
    శనివారమ్మున నా పతివ్రతయె వైషమ్యమ్ముఁ జూపున్ గదా.

    రిప్లయితొలగించండి
  10. మునుకొని దేవీ పూజను
    ఘనముగ సల్పంగ బూని గమనించక తా
    పెనిమిటి ని ర్ల క్షి o చ గ
    శనివారము నాదు భార్య శత్రు వగు గదా!

    రిప్లయితొలగించండి
  11. వినదే స్వాస్థ్యత జిక్కుదాక పతికిన్ వీలైన పథ్యంబులన్
    దినవారంబుల నీయదే యుదకమున్, తిండిన్ దనాశించకే !
    శనివారమ్మున, నా పతివ్రతయె, వైషమ్యమ్ముఁ జూపున్ గదా!
    కనరే దారయు జేయు నీ విధిని మాంగల్యంబునే నిల్పగా !!

    రిప్లయితొలగించండి