23, ఆగస్టు 2025, శనివారం

సమస్య - 5222

24-8-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె”

(లేదా...)

“దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే”

7 కామెంట్‌లు:

  1. తేటగీతి
    ఇంద్రపూజను మానియునింపుమీర
    జరుపమంచు గోవర్ధన గిరికటంచు
    బాలకృష్ణుఁడు దెలుపరాన్ భక్త హృదయ
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె!

    ఉత్పలమాల
    ముంగిట వెన్నదొంగలొగి ముచ్చటలాడుచు బాలకృష్ణ స
    త్సంగమనంగ గోగిరికి సల్పగ పూజలు పిల్వవచ్చినన్
    జెంగట దివ్యమూర్తిఁగని సేవలు జేయఁగ, శౌరిఁ దోడుగన్
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే!

    రిప్లయితొలగించండి
  2. ఉ.
    చెంగట భూరి శౌర్యమయ చిత్త విశిష్టులు దోర్బలాఢ్యులై
    సింగములౌచు విక్రమము చిచ్చుర చందము జూపు నెప్డు వా
    రింగని రక్షణంబుకయి రిక్కల కాలము నింటి నుంచ నీ
    దొంగల గాంచి సంతసముతో దలుపుల్ తెరిచెన్ గృహస్థుడే !

    రిప్లయితొలగించండి

  3. వాడు సామాన్యుడా? కాదు వాస్తవమున
    హరియె నందునింటను బుట్టె నంచు విశ్వ
    సించెడి యొక గొల్లడటకున్ జేరు దధిజ
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె.


    సంగడి కారులన్ గొనుచు శ్యామిక వేళను నందనందుడే
    చెంగట నున్న పర్పములజేరుచు చోరిక జేయు వానినే
    సంగడటంచు నమ్మి వృధసానుడటన్ సరజమ్ము దోచెడిన్
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే.

    రిప్లయితొలగించండి
  4. పురమునందు దొంగతనము పొదలు చుండ
    నెందరో రక్షకుల నెంచి యేర్పరచగ
    ప్రహరి కాచువాని పొడన వచ్చినట్టి
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె

    రిప్లయితొలగించండి
  5. వెన్నదొంగిలించిన కొంటె పిల్లవాడు
    చీరలెత్తుకు పోయిన చిన్నవాడు
    గొల్లపిల్లల మనసులు కొల్లగొట్టు
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె

    రిప్లయితొలగించండి
  6. దొంగిలె గొల్ల కన్నియల దుస్తులు దొంగిలె వారి యుల్లముల్
    దొంగిలె గోపబాలకులతో నడయాడుచు వెన్నమీగడల్
    దొంగిలఁ బోయె యాదవుఁడు దుగ్ధము గోపులు తోడురాఁగ నా
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే

    రిప్లయితొలగించండి
  7. అందమొలికించు దేవకీ నందనుండు
    ప్రేమ హృదయాల నెలకొన్న వెన్నదొంగ
    చోరు డేతెంచి నాడనుచు నవనీత
    తస్కరుం గాంచి గృహమేధి దలుపుఁ దెఱచె

    దొంగల చేష్టలన్ గనె సుదూరము నున్న నిఘా విభాగమే
    చెంగట నున్నవారలకు చేర్చగ వార్తను తత్క్షణంబునే
    రంగము నందు కాలిడిన రక్షక సేనకు చిక్కి బద్ధులౌ
    దొంగలఁ గాంచి సంతసముతోఁ దలుపుల్ దెఱచెన్ గృహస్థుఁడే

    రిప్లయితొలగించండి