18, ఆగస్టు 2024, ఆదివారం

సమస్య - 4856

19-8-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రక్షాబంధన మటంచు రావల దనుజా”

(లేదా...)

“రక్షాబంధనమంచు రావలదిఁకన్ భ్రాతా ననుం జూడఁగన్”

16 కామెంట్‌లు:

  1. అక్షినివోలెను చూచుచు
    రక్షింపగలేనునిన్నురాబందులతో
    భక్షింతురుశీలమునే
    రక్షాబంధనమటంచురావలదనుజా

    రిప్లయితొలగించండి
  2. రక్షోనాథుడులేడులేమలకు భారంబాయెజీవంబులే
    పక్షుల్వోలెనుచుట్టుమూగుచును పాపంబంచునూహింపకన్
    ఆక్షేపంబునుజేయువారు, పురుషాహంకారమిట్లుండెలే
    రక్షబంధనమంచురావలదికన్భ్రాతా, ప్రేమపెంపొందగన్

    రిప్లయితొలగించండి
  3. కం॥ రక్షా బంధన మదిని సు
    రక్షిత మౌచు నిరువురకు రంజిలఁ జాలున్!
    లక్షల యోజన దూరము
    రక్షాబంధన మటంచు రావల దనుజా!

    శా॥ రక్షాబంధన సూత్రమొప్పు నిలలో రంజిల్లుచున్ సర్వదా
    నిక్షేపంబువలెన్ మనమ్మునఁగనన్ నిత్యమ్ము నిక్షిప్తమై
    లక్షాయోజన దూరముండఁగను సౌభ్రాత్రమ్మె పర్యాప్తమౌ
    రక్షాబంధన మంచు రావలదికన్ భ్రాతా ననుంజూడఁగన్

    లక్షా ఒక లక్ష నిఘంటువు సహాయమండి

    ఒకరు భారత దేశములో మరొకరు అమెరికాలో ఉంటే నండి

    రిప్లయితొలగించండి
  4. కందం:
    కక్షలు కార్పణ్యములు వి
    చక్షణ రహితమ్ములయ్యె సహచరునింటన్
    రక్షణ కరువైపోయెను
    రక్షాబంధన మటంచు రావల దనుజా

    శార్దూలము:
    కక్షన్ దాలిచెనామగండు కడునుద్గాఢంబుగా నీపయిన్
    నిక్షేపంబుగనుంటినోయనుజ నేనిచ్చోట నా భర్తతో
    నీక్షేమంబును కోరి దెల్పెద సుమా నీవింక మా యింటికిన్
    రక్షాబంధనమంచు రావలదిఁకన్ భ్రాతా ననున్ జూడగన్

    రిప్లయితొలగించండి
  5. అక్కయ్య తమ్మునకంపిన సందేశము:

    కందం
    అక్షింతలు,తోరము దగ
    నిక్షిప్తమ్ముగ తపాల నీకంపితి నే,
    భక్షించు వ్యాధి సడలక
    రక్షాబంధన మటంచు రావల దనుజా!

    శార్దూలవిక్రీడితము
    అక్షింతల్ మరి తోరమున్ బనుప నీకంచున్ తపాలాఁ దగన్
    నిక్షిప్తమ్ముగఁ, జేరు వేళకవి సాన్నిధ్యాన నేనుంటి ప్ర
    త్యక్షమ్మన్ మదిఁ భావనన్ గొనుమ! జాడ్యమ్మున్ సమీక్షింపకే
    రక్షాబంధనమంచు రావలదిఁకన్ భ్రాతా ననుం జూడఁగన్

    రిప్లయితొలగించండి

  6. లక్షలు సంపాదించగ
    స్వక్షేత్రమునే విడుచుచు పరదేశములో
    నాక్షేత్రితోడ నుంటిని
    రక్షాబంధన మటంచు రావల దనుజా.



    నా క్షేత్రిన్ గని మెచ్చి రెల్లరును సన్మానించుచున్ పల్కిరే
    స్వక్షేత్రమ్మున పొందువేతనమదే స్వల్పంబు, మేమిత్తుమే
    లక్షల్ లక్షలటంచు వారు పిలువన్ రాష్ట్రమ్మునే వీడితిన్
    రక్షాబంధనమంచు రావలదిఁకన్ భ్రాతా ననుం జూడఁగన్.

    రిప్లయితొలగించండి
  7. మీక్షితి నిమ్మన కుండగ
    రాక్షాబంధన మటంచు , రావల దనుజా
    రక్షణ జేసుకొనుటకయి
    దక్షుడయిన యా విదురుని తనయుడు దెల్పెన్

    రిప్లయితొలగించండి
  8. (కలకత్తాలో దుండగుల అరాచకానికి బలైన వైద్యురాలి స్మృతిలో)

    దీక్షన్ బూనితి వైద్యవృత్తి నరయన్ దేశంబుకున్ సేవగా
    ప్రక్షాళింపగ నెంచి దుర్విధుల నే ప్రశ్నించుటే నేరమై
    శిక్షన్ బొందితి దుర్వినీతులటులుచ్ఛేదింప ముక్తాత్మనై
    రక్షాబంధనమంచు రావలదిఁకన్ భ్రాతా ననుం జూడఁగన్

    రిప్లయితొలగించండి
  9. రాక్షస కృత్యంబులతో
    స్త్రీ క్షోభకు మూలమగు విశృంఖల ఖలులన్
    శిక్షాపాత్రులఁ జేయక
    రక్షాబంధన మటంచు రావల దనుజా

    వీక్షింపన్ బలుమానభంగ వెతలే వెంటాడు విద్రోహులే
    దీక్షాకంకణమున్ ధరించి ఖలులన్ దీవ్రాతితీవ్రంబుగా
    శిక్షాపాత్రులఁ జేయుమయ్య రయమున్ శిక్షింపలేకున్నచో
    రక్షాబంధనమంచు రావలదిఁకన్ భ్రాతా ననుం జూడఁగన్

    రిప్లయితొలగించండి
  10. మా క్షేత్రమున కలి గనుక
    లక్షణముగ నేనచటికి రాలేనుగదా
    దక్షత తోడుత నీవును
    రక్షాబంధన మటంచు రావల దనుజా

    రిప్లయితొలగించండి
  11. రక్షగ నిలువుము సోదర
    వీక్షింపుము నాదు బాగు వేడుక మీరన్
    దక్షు డ వగు నీ వెందుకు
    రక్షా బంధ న మటంచు రావల దను జా?

    రిప్లయితొలగించండి
  12. ఆక్షేపింపకు దైవము
    సాక్షిగ వచియించు చుంటి సంతత రక్షా
    దక్షా సంకోచం బెద,
    రక్షా బంధన మటంచు రా, వల దనుజా


    అక్షీణంపు దయార్ద్ర మానసుఁడ వై తత్యంత మిద్దాత్రినిన్
    రక్షాదక్షత ఖ్యాతి నందితివి సౌభ్రాత్వమ్ము వర్ధిల్లఁగా
    రక్షా బంధన మంచు రమ్మనుజ సంరంభంబునం బల్కుచున్
    ర క్షాబంధన మంచు రావల దిఁకన్ భ్రాతా ననుం జూడఁగన్

    [రక్షా + అబంధనము = ర క్షాబంధనము]

    రిప్లయితొలగించండి
  13. శిక్షణ సంపూర్ణమగుట
    తక్షణ కర్తవ్యమదియె తప్పని సరియౌ
    దీక్షగ చదువుటె ముఖ్యము
    రక్షాబంధన మటంచు రావల దనుజా

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రక్షణ నిచ్చెడు వాడవు
    కక్షలతో గ్రామమంత కర్ఫ్యూ నిడిరే
    రక్షణ లేదెవ్వరికిని
    రక్షా బంధనమటంచు రావల దనుజా!

    రిప్లయితొలగించండి

  15. రక్షణయే కరువయ్యెను
    రక్షాబంధన మటంచు రావలదనుజా
    రూక్షముగాస్త్రీ మూర్తుల
    వీక్షించుచునుందురెపుడు వీధులయందున్

    రిప్లయితొలగించండి