24, ఆగస్టు 2024, శనివారం

సమస్య - 4862

25-8-2024 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పామరుఁ డొనర్చెఁ బద్యసంభాషణమ్ము”

(లేదా...)

“పద్యములందు భాషణము పామరుఁ డొక్కడు సేసి చూపెగా”

(బులుసు అపర్ణ గారి శ్రీశైలం ద్విశతావధాన సమస్య)

17 కామెంట్‌లు:


  1. ఆతడు నిరక్ష రాశ్యుడె యైననేమి
    భద్రకాళిపదములందు వ్రాలి తల్లి
    కరుణపొంది పండితుడౌచు కాళిదాసు
    పామరుఁ డొనర్చెఁ బద్యసంభాషణమ్ము.


    హృద్యమె కాళిదాసు కథ యెంతటి చిత్రమొ యాలకించినన్
    విద్యయె రాని మూర్ఖుడు వివేకవిహీనుడె యైననేమి తా
    నాద్యకృపారసమ్మున విహస్తునిగా పరిణామ మందుచున్
    పద్యములందు భాషణము పామరుఁ డొక్కడు సేసి చూపెగా.

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    పేరుమోసిన 'నవధాని' యూరినందు
    ప్రజ్ఞఁ జూపించుననవిని పరుగులిడుచు
    వేడ్కకున్ బంటుగఁ జనఁ గోవిదుని వెంట
    పామరుఁ, 'డొనర్చెఁ బద్యసంభాషణమ్ము'

    ఉత్పలమాల
    విద్య, సరస్వతీ జనని వీనులవిందుగ పల్కునట్లుగన్
    సద్యయమందగన్ గురియ సత్కవి తా నవధానమెంచుచున్
    హృద్యమనంగ కోవిదులు నింపొనరించుచుఁ, గాంచుచుండఁగన్
    బద్యములందు భాషణము పామరుఁ డొక్కడు, సేసి చూపెగా!

    రిప్లయితొలగించండి
  3. అమరక్రౌంచముమిథునమ్ము నటనుఁజూచి
    బోయ వాల్మీకి పలికెనుపులక లొదవ
    రామగాథకు నాందియై గ్రంథమయ్యె
    పామరుడొనర్చె పద్యసంభాషణమ్ము

    రిప్లయితొలగించండి
  4. కింకరునిగ నుండుచు దన గేస్తు గొప్ప
    పండితుడగుటన దనతో భాషణకయి
    కవితలను జెప్పుచుండిన కారణమున
    పామరుఁ డొనర్చెఁ బద్యసంభాషణమ్ము

    రిప్లయితొలగించండి
  5. పండితుల కావ్యగోష్ఠుల బహుళముగను
    పనులు సల్పుటకేగెడు పామరునకు
    శ్రుతముగానబ్బె పాండితి రుచిరముగను
    పామరుఁ డొనర్చెఁ బద్యసంభాషణమ్ము

    విద్యలయందునొజ్జలగు విజ్ఞుల కూటములందు సేవలో
    పద్యఁపు తీరుతెన్నులను పామరుఁడొక్కడు నేర్చి జప్పునన్
    హృద్యముగా కవిత్వమును హేలగ చెప్పుచు మెచ్చఁ బండితుల్
    పద్యములందు భాషణము పామరుఁ డొక్కడు సేసి చూపెగా

    రిప్లయితొలగించండి
  6. విద్య లేకున్న వాల్మీకి వింతగొలిపె
    శోక పరితప్త హృదయాన శ్లోకమలర!
    పద్య కవులతో వసియించు వారలందు
    పామరుఁ డొనర్చెఁ బద్యసంభాషణమ్ము!

    విద్యయె లేనివాడు గన వింతగ శ్లోకము చెప్పియుండెగా
    నాద్యుడు కావ్యసృష్టికిట నచ్చెరువేగద రామకావ్యమే
    పద్యములందు భాషణము పామరుఁ డొక్కడు సేసి చూపెగా
    పద్య విశారదుల్ గరిడి పాటిలు వానికిఁ సాధ్యమేకదా

    రిప్లయితొలగించండి
  7. చూత నవమల్లి కాశోక సుంద రాసి
    తోత్ప లారవిందములు పద్యోత్కరముల
    నిభము దోఁప శివుని తోడ నిర్జరాధి
    పా మరుఁ డొనర్చెఁ బద్య సంభాషణమ్ము


    ఆద్యము నంతముం గని మహాద్భుత నాటక మందు నింపుగాఁ
    జోద్యము మీఱఁ జక్కఁగను సుంతయుఁ దప్పక ప్రాయ మందుఁ దా
    విద్యలు నేర కున్నను వివేకుఁడె యాశ్వపతీ సతీ ప్ర జా
    పద్యము లందు భాషణము పామరుఁ డొక్కఁడు సేసి చూపెఁగా

    [ఆశ్వ పతీ సతీ ప్రజా +ఆపద్ +యములు = సావిత్రీ దేవి, ప్రజల కాపద యైన యముఁడు; ద్వంద్వ సమాసము.]

    రిప్లయితొలగించండి
  8. పద్యమును గూర్చి తెలియని వాడు గాన
    దనకు కనుపించు నవధాని దరికి వెడలి
    పద్య మన్నది యెట్లుండు పలుకు డనుచు
    పామరు డోన ర్చె పద్య సం భాష ణం బు

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:సంస్కృతమ్మున భాషణల్ జరుగుచుండ
    పద్యకవి యయ్యు సంస్కృత భాషణమున
    పట్టు నొందక, సరిగ నా భాష రాని
    పామరుఁ డొనర్చెఁ బద్యసంభాషణమ్ము

    రిప్లయితొలగించండి
  10. ఉ:పద్యము నేర్వగా నగరవాసులు బాధలు బొందు చుండగా
    విద్యను,నక్షరమ్ములను వీడిన జానపదుండు చక్కగా
    పద్యము పాడు విద్య గొనె, భారత మందలి రాయబారపుం
    బద్యములందు భాషణము పామరుఁ డొక్కడు సేసి చూపెగా”
    (పల్లెటూళ్లలో చదువు లేని వాళ్లు కూడా నాటకాలు చూసి పాండవోద్యోగ విజయాలు లో పద్యాలు పాడుతుండే వాళ్లు.)

    రిప్లయితొలగించండి

  11. భోజరాజును చూచిన భో! చదువులు
    గల్గునను నానుడెల్లరు గనరె?రేని
    చూడవచ్చిన నొక్కడు చూచినంత
    పామరుడొనర్చె బద్యసంభాషణమ్ము. ..గణపతి రావు వేదుల

    రిప్లయితొలగించండి
  12. పలుకు లమ్మకరుణఁగల్గి బడుగువర్గ
    పామరుఁ డొనర్చెఁ బద్యసంభాషణమ్ము
    వ్యాస వాల్మీకు లటులనే యార్ష రీతి
    వేల కొలదిగ పద్యాల నిలకు నిచ్చె

    రిప్లయితొలగించండి
  13. పద్యములందు భాషణము పామరుఁ డొక్కడు సేసి చూపెగా
    పద్యము వ్రాయఁగల్గుదురు పామరు లైనను బ్రీతి యున్నచో
    విద్యయనంగఁగాదొకరి విత్తము చిత్తము నందు వాంఛ నౌ
    తథ్యము పద్యభాషణము దానికి రూఢియె పామరుండహో

    రిప్లయితొలగించండి
  14. ఉ.
    మద్యము ద్రావి యొక్కడిలఁ మత్తుగ తూలుచు గంతులేయుచున్
    చోద్యముగాగ నిట్టులనె చూచెడి వార్లకు నవ్వు పుట్టగన్
    పద్యమదన్ననేమియొక పాటగ పాడెడి గద్యమంచు తా
    పద్యములందు భాషణము పామరుఁ డొక్కడు సేసి చూపెగా

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పద్యమన శ్రద్ధ కలిగిన పామరుండు
    కోరి నేర్చుకొనగ చేరి గురువు చెంత
    పట్టుదలతోడ చేసి యభ్యాసమెంతొ
    పామరు డొనర్చెఁ బద్య సంభాషణమ్ము.

    రిప్లయితొలగించండి
  16. తే॥ పాఠశాల చదువులకు ప్రాప్తిఁ గనకఁ
    బేదరికము తోడ నతఁడు వేదనఁబడి
    పద్య గోష్ఠులందు వినిన భావమరసి
    పామరుఁ డొనర్చె పద్యసంభాషణమ్ము

    ఉ॥ విద్యల నేర్వకున్నను వివేకముఁ గాంచుచు పద్యగోష్ఠులన్
    హృద్యము గాను బాల్గొనుచు హేలగ విన్నవి మానసమ్మునన్
    సద్యము నిల్పి మక్కువగ సాధాన చేయుచుఁ బొంద జ్ఞానమున్
    బద్యములందు భాషణము పామరుఁ డొక్కఁడు సేసి సూపెగా

    ఏకలవ్వ విద్యలాంటిదండి. గతములో పల్లెలలో ఇలాంటి వారు బాగానే ఉండేవారు. ప్రస్తుతము చాలా అరుదుగా అలాంటి వారు కనబడతారండి

    రిప్లయితొలగించండి