3, జులై 2025, గురువారం

సమస్య - 5172

4-7-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్”

(లేదా...)

“రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్”

16 కామెంట్‌లు:

  1. చక్కగ కవనము నేర్వక ,
    నెక్కువ సాధన సలుపని యీ బాలకుడే
    గ్రక్కున జెప్పుట జూడగ 
    రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    ధిక్కారమున హరిఁ గొలువ
    గ్రక్కున దైత్యుండు సుతునిఁ గాదన, భటులం
    దొక్కడు త్రోయఁగ లోయన్
    రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్!

    ఉత్పలమాల
    దిక్కొకడే రమావిభుఁడు తీరెను సర్వమునందనన్ సుతున్
    గ్రక్కున దైత్యుడున్ రగిలి రమ్మని యానతి నీయ సేనలం
    దొక్కడు లోయఁ ద్రోయఁగనె యూతమునై హరి రక్షఁ జేయఁగన్
    రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్!

    రిప్లయితొలగించండి
  3. చక్కని సాధన జేయుచు
    మక్కువతో నాస నములు మరిమరి వేయన్
    పెక్కురు గాంచుచు ప లికిరి
    రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగి రెన్

    రిప్లయితొలగించండి

  4. చక్కనివాడు క్షితి సురుం
    డక్కడ కేతెంచ వాని యందము గాంచన్
    చక్కని వరూధిని మనసు
    రెక్కలు రానట్టి పక్షి, రివ్వున నెగిరెన్.


    చక్కని చుక్క కంజముఖి సౌత్రుని గాంచి దలంచె నిట్లు తా
    నెక్కడి నుండి వచ్చెనిట కెవ్వడు వీడు వసత యోధుడో
    యిక్కడకేల వచ్చె నని యింతి వరూధిని మానసమ్మనే
    రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్.

    రిప్లయితొలగించండి
  5. ఉ.
    వెక్కసమైన రీతులుగ విన్నున భానుడు వేడి వెల్లువల్
    దిక్కుల దారులం బరపెఁ దీక్ష్ణతఁ జూపెడి కాలమందునన్
    నిక్కపుటాశతో మొనసి నిస్తుల వేగము సేత గట్టి పె
    న్రెక్కలు రా ని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్ !

    రిప్లయితొలగించండి
  6. చక్కటి సాహితీ సభను శాస్త్రులు గూర్చిరి చర్చజేయగన్ ,
    నిక్కుచు కావ్యముల్ సలుప నేర్వని బాలుడు లేచి యచ్చటన్
    గ్రక్కున చెప్పె జక్కనగు కైతను , దానిని గాంచగా నటన్
    రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్

    రిప్లయితొలగించండి
  7. రిక్కలు కాంక్షలు రేపగ
    చుక్కల తెరువుఁ బరికించి చూచిన వేళన్
    జక్కని తలంపులందున
    రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్

    రిక్కల వెల్గులన్ గనిన రేగవె కాంక్షలు మిక్కుటంబుగా
    జక్కువ కూనయొక్కటి ఖజాకము నారసి రాత్రి వేళలో
    చక్కని రిక్కదారిఁగని స్వాంతము తేలగ నూహలందునన్
    రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్

    రిప్లయితొలగించండి
  8. చక్కని చుక్కరా! మదిని చక్కిలిగింతలు పెట్టె నూహలన్
    చుక్కల లోకమందు నను సొక్కఁగఁ జేసెను సోయగాలతో
    చిక్కితిఁ బక్కివోలె దన చెల్వము గాంచఁగ మైకమందునన్
    రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్

    రిప్లయితొలగించండి
  9. చక్కని చుక్కను గాంచఁగ
    చక్కిలిగిలి కలిగి మదికి సంతసమడరన్
    చుక్కల ప్రక్కనఁ జేరఁగ
    రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్

    రిప్లయితొలగించండి
  10. కం:చక్కని విమాన మొక్కటి
    పక్కి వలెనె లేచె పైకి పంకము లలరన్
    ప్రక్కన హెలికాప్ట రనెడు
    రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్”

    రిప్లయితొలగించండి
  11. ఉ:రెక్కలు గల్గు పక్షి వలె రెచ్చుచు రోదసి పైకి సోకుగా
    నెక్కగ నా విమాన మది యేమి విశేష మటన్న రీతి హో
    రెక్కెడు శబ్దధాటి బ్రసరించి యహో!హెలికాప్ట రన్న యీ
    రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్”
    (విమానానికి రెక్క లుంటాయి కానీ హెలికాప్టర్ కి ఉండవు కదా!)

    రిప్లయితొలగించండి
  12. చక్కని సౌందర్య మడరు
    నక్కాంతామణి చరింప నాయా యెడలన్
    మక్కువతో నాదు మనసు
    రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్


    ఒక్క కడింది సాఁగు గుణ మున్న పదార్థపు బుద్బుదమ్ములో
    దిక్కుల సంచరింపఁ గడు తేలిక గాలిని నింపి చిక్కగాఁ
    జక్కని త్రాడు గట్టి రభసమ్మున నెల్లరు సూడ వీడఁగా
    రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్

    రిప్లయితొలగించండి
  13. డా.బల్లూరి ఉమాదేవి
    శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్యలకు నా పూరణలు


    *“రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్”*

    (లేదా...)

    *“రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్”*


    మక్కువ తోడను గనుచును
    చుక్కల ,తాకంగనెంచి జోరుగ మదిలో
    చిక్కులు కల్గుట తెలుగుకు
    *“రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్”*

    చిక్కుల నెల్ల దాటుచును చేరగ వ్యోమము నందు చూడగన్
    మక్కువతోడశోధనముమానుగచేయగనెంచుకోర్కెతో
    *“రెక్కలు రాని పక్షి యెగిరెన్ రివురివ్వున నాకసంబునన్”*
    దక్కెఫలంబటంచునెదతన్మయతందెను వ్యోమొగామియున్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తక్కువ వయసే యున్నను
    మిక్కిలి ప్రేమించితినని మిడిమిడి తెలివిన్
    ప్రక్కన గల యువకునితో
    రెక్కలు రానట్టి పక్షి రివ్వున నెగిరెన్.

    రిప్లయితొలగించండి