4, జులై 2025, శుక్రవారం

సమస్య - 5172

5-7-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కాకర గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె”

(లేదా...)

“కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ”

20 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
వింత యేమున్నదిందున విజ్ఞులార!
చేదు తొలగంగ బెల్లముచింతపండు
కూర్చి కూర్మినివండిన కూరతినఁగ,
కాకర. ,గుడమ్ము వలెఁ, బుల్లగా రుచించె!

ఉత్పలమాల
శాకములెన్నియో గలవు స్వాస్థ్యము గూర్పగ భోజనమ్మునన్
జేకురు గొప్పగన్ రుచులు శ్రేష్టమనంగను చింతపండు తోఁ
జేకొని బెల్లమున్ తొలఁగ చేదది వండగ కూరరీతిగన్
కాకరకాయఁ, దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ, పుల్లనౌ!

Sitharamayya Solasa చెప్పారు...

బాలునికి షడృచులదీరు పట్టువడక
ఏ రుచిని యేమని బలుక నెరుకలేక
వస్తువులను దినినగూడ బలికెనిటుల
"కాకర గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
ప్రాకట మాధురీ భరిత వాంఛిత మద్యము గ్రోలి రాతిరిం
బాకకుఁ జేరెఁ గర్షకుడు, బాతిగ భార్యయె బువ్వఁ బెట్టగం
గాకర కూరఁ జూచుచు వికారపు మత్తునఁ బల్కెనిట్లు "నీ
కాకర కాయఁ దెచ్చి తినగా నది బెల్లము వోలె పుల్లనౌ !"

విరించి చెప్పారు...


ఇక్షు దేహపు యౌషధ మేది తెలుపు
చెక్కరరుచి దేనివలెనో చెప్పు మంటి
చింత పండే విధమున రుచించునంటి
కాకర , గుడమ్ము వలెఁ , బుల్లగా రుచించె.


పోకిరి మిత్రులంగలిసి మూర్ఖుడొకండట మద్యశాలకై
చీకటి గొంగ తూర్పుదెస జేరక ముందున నేగుదెంచుచున్
పీకల దాక ద్రావియట వెంగళు డట్లుగ వాగె నిట్టులన్
కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ

M.B.G.TILAK చెప్పారు...

సీధువును చాటు మాటున చేయువారు
నల్లబెల్లము వండుట తెల్లముగద
నల్ల బెల్లపు పాకాన నానినపుడు
కాకర గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె

చీకటిలో వినాశకర సీధువు సిద్ధముచేయ నెంచుచున్
దేకువతోడ వండెదరు తియ్యని పుల్లని తాటిబెల్లమే
ప్రాకటమైన భిన్నమగు పాకము నందున నాని యున్నదౌ
కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చింత పండును బెల్లము చే ర్చి వండి
నట్టి కాకర దినుచు తా నని యే విభుడు
కాకర గుడ మ్ము వలె పుల్ల గా రుచి o చె
మరియు కొంచము వడ్డించు మగువ నాకు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"షడ్రుచుల"

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తా ననియె"

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

రుచుల వైనము దెలియని లోచకుండు
విందు భోజనమునకేగి వెర్రివోలె
పలికె నిట్టుల హర్షము పాదుకొనఁగ
కాకర గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:వేపుడున బెల్ల మెక్కువ వేసినావె
దాని రుచియె మారెను తీయ దనము బొందె
కాకర గుడమ్ము వలెఁ ,బుల్లగా రుచించె”
నిమ్మకాయ,యొల్కించుము నేయి కొంత.
(కాకర కాయ వేపుడు లో బెల్లం వేస్తారు.అది ఎక్కువై దాని రుచే మారి పోయింది.నిమ్మకాయ ఊరగాయి బాగుంది కానీ నెయ్యి తగిలితే ఇంకా రుచి.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:రాకయె వంట నా నుదుటి వ్రాతగ దక్కితి వీవు, మందు గా
కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ , పుల్లనౌ
నాకని చుక్కకూర గొన నందున నుప్పును జాస్తి వేసి నా
వీ కరివేప దెచ్చితి మరెట్టుల పచ్చడి జేతువో కదా!
(అది బెల్లము వోలె=అది బెల్లం వోలె ఉంది.బెల్లం ఎక్కువై.)

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ.

ఉత్పలమాల:

ఏ కలికాలమైన సరి యే రుచి మార్చవు కూరగాయలే
ఆకలి నాకు యన్న మరి యమ్మయె సేయును తీపి కాకరే
నాకును తీపి పుల్లనిది నాణ్యపు కాకర చక్రముల్ గనా
కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ.

నాకును దప్పలేదు పచనంబును సేయగ చేదు కాకరన్
కాకర శాకమే దినుమ కష్టమొ నష్టమొ రోగమొచ్చెనే
తేకువ చింతపండు మరి తెల్లము జేసిరి బెల్లమే దినన్
కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ.

Sitharamayya Solasa చెప్పారు...

🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఎంత రుచిమంతము లయిన వింతగఁ దన
కనుభవింప వలను కాని వగుట నొక్క
పురుషుఁ డనె నిట్లు తినరామి పులిసిన, కన
కాకర! గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె

[కనక+ఆకర = కనకాకర, పసిడినిధీ]


వీఁక శ్రమించి వేగముగ వెల్వడి నాదగు మందభాగ్యపుం
బోకడ నేమి చెప్ప నగుఁ బో యది దైవ మెఱుంగ నౌను నా
కాఁకలి వేయఁ గాంచి యట నామ్రము నొక్కటి, ముట్ట కుండ నా
కాకరకాయఁ, దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ బుల్లనౌ

[మామిడిని బెల్లము వోలెఁ దినఁగా నది పుల్లనౌ]

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కాకుఁదనమ్ము మానుమిక కాకర మేలొనగూర్చునంచునే
తేకువఁజూపి యౌషధిగ దెచ్చితి నీమధుమేహ వ్యాధికిన్
కాకరకాయ తిక్తమని గానక బల్కెదొ బాలిశుండవై
కాకరకాయఁ దెచ్చి తినఁగా నది బెల్లము వోలెఁ పుల్లనౌ

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

చేదు పోవగ బెల్లము,చింతపండు
వేసి కాకర కూరను పేర్మి వండ
కాకర గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె
ననుచు చెప్పిరి తిన్నవా రారటముగ.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కాయలందునచేదగు కాయయన్న
కాకరే యైనను పులుపు కలిపి జతకు
పంచదారను నోటికి వాసిగాను
*"కాకర ,గుడమ్ము వలెఁ బుల్లగా రుచించె”*