10, జులై 2025, గురువారం

సమస్య - 5178

11-7-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు”

(లేదా...)

“కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే”

 (పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

18 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

జీవితమున దరికి జేర వచ్చెడి వారు
పలు రకముల లావు బడయు చుంద్రు , 
మనను కదియు వాని మంచి గూ ర్చి వినుట 
కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
మధురకేగెదనని మాత యశోదను
కృష్ణమూర్తి యడుగ, ఖేదమొంది
యెందుకనుచు?ననియె,"నెక్కువ దినములు
కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు!"

ఉత్పలమాల
"తిన్నగ వెళ్లియున్ మధురఁ దీరిచి కార్యము లెల్ల"వత్తునన్
వెన్నునితో యశోదయనె, "వేడుక లెన్నియొ సల్పు నీవు నా
కన్నులముందరన్ దిరుగ కమ్మని విందగు నిత్యమయ్య! నా
కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే!"

విరించి చెప్పారు...


మడుగు లోన మునిగె కొడుకని తెలిసి య
శోద యటకు జేరె శోక మందు
గొల్ల బాలలెల్ల గుమిగూడి రచ్చోట
కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు.


కన్నుల నీరునిండ నట కాంత యశోదయె చేరె పుత్రుడా
పన్నుడు దుష్టపన్నగము వాసము నున్నతటాక మందునన్
వెన్నుడు మున్గెనంచువిని వేగము నందట జేరె నామెకున్
గన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆ॥ భోగ లాలసతను మోదమొందు జనులు
సుఖపు వేటయందు సొమ్మసిల్లు
విధము నెంచి చూడ నధిక తృప్తి మధువు
కన్నఁ గాంచ కున్నఁ గలత రేఁగు

ఉ॥ ఎన్నుచు జీవితమ్మనఁగ నెప్పుడు నన్యముఁ దల్చకుండఁగన్
మిన్నగు భోగ లాలసత మిక్కిలి మోదమటంచు సర్వదా
గ్రన్నన పొందఁ గోరఁగను గాఢత హెచ్చుగ మద్యమాంసముల్
కన్ననుఁ, గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే!

కన్న ను పంచమీ విభక్తి ప్రత్యయంగా తీసుకున్నానండి నిఘంటువు సూచన ప్రకారము

జిగురు సత్యనారాయణ చెప్పారు...

సన్నుత భక్త పాలకుడు సాధు జనాళికి దిక్కు సప్త శై
లోన్నత శేషతల్ప పురుషోత్తమ మాధవ పద్మనాభుడే
యిన్నగ పాలుడై తిరుమలేశుడు దీపిలుచుండ స్వామి వెం
కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే!!

M.B.G.TILAK చెప్పారు...

తిరుమలగిరిపైన దరిసెన మమరినన్
దిరుమలేశునిగన మరియొకపరి
పర్వతంబు నెక్కి పావనమూర్తి వెం
కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు

పన్నుగ వేంకటేశ్వరుని పావనమూర్తిని జూచి వచ్చినన్
గ్రన్నన జేయవచ్చని పరాత్పర రూపుని దర్శనంబుకై
తిన్నగ కొండనెక్కెదరు దివ్యమనోహర రూపుడైన వెం
కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మ్రొ క్కు బడిని దీర్చి ముడుపులు చెల్లి o చి
ద ర్శినo బు సేయ దపన దీరు
తగిన సమయ మందు తప్పని సరిగవెం
కన్న గాంచ కున్న గలత రే గు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కన్నులార గాంచ కళ్యాణగుణధాము
సరగున నరుదెంచ తిరుమలగిరి
గాంచనైతినొక్క క్షణమైన, స్వామి వెం
కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కన్నుల పండువై దనరు కైటభవైరి మనోజ్ఞ రూపమున్
పన్నుగ గాంచనేగితిని పావన ధామము వేంకటాద్రికిన్
కన్నుల వేంకటేశ్వరుని గానగనైతి నిమేషమైన వెం
కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఆ.వె:కన్న కొడుకు కాదు కాని యశోదమ్మ
"కన్న!"యంచు బిలుచు,నెన్నడతడు
వెన్ను డంచు నెరుగకున్న నా యమ్మకు
కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు”
(నా దృష్టిలో అత్యుత్తమ భక్తి యశోదది.ఆయన భగవంతు డనో,తన కోరికలు తీరుస్తాడనో,ముక్తి ఇస్తాడనో ఏ ప్రయోజనమూ లేని అమాయక ప్రేమ ఆమెదే.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:ఎన్నగ నామరూపముల నే పరతత్త్వము జూచు భక్తి నీ
కున్నను ద్వైతమే కద!మహోన్నత మద్వయ తత్త్వ మంద నే
భిన్నత యైన నల్ప మగు,వేదన జెందుట మూర్తి యైన వెం
కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే”
(అచ్చమైన అద్వైఅతం లో పరబ్రహ్మమే పూర్ణసత్యం.దానితో పోలిస్తే విగ్రహారాథన,వెంకన్న ని చూడకున్నా మనస్సు బాధ పడటం చిత్త నైజమే కానీ జ్ఞానం కాదు.అని ఒక అద్వైతి అన్నట్టు.)

Dr H Varalakshmi చెప్పారు...

చిన్నతనంబునుండి హరి చిత్రవిచిత్రము సేసె మాయలన్ !
కన్నది దేవకీ, సుతుగ గాచె యశోదయు, కంటిరెప్పగా !
మన్నును దింటివా యనిన, మాయగ చూపెను, మూడు లోకముల్ !
కన్నను, గాంచకున్నను, వికారము పొందుట చిత్తనైజమే!
కన్నెలు నాడు బృందముల, కన్నయ జేరిరి, శాప మోక్షమన్ !

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
కన్నను, గాంచకున్నను, వికారము పొందుట చిత్తనైజమే!

ఉత్పలమాల:

చిన్నగ సెప్పి జూతు నిక శీఘ్రము భాగము పంచనెంచగా
మన్నన జేయ కార్యమును మంథన దీరదు హీన జ్ఞాతులన్
కన్నయనంప సంధికిని కారణ మియ్యది కౌరవేంద్రునిన్
కన్నను, గాంచకున్నను, వికారము పొందుట చిత్తనైజమే!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పొగడిన జను లెల్లఁ బగవారు, తన వారు
సముచితమ్ముగాను గ్రమము గాను
బన్ని నట్టి తనదు పన్నుగడ, జయము
కన్నఁ గాంచ కున్నఁ గలఁత రేఁగు


ఎన్నఁగఁ జక్క నిక్కముగ నే యశుభమ్ము, శుభమ్ము సుంతయున్
విన్నను నించుకైన మఱి వీనులఁ జేరక యున్న నైననుం
జెన్నుగ రేఁగ నాశ లెదఁ జిత్ర విచిత్ర మయిష్ట, మిష్టముం
గన్నను గాంచకున్నను వికారము నొందుట చిత్త నైజమే

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

చిన్నతనంబునుండి తను జేసెడు
మిక్కిలి వింత చేష్టలున్
వెన్నునిపైన బ్రేమయును బెంచెను
దల్లికి చాలకాలమున్
కన్నెల చిత్తచోరు సుతు గానక
చింతిలె నయ్యశోదయున్
కన్నను గాంచకున్నను వికారము
నొందుట చిత్తనైజమే.

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
కన్ననుఁ గాంచకున్నను వికారము నొందుట చిత్తనైజమే!

ఉత్పలమాల

వెన్నుడు వెన్నుడందువుగ, వెట్టము వాడుర, గారవించకో
మన్నన సేతురే జనకు, మానము నిల్పవు, చిన్న బుచ్చుచున్
తిన్నగ జూపు వాని నిక తీయగ ప్రాణము కంబమందు నే
కన్ననుఁ, గాంచకున్నను వికారము నొందుట చిత్తనైజమే!
దన్నుఁన నిల్వలేడు నిట, తండ్రియు వానిని జూడ నెంచుచో

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కృష్ణుని నను నర్థమునఁ గన్నను సాధువు కాదండి. కన్ననిని సాధువు. ఇక్కడ ని గాగమము నిత్యము.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

(యశోద స్వగతం)
ఇంటినుంచి నేగి యెంతసేపాయెనో
యెచటి కేగినాడొ యెరుక లేదు
వెతికి వెతికి నేను వేసారి పోతిరా
కన్నఁ!గాంచకున్నఁ గలత రేగు.