18, జులై 2025, శుక్రవారం

సమస్య - 5186

19-7-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కవనమున విరులు వికాసమందె”

(లేదా...)

“కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో”

13 కామెంట్‌లు:

  1. చ.
    కవికుల శేఖరుల్ పొగడఁ గష్టమ కోకిల పంచమంబులం,
    బవన విశుద్ధ వాహినులు బచ్చని పత్ర తతిం గదిల్చె న
    ద్రి వితత చంచరీకములు దీపిని కోఱె, వసంత భామ దూ
    క, వనమునన్ వికాసనమునుఁ గన్నవి మల్లెలు మోల్లలెన్నియో !

    రిప్లయితొలగించండి
  2. కువకువలాడు కోయిలల కూజితముల్ యెలమావి కొమ్మలన్
    నవనవలాడు పూ లతల నర్తనముల్ చిరుగాలి సోకఁగన్
    కవిహృదయాంతరాళమున కమ్మనియూహలు నింప నామనిన్
    కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    వేడ్కఁగాంచ వెడల బృందావనమ్మున
    కృష్ణమూర్తిఁ గనక ఖేదమొంద
    వేణునాదమలర వినిపించు శౌరి రా
    క, వనమున విరులు వికాసమందె!

    చంపకమాల
    ప్రవిమల భక్తి భావముల రంజిలనాడుచు కృష్ణమూర్తికై
    స్తవముల గోపికల్ వెడల తన్మయమందగ గోకులమ్మునన్
    జవమున వేణునాదమది సంబరమొందగ నూదు శౌరి రా
    క, వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో

    రిప్లయితొలగించండి
  4. ఎండకాలమందు చండమునకు మల్లి 
    క,వనమున విరులు వికాసమందె
    వాటినెల్ల జిదిమె వనిత  , తనసిగలో
    ముడుచు కొనుట యందు మోద మొంది

    రిప్లయితొలగించండి
  5. భువనములోన సర్వమును బూర్తిగ
    మేల్కొనె నిద్రనుండి భూ
    భవములు మారె బచ్చగను భవ్య
    మనోహరమొప్పె పృథ్వియున్
    గువకువ కూసె కోయిలలు కొమ్మల
    లోన వసంత కాంత రా
    క, వనమునన్ వికాసుమును గన్నవి
    మల్లెలు మొల్లలన్నియో

    రిప్లయితొలగించండి
  6. ఆ॥ కవన మనెడు తోఁట కడు రమణీయపు
    పుష్పములకు నెలవు పురుఁడు పోసు
    కొను కవితలందు కొసరి విరియఁ గాను
    గవనమున విరులు వికాసమందె

    చం॥ చవి విరియంగ భావుకత సంస్థితమై తనరంగ హృద్యమౌ
    కవన సుమమ్ము లెన్నియొ ప్రకాశము నొందెనె మల్లె మాలయున్
    గవికుల నారి మొల్లయును గావ్య సుధామృత ధారఁ జిమ్మిరే!
    కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో!

    మొల్ల ప్రథమ తెలుగు కవయిత్రి అనుకుంటా నండి

    రిప్లయితొలగించండి
  7. కొమ్మ గుబురులందు కోకిల కూతలు
    అల్లన ప్రసరించు పిల్లగాలి
    కవి హృదయమునందు కాంతులు నింపగ
    కవనమున విరులు వికాసమందె

    రిప్లయితొలగించండి

  8. అతడహర్నిశమ్ము లావనమున శ్రమి
    యించిన ఫల మిదియె యింపుగాను
    పూలమొక్కలచట భూరిగన్ బెరుగ ప్ర
    క్క వనమున విరులు వికాసమందె.


    భవనము చెంతనున్న నొక వారటమందున బావి త్రవ్వగా
    సవము సమృద్ధిగన్ గలుగ శ్రద్ధను జూపుచు క్షేత్రజీవుడే
    యవిరల సేవజేయ నట యద్భుతమౌ ఫలితంబు దక్క ప్ర
    క్క వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో.

    రిప్లయితొలగించండి
  9. భవనమందునిలువ భామిని నిరసింప
    వనమునందునుంచె దనుజవిభుడు
    సీత రాకతోడ చిత్రంబుగానశో
    క వనమున విరులు వికాసమందె

    భవనమునందు నుండుటకు భామిని సీతనిరాకరించగా
    చివరకు నుంచినాడుగద సీతను చక్కని వృక్ష వాటిలో
    నవనిజ రాకతో మురిసెనావన మంతయుఁ దత్క్షణంబశో
    క వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె:ఏల నమ్మ సీత యీ చింత? మా యశో
    కవనమున విరులు వికాసమందె
    రావణప్రభువును రంజిల్ల జేయు మీ
    పూల దాల్చి యనెను పొలతి యొకతె.

    రిప్లయితొలగించండి
  11. చం:కవివర నీ ప్రబంధమున కమ్మని వర్ణన లెన్నొ యుండె,ద
    త్కవనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో”
    అవి రచియింప నీ కవన మందున మాలల నెంచ కూడ నా
    చవి గల పద్య రాసులనె చంపకవర్ణన యొక్క టుండెనే!
    (ఓ కవీశ్వరా! నీ కవనం లో పూలని వర్ణిస్తూ చంపకోత్పలమాలల లోనే వర్ణించావు కానీ అసలు చంపక పుష్పాన్ని వర్ణించ లేదే!)

    రిప్లయితొలగించండి
  12. పూల మొక్క లున్న పూ దోట యందున
    పరిమళ ములు నింపి పరిఢ విల్లి
    రక రకము లగు చును రాణించు నట్టి యొ
    క వనమున విరులు వి కాస మందె

    రిప్లయితొలగించండి
  13. పాదపమ్ము వోలె నాదరమ్మున నిల్చి
    కవి వరుండొకండు కవిత నుడువఁ
    బండిత జన భర సభా వనమున రమ్య
    కవనమున విరులు వికాస మందె


    నవ మృదు పల్లవమ్ములు కనంబడ వంగఁగ వృక్ష రాశి యం
    త విరివి పండ్ల భారమున దర్శన మాత్రమునన్ సమస్త మా
    నవ తతి కెచ్చ నత్తఱి మనమ్ముల సంతస మంబరమ్ముఁ దాఁ
    క వనమునన్ వికాసమునుఁ గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో

    రిప్లయితొలగించండి