19, జులై 2025, శనివారం

సమస్య - 5187

20-7-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శరముఁ గనిన జింక సంతసించె”

(లేదా...)

“శరమునుఁ గాంచి జింక గడు సంతసమందుచుఁ జేరెఁ జెంగటన్”

21 కామెంట్‌లు:

  1. చ.
    వర గుణ భర్మ భూషణ విభాతతి యొప్పగ నిందు వోలె నో
    సిరిగ వరూధునీ విభవ సింధుర వద్గమనంబు మీఱె న
    ప్డు రయమె చిత్తమందు ద్విజ పుంగవు భావన నాటె నంగజో
    చ్ఛరమును, గాంచి జింక కడు సంతసమందుచు జేరెఁ జెంగటన్ !

    రిప్లయితొలగించండి
  2. సంచరించు పథము చక్కనిదేనని
    తలచి హరిణమొకటిదారితప్పి
    దుఃఖమలముకొనగ దూపిల్లు వేళ వే
    శరముఁ గనిన జింక సంతసించె

    హరిణపు డింభమొక్కటి మహావనిలో తనదారితప్పగా
    సరియగు దిక్కుతోచక విచారము నొందుచునున్న వేళలో
    దొరికెను మిత్రుడంచు తన తోడుగ చక్కని చారలున్న వే
    శరమునుఁ గాంచి జింక గడు సంతసమందుచుఁ జేరెఁ జెంగటన్

    [వేశరము = కంచర గాడిద]

    రిప్లయితొలగించండి
  3. సికత చేరినట్టి సింధువు తీరాన
    తృణము కొరకు మృగము తిరిగి యలసి
    నట్టితరుణమందు నావంత దూరాన
    శరముఁ గనిన జింక సంతసించె.

    *(శరము= రెల్లు తృణ విశేషము)*


    అరుణగభస్తి తూర్పుదెస నంకుర మందక పూర్వమే యటన్
    పరుగులతోడ చేరినది పచ్చిక గోరి జిఘత్సతోడ ప్రాం
    తరమున మేయగా దలచి, దవ్వున నున్న పొలమ్ము నందునన్
    శరమునుఁ గాంచి జింక గడు సంతసమందుచుఁ జేరెఁ జెంగటన్.

    రిప్లయితొలగించండి

  4. మండు టెండ లోన మసలుచు నుండగ
    దప్పి నొంది నట్టి తరుణమందు
    చెంతన కనబడిన చెరువునందున నున్న
    శరముఁ గనిన జింక సంతసించె

    రిప్లయితొలగించండి
  5. మండువేసవి దినమందున కానలో
    దప్పిగొన్న జింక దరికి జేరి
    మునికుమారుఁడొకఁడు గొనిరాగ నుదకము
    శరముఁ గనిన జింక సంతసించె

    రిప్లయితొలగించండి
  6. కరువలివారువమ్మొకటి కాననమందున సంచరించుచున్
    చిరుతను గాంచి బీతుగొనె, చెంగున దూకుచు పర్వులెత్తు నా
    తురతను డస్సి దప్పిఁగొని తోయముకై వెదుకాడునంతటన్
    శరమునుఁ గాంచి జింక గడు సంతసమందుచుఁ జేరెఁ జెంగటన్

    రిప్లయితొలగించండి
  7. మాయ లేడి యైన మారీచు దరుము చు
    రామ చంద్రు డపుడు రయము మీర
    ధనువు నెక్కు బెట్టి దానవు నే య o గ
    శరము గనగ జింక సంత సించె

    రిప్లయితొలగించండి
  8. ఆ.వె:తనకు జావు రావణుని చేత గాక రా
    ముని శరముల ననుచు,తనను జేరు
    రామచంద్రు,నతని రంగైన వింటిని
    శరముఁ గనిన జింక సంతసించె”

    రిప్లయితొలగించండి
  9. చం:బిరబిర పిల్ల లేడి తన వేగము నందున దల్లి లేడికిన్
    గురుతర దూర మేగె,కడు గుందుచు దల్లిని దల్చి యా వనాం
    తరమున నెచ్చటో తనకు దల్లివలెన్ గనుపించ నొక్క వే
    శరమునుఁ గాంచి జింక గడు సంతసమందుచుఁ జేరెఁ జెంగటన్”
    (పిల్ల లేడి బాల్యచాపలం తో పరుగులు పెట్టి తల్లి లేడికి దూర మైంది.ఎక్కడో దూరం గా ఒక కంచర గాడిద కనిపిస్తే తల్లి అని భ్రమ పడి దగ్గరికి పోయింది.)

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది
    పుణ్యమైన చావుఁ బూని మారీచుడు
    సీత మనసు పడెడు జింకయయ్యె
    కూల్చనెంచి రాము కోదండమున్ వీడు
    శరముఁ గనిన జింక సంతసించె!

    చంపకమాల
    మరణము పుణ్యమై పరగు మర్మమెఱుంగుచుఁ దాటకాత్మజుం
    డరయుచు రామమూర్తి కరమందున జావును సీతమెచ్చెడున్
    హరిణము వోలుచున్ మెదలి యంబుజనేత్రుని విల్లువీడెడున్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మండుటెండ లోన నెండిపోవగ నోరు
    తిరిగి తిరిగి జలము కొఱకు జింక
    యలసి పోయి యప్పు డల్లంత దూరాన
    శరముఁ గనిన జింక సంతసించె.
    (శరము= జలము)

    రిప్లయితొలగించండి
  12. (3)ఆ.వె:జింక కన్న లున్న చిన్నది మోసగా
    డైన ప్రియుని నమ్మె, యతని నుండి
    ప్రేమ లేఖ యనెడు వింతయౌ మన్మథ
    శరముఁ గనిన జింక సంతసించె
    (ప్రియుడు మోసగాడు.వాడి లేఖ శరమే.ఈ ఆడపిల్ల అనే జింక సంతసించింది.)

    రిప్లయితొలగించండి
  13. బోయ వాఁడొకండు పొదల మాటున నుండి
    పొంచి పొంచి చూచి మించి వేయ
    వెన్నుఁ బన్ని గుఱిగఁ దన్ను దాఁకని యట్టి
    శరముఁ గనిన జింక సంతసించె

    [శరము = బాణము]


    తిరుగుచు దారుణాటవిని దీనత నొక్కెడ దారి తప్పి తో
    డరయక మందలో నొకటి నాఁకలి వేఁగుచుఁ బ్రజ్వలత్తృషా
    చిర పరితప్త చిత్తమునఁ జేరువ నొక్క ధరాధరస్రవ
    చ్ఛరమునుఁ గాంచి జింక గడు సంతస మందుచుఁ జేరెఁ జెంగటన్

    [స్రవత్+ శరము = స్రవచ్ఛరము; శరము =జలము]

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    శరమునుఁ గాంచి జింక గడు సంతసమందుచుఁ జేరెఁ జెంగటన్!

    చం.మా :

    తరుణముఁజూచి వేచె వట దాపుల కైకసి సూను నాజ్ఞచే
    చిరుచిరు నడ్కలం దిరిగె సీతయు గాంచగ హేమవర్ణియై
    మరణముఁ గోరి రాము కరమందున మేలని యాతడెక్కిడన్
    శరమునుఁ గాంచి జింక గడు సంతసమందుచుఁ జేరెఁ జెంగటన్!

    రిప్లయితొలగించండి