25, జులై 2025, శుక్రవారం

సమస్య - 5193

26-7-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ”

(లేదా...)

“కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ” 

17 కామెంట్‌లు:

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
ప్రేముడిఁ జంద్రుఁ బోలు ముఖ లీలల నబ్బురమంది చూచి త
త్కామ శరంబుచే మదిని గాయము నొందిన పెన్విటుండు నా
రీమణి నింపుగా వలచి రిక్కలు మించగఁ బిల్చెనిట్లు "హే
కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ !"

Sitharamayya Solasa చెప్పారు...

ఏమనుచు బిలువమందువు
కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ
ఆమని మొదలయ్యెనుగద 
నీమము దప్పని విధముగ నికటకు రావా!

విరించి చెప్పారు...


భామకు పర్యాయ పదము
లేమిటొ వివరింపమనుచు నిష్యుడడుగగా
నా మాణవకుడు తెలిపెను
కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ.


ఏమి పదమ్ములో తెలుపు మింతికి తుల్య పదంబులంచనన్
శ్రీమతి మందహాసమున చెప్పెను చెల్వున కిట్లు వెంటనే
తామరకంటి తోయలి నితంబిని పైదలి సద్యుపాస్యయున్
గోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

ఏమని చెప్పగా వలయు నీధర
స్త్రీలను గౌరవంబుగా
"కోమలి వారిజాక్షి సఖి కొమ్మ
తలోదరి నారి భామినీ"
తామర కంటియంచునతి తాల్మని
పిల్చుదు రెల్ల మానవుల్
ఈమహి భారతావనిని యింతులు
గేహపు లక్ష్ములే కదా.

M.B.G.TILAK చెప్పారు...

శ్రీమతివై నా మదిలో
ప్రేమను నింపిన గృహిణివి ప్రియమారగ ని
న్నేమని పిలిచెదనో గద
కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ!

శ్రీమతివై నిరంతరము చెంతను నిల్చిన చారులోచనా!
ధీమతివై సదా బ్రతుకు తియ్యగ మార్చిన పల్లవాధరా!
ప్రేమను పంచినావుగద ప్రేయసి నిన్నిక నెట్లు పిల్తునో
కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ!

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నామదిలో నీతలఁపే
భామరొ నిను వలచినాడ పర్వేందుముఖీ
వామనయన లోలాక్షీ
కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నామది నిండె నీ తలఁపు నా కనుపాపల నీదు రూపమే
భామరొ నీదు సంగడిని బాయక నిల్పెద నెల్లకాలమున్
నీమముతోడ నిన్నెపుడు నిక్కపు యర్మిలి జూచుకొందునో
కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

(ఇలాంటి వారు అరుదు. కాని ఉండక పోరనే ఆశతో)

కం॥ ప్రేమగఁ బిల్లలఁ బెంచెనె
నేమము వీడక చరించె నిరతముఁ దోడై
యేమని పిల్వగఁ దగునో
కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ

ఉ॥ నేమముఁ గాంచి కష్టముల నిత్యము సైఁచెనె తోడునీడగన్
బ్రేమము మీరవర్తిలుచుఁ బిల్లలఁ బెంచెనె మాతృమూర్తియై
యేమని పిల్వగన్ దగునొ యెప్పుడు వీడని స్నేహశీలినిన్
గోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

శ్రీమతి ప్రా ణే శ్వరి యై
భామ గ లాలించు చుండ పరమానంద o
బై మగడు బిలి చె నామెను
కోమలి జలజా క్షి సకియ కొమ్మ లతాంగీ!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఏ మాత్రము సిగ్గూనక
పో మగువలఁ గనిన నిత్యము పలవరించుం
గామాతురుఁ డిబ్భంగినిఁ
గోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ


నీ మెయి చాల కోమలము నీ కను లందము లొల్కు పూవులే
నా మది దోఁచితీ వడరి నా పర మాశ్రయ శాఖ వీవు నే
నే మెయి గాంతు నీ యుదర మీ విల దేవత వల్గు దాటలం
గోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
శేముషి గల్గిన కవివట
యేమగు పర్యాపదములు నింతికటంచున్
భామామణియడుగ నుడివె,
"కోమలి, జలజాక్షి, సకియ, కొమ్మ, లతాంగీ!"

ఉత్పలమాల
శేముషి గల్గువాడవను చిత్తమునందున నమ్మినానొకో!
యేమని స్రీని పిల్వదగు నింపగు పేర్లని చెప్పుమంచనన్
రామను ప్రేమగా గనుచు రంజిల బల్కె కవీంద్రుడిట్టులన్,
"కోమలి, వారిజాక్షి, సఖి, కొమ్మ, తలోదరి, నారి, భామినీ!"

BMahalakshmi చెప్పారు...

Chalabagundi

BMahalakshmi చెప్పారు...

బాగుంది

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

శ్రీమతిగా వచ్చితివిట
ప్రేమగ నా మన సెఱిగిన ప్రియసతి వీవే
యేమని పిలువను భామా!
కోమలి,జలజాక్షి,సకియ,కొమ్మ, లతాంగీ!

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ”

ఉత్పలమాల:

సేమ మడుంగ వచ్చితివి చేరియు రుక్మిణి పూవులిచ్చియే
నీమపు ప్రేమనాది మరి నెయ్యపు ప్రేయసి వంచు వేడుచో
భామయు ప్రీతి నాకనుచు బల్ విధముల్ నను బిల్తువేలకో
కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ”

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

భామా రమ్మా దరికిటు
ప్రేమగ నీకొరకటంచు వేడుకతోనే
గోముగ తెచ్చితి నమ్ముము
*“కోమలి జలజాక్షి సకియ కొమ్మ లతాంగీ.


భామిని యేలయీయలుకపారిజ పుష్పముకాదువృక్షమున్
ప్రేమగతెచ్చియిచ్చెదనువీడుముకోపమురమ్మువేగమే
నీమదిలోనిభావమునునెయ్యపు కిన్కనెరింగితోచెలీ
*“కోమలి వారిజాక్షి సఖి కొమ్మ తలోదరి నారి భామినీ”*