28, జులై 2025, సోమవారం

సమస్య - 5196

29-7-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఊరక శబ్దములఁ బేర్చ నొగి పద్యమగున్”

(లేదా...)

“ఊరక శబ్దగుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్”

13 కామెంట్‌లు:

  1. కందం
    నేరిచి ఛందము, భావము
    గూర నలంకృతులఁ దీర్చి కొంగ్రొత్త లయన్
    ధారనొలికి, వ్యర్థార్థము
    లూరక, శబ్దములఁ బేర్చ నొగి పద్యమగున్

    ఉత్పలమాల
    నేరిచి ఛందమున్ జెలఁగి నేర్పు ఫలించెడు భావమాధురుల్
    గూర నలంకృతుల్ మెరయఁ గ్రొత్త దనంబున సొంపునింపుచున్
    ధార నదీ ప్రవాహముగ ధన్యము సేయగ, వ్యర్థపాదమే
    యూరక, శబ్దగుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్!

    రిప్లయితొలగించండి
  2. ఉ.
    హీర సమోజ్జ్వలాంగ యుత హేమ విభూషిత పూజ్య శారదా
    పూరిత‌ మంజుల ప్రకృపఁ బూర్తిగఁ గల్గిన కావ్యతార్యులన్
    సూరి వరేణ్యులం బలుక సొంపగు బుద్ధిని పూని శక్తితో
    నూరక శబ్దగుచ్ఛముల నొక్కడఁ గూర్చిన పద్యమే యగున్ !

    రిప్లయితొలగించండి
  3. వారుణి గ్రోలిన మూర్ఖుడు
    ధారుణి గనమేటి కవయితనటంచు నటన్
    సారంబించుక నుండని
    యూరక శబ్దములఁ బేర్చ నొగి పద్యమగున్?


    వారుణి గ్రోలి సూరినని పామరు డొక్కడు మెప్పు కోసమై
    సారము లేని వ్యర్థ పద జాలము లెన్నియొ పేర్చి కూర్చుచున్
    ధీరకవీంద్ర పుంగవుడ తెన్గు ధరీత్రికటంచు చెప్పగా
    నూరక శబ్దగుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్?

    రిప్లయితొలగించండి
  4. కోరిక దీర్చుకొన దలచి
    ఊరక శబ్దములఁ బేర్చ , నొగి పద్యమగున్
    ఘోర గణభంగము జరిగి 
    చేరును వేగముగ నచటి చెత్తల కుప్పన్

    రిప్లయితొలగించండి
  5. తీరుగ పదజాలమ్ముల
    నేరిచి కూరిచి కదంబమేర్పడగను, ని
    స్సార పదములను జేర్చక
    నూరక, శబ్దములఁ బేర్చ నొగి పద్యమగున్

    రిప్లయితొలగించండి
  6. నేరుపు కలిగిన కవులకు
    ప్రేరణ లభియించినపుడు వెల్వడు కైతల్
    శారద కటాక్షమువలన
    నూరక శబ్దములఁ బేర్చ నొగి పద్యమగున్

    ప్రేరణకల్గినప్డు కవి వేగముగాసృజియించుఁ బద్యముల్
    నేరుపుకాడు చెప్పుగద నిక్కముగా కృతి సత్వరంబునన్
    వేఱిడియైన మానిసికి విద్దెల తల్లికటాక్ష మైనచో
    నూరక శబ్దగుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్

    రిప్లయితొలగించండి
  7. కూరిమితో గణమ్ములను కూరిచి భావము మేళవించి ని
    స్సారపదమ్ములన్ వదలి చక్కని పద్యముఁ గూర్చ నెమ్మియౌ
    చేరికకాని శబ్దముల జేరిచి యొక్కొక పాదమందునం
    దూరక శబ్దగుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్?

    రిప్లయితొలగించండి
  8. కం:"ఏరా!బాగున్నావా!
    రారా మా యింటి దాక!రానే రావే!
    నీ రాజ్య మేమి పో"దని
    ఊరక శబ్దములఁ బేర్చ నొగి పద్యమగున్

    రిప్లయితొలగించండి
  9. ఉ:పోరికి బుద్ధి లేదు,సరిపోదట దీనికి బ్యాంకు నౌకరీ
    తేరగ నున్న దేమొ యిక దీనిని మేపగ సాఫ్టు వేరు , నా
    కూరకె సొల్లు జెప్పు,నని యొక్కతె గూర్చి వచింతు నట్టులే
    ఊరక శబ్దగుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్”
    (మనం మాట్లాడే మామూలు మాటల తో పద్యం ఎలా అవుతుందో చెప్పటం ద్వారా సమస్యని సమర్ధించే ప్రయత్నం.)

    రిప్లయితొలగించండి
  10. ధార గ కవిత ల నల్లె డి
    కోరిక జనియించి నంత కొంక క నతడా
    సారము లేనట్టి విధపు
    టూ రక శబ్దములు బేర్చ నొగి పద్య మగున్

    రిప్లయితొలగించండి
  11. చారుతరము పాదమ్మున
    నౌర జనింపంగఁ బద్య మందురు విబుధుల్
    వారక పాదం బేర్పడ
    నూరక శబ్దములఁ బేర్వ నొగిఁ బద్య మగున్


    ఊరక వచ్చునే కవుల కుర్విఁ గవిత్వ పటుత్వ సంపదల్
    చారుతరమ్ము సాధనము చాల యొనర్పక కాన నీవు వే
    సారకు మయ్య ప్రాస యతి ఛందపు భావపు దోష ధారలే
    యూరక శబ్ద గుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్

    [ఊరు = వెలువడు]

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నేరిచి ఛందస్సు మిగుల
    కోరుచు సరియగు గణములు కూరిచి
    వ్రాయన్
    సారము గల పద్యమదియె
    యూరక శబ్దములఁ బేర్చ నొగి పద్యమగున్?

    రిప్లయితొలగించండి
  13. తీరుగ యతులను ప్రాసల
    కూరిమి తోడను సతతము కూర్చుచు వ్రాయన్
    కోర గురుకరుణనపుడే
    నూరక శబ్దములు పేర్చ నొగి పద్యమగున్.


    దారిని చూపుచున్ గురువు తాననురాగముతోడనేర్పగన్
    తీరుగనేర్చుచున్ సతము తేనెలవంటిపదమ్ములిమ్ముగా
    సారమెరుంగుచున్ మదిని చక్కగ యోచన చేసినంతనే
    *“ఊరక శబ్దగుచ్ఛముల నొక్కెడఁ గూర్చినఁ బద్యమే యగున్”*

    రిప్లయితొలగించండి