29, జులై 2025, మంగళవారం

సమస్య - 5197

30-7-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్”

(లేదా...)

“ధనికుల్ వొంద సమర్థులౌదురు పరార్థంబైన మోక్షాధ్వమున్”

13 కామెంట్‌లు:


  1. అనకూడని మాటల నిట
    ఘనులు పలుకుటతగదంటి గద కాశీకే
    గినవారికె నిర్వృతి యన
    ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్.


    విని చింతించితి నార్య మీ నుడులనే విన్నాణి వంచున్ గదా
    జనులే నమ్మిరి మిమ్ము సద్గతులకై సన్మార్గమున్ దెల్పకన్
    జనియా కాశికి గంగలోన మునుగన్ సంసిద్ధి ప్రాప్తించనన్
    ధనికుల్ వొంద సమర్థులౌదురు పరార్థంబైన మోక్షాధ్వమున్.

    రిప్లయితొలగించండి
  2. మ.
    వినయాలంకృత మానసాంబుజ లసద్విస్ఫార విశ్వేశ భ
    క్తి నిజైశ్వర్యము సేత భక్త వితతుల్ కీర్తిన్ విశిష్టంబుగాఁ
    జను నీ యుర్విని, సంశయమ్ము విడు పంచార్ణమ్ములం గల్గు పె
    న్ధనికుల్ వొంద సమర్థులౌదురు పరార్థంబైన మోక్షాధ్వమున్ !

    రిప్లయితొలగించండి
  3. కందం
    మునిపుంగవులై నిత్యము
    సనాతనపు ధర్మమిలను సంరక్షింపన్
    గొనసాగ వారికూతము
    ధనికులె, పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్!

    మత్తేభవిక్రీడితము
    మునులై నేడు సనాతనమ్మనెడు సంపూర్ణంపు ధర్మమ్మిలన్
    మనగన్ జాతికి శ్రేయమంచునదె సన్మార్గంబుగా జూపఁగన్
    గొనసాగంగను వారి కూతమగుచున్ గూర్మిన్ సహాయంబిడన్
    ధనికుల్ వొంద సమర్థులౌదురు పరార్థంబైన మోక్షాధ్వమున్!

    రిప్లయితొలగించండి
  4. మనసు పడిన కారణమున
    తనివోవగ నక్షరమును దర్శించుటకై
    ధనమును కోరాడుట గన
    ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్

    రిప్లయితొలగించండి
  5. ధనమనిన పుణ్య ధనమే
    మునివర్యులు సల్పు తపము మోక్షము కొరకే
    అనయము పుణ్యార్జనులౌ
    ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్

    ధనికుల్ వొందగలుంగు మోక్షమనగా తాపత్రయంబేలరా
    మునివర్యుల్ నిరపేక్ష పుణ్యధనులే మోక్షార్హతన్ బొందరే
    మనచర్యల్ నిరతంబు చూపుగద సన్మార్గమ్ము పుణ్యాత్ములౌ
    ధనికుల్ వొంద సమర్థులౌదురు పరార్థంబైన మోక్షాధ్వమున్

    రిప్లయితొలగించండి
  6. అనిశము దైవధ్యానము
    ధనహీనుల నాదుకొను నుదారత్వమ్మున్
    పెనఁగొని సద్గుణములలో
    ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్

    రిప్లయితొలగించండి
  7. అనిశమ్మున్ పరమాత్ము చింతనమునందాశంస చూపించి ని
    ర్ధనులన్ దీనుల కష్ట నష్టముల నౌదార్యమ్ముతో గాఁచు స
    ద్గుణసంపన్నులు ధన్యులీ జగతి నస్తోకంపు సద్భావనన్
    ధనికుల్ వొంద సమర్థులౌదురు పరార్థంబైన మోక్షాధ్వమున్

    రిప్లయితొలగించండి
  8. కం;ధన మెంత యున్న ఘనమా?
    ధనమును వెచ్చించ కొంత ధర్మార్థమ్మున్
    తిన నొసగ పేదలకు నా
    ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్

    రిప్లయితొలగించండి
  9. మ:"ధనమే యేల?" నటంచు బల్కకుము మిథ్యా తత్త్వమున్ జెప్పి నా
    యన! యీ స్వాముల సాన్నిహిత్యమును భాగ్య మ్మున్న నే గల్గు,సొ
    మ్మును పాపమ్మున బొంద వద్దు, ఋషులన్ బోషించు ధర్మాత్ములౌ
    ధనికుల్ వొంద సమర్థులౌదురు పరార్థంబైన మోక్షాధ్వమున్”
    ("డబ్బెందుకు అంటూ మెట్ట వేదాంతం మాట్లాడకు.ఈ రోజుల్లో స్వామీజీల సాన్నిహిత్యం పొందా లన్నా ధనవంతులకే అవకాశం ఎక్కువ.కనుక పాపం చేయకుండా ధనం సంపాదించి దానితో ఋషులని పోషించు.అలా చేసినా నువ్వు మోక్షసాధనకి అర్హుడివే అవుతా "వని తండ్రి తన కొడుకు తో అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  10. మునులకు భక్తియె ధనమగు
    నని శ ము ధ్యా నము న వార లారా ధన తో
    ఘన భక్తి సంపద కలుగు
    ధనికు లె పొందంగ గలరు దగ మోక్ష మ్ము న్

    రిప్లయితొలగించండి
  11. కం॥ మనమన భక్తి చెదరకన్
    జనులకు సాయమొనరించు సద్గుణపు ధృతిన్
    వినయము సద్వర్తననిల
    ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్

    మ॥ కన సామాన్యులు భక్తి తత్పరులు దీక్షాదక్షతా శీలులున్
    మనుచున్ నిష్ఠను వీడ కుండఁగను సన్మానించి సేవావిధిన్
    జనుచున్ సాయముఁ జేయు వారలగు నిస్స్వార్థమ్ము సద్వర్తనన్
    ధనికుల్ వొంద సమర్థులౌదురు పరార్థంబైన మోక్షాధ్యమున్

    రిప్లయితొలగించండి
  12. వనజాక్ష పదాబ్జాంకిత
    మనుజోత్తమ భక్త గణము మరణాంతమునన్
    ఘన వైరాగ్యాహ్వయ ధన
    ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్


    అనయం బిద్ధర భక్తి యుక్తముగ సాష్టాంగప్రణామమ్ములన్
    వినయం బొప్పఁగఁ బూజ సేయు నరులున్ విశ్వేశ పాదాబ్జ చిం
    తన సంలగ్న నిజాంతరంగులును నాత్మజ్ఞాన సంపన్ను లా
    ధనికుల్ వొంద సమర్థు లౌదురు పరార్థం బైన మోక్షాధ్వమున్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అనుదినము దేవుని గొలిచి
    ననయము నాధ్యాత్మికమగు నాలోచనలన్
    మనమున తలచెడు పేదలు,
    ధనికులె పొందంగఁ గలరు దగ మోక్షమ్మున్.

    రిప్లయితొలగించండి