10, ఫిబ్రవరి 2026, మంగళవారం

సమస్య - 5378

11-2-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”
(లేదా...)
“పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్”

5 కామెంట్‌లు:

  1. కందం
    కరకైన బోయ రాముని
    చరితము రచియించె నాది సత్కవియగుచున్
    బరమాత్మ కృపన్ గల్గినఁ
    బరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్

    మత్తేభవిక్రీడితము
    కరకౌ వేటరి వ్రాసె నాది కవిగన్ కావ్యమ్ము రామాయణం
    బరయన్ దారక నామ మంత్ర మెకటే వల్లించి పల్మారులున్
    గరుణాసింధువు రామమూర్తి వరముల్ గల్గంగ చిత్రమ్ముగన్
    బరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్!

    రిప్లయితొలగించండి
  2. పరమమను నమ్మకుండిన
    గరాసుడైనను బ్రతుకున కడమకు జేరన్
    విరివిగ కష్టములబడయ
    పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”

    రిప్లయితొలగించండి

  3. హరభక్తుడు తిన్నడు స
    ర్వరసుడతడు కాదు చూడ పామరుడైనన్
    స్థిరమును పొందిన కథ విన
    పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్.


    పిరిమిన్ మాంసము ఫాలనేత్రునకు నైవేద్యమ్ముగా పెట్టె పా
    మరుడాతిన్నడు శంకరున్ గొలువ నేమంత్రమ్ము వాచించెనో
    ధరణిన్ తిన్నని దివ్యగాధవిని విద్యావంతుడే చెప్పెనే
    పరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్.

    రిప్లయితొలగించండి
  4. సమస్య : “పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్”

    కం. నెరి సాంఘిక మాధ్యమునను
    పరిజనతతి పరిగ్రహణము పరమావధియై
    అరకొర విజ్ఞానమునను
    పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్

    భావం : సోషల్ మీడియాలో కేవలం ఫాలోవర్లను సంపాదించుకోవడమే పరమావధిగా, అరకొర జ్ఞానంతో ఎదుటివారికి ఉపదేశాలు చేసే మూర్ఖుడు (బర్బరుడు) లోకంలో కనిపిస్తున్నాడు.

    రిప్లయితొలగించండి
  5. పరమేశా వరమొసగుము
    సరిపోదీ ముల్లె లేదు సంతర్పణమే
    పరమార్థమనగ ధనమే
    పరమార్థజ్ఞాన మొసఁగు బర్బరుఁడు దగన్

    పరమేశా వరమిమ్ము విత్తమును సంపాదించి పొంగారగా
    సరిపోదెంత గడించినన్ మనసులో స్వార్థంబు కాలూనగా
    పరమార్థమ్మన నొప్పు కేవలము ద్రవ్యంబే విచారించినన్
    బరమార్థంబునుఁ దెల్పు జ్ఞానమునుఁ జెప్పం జాలు మూఢుం డొగిన్

    రిప్లయితొలగించండి