5, ఫిబ్రవరి 2026, గురువారం

సమస్య - 5373

 6-2-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా”
(లేదా...)
“కుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్”

4 కామెంట్‌లు:

  1. పద్మవ్యూహములో పాల్గొన్న కౌరవ సైన్యములో గుసగుసలు....


    కందం
    ఎక్కడి యభిమన్యుఁడితఁడు!
    త్రొక్కెను కరివోలె కదను త్రుంచె శిరములన్!
    మ్రొక్కి హరిఁ జెలఁగు నరుఁడన్
    గుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా!

    ఉత్పలమాల
    మ్రక్కిడ సేనలెల్ల నభిమన్యుఁడొకండె మహోధృతమ్ముగన్
    ద్రొక్కెఁ గరేణువై కదను త్రుంచె శిరమ్ముల భీకరమ్ముగన్!
    మ్రొక్కుచు కృష్ణునిన్ జెలఁగఁ బూనెడు బంటుగ నొప్పు క్రీడియన్
    గుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్!

    రిప్లయితొలగించండి
  2. నొక్కిన తెరచుకొను బొమల
    డొక్కల నుండి పతిమలు పడునటుల జేయన్
    మక్కువగ నొకటి నదుమగ
    కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా

    రిప్లయితొలగించండి

  3. చక్కని దినగుణముతో
    మిక్కిలి కీర్తిని గడింప మేదిని యందున్
    పెక్కురనిరి సూతుడనే
    కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా.


    ఒక్కడు వాడు గాంచగ మహోన్నత దానగుణమ్ముచే గదా

    మిక్కిలి పేరుగాంచెనని మెచ్చి నుతించిరి నాడు శిష్టులౌ

    పెక్కురులివ్విధిన్ గనగ పేదనిషంగద సూతుడైన యా

    కుక్కకుఁ బుట్టెనంట యొక కుంజర మెల్లరుఁ జూడ వింతగన్.

    రిప్లయితొలగించండి
  4. అక్కజములెన్నొ కలిలో
    మిక్కుటముగ సంభవించు మేదిని యందున్
    చొక్కవరము గ్రామములో
    కుక్కకు జన్మించె నొక్క కుంజర మహహా

    రిప్లయితొలగించండి