25, ఫిబ్రవరి 2026, బుధవారం

సమస్య - 5392

26-2-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సులభ మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ”
(లేదా...)
“కడున్ సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే”

(ఛందోగోపనము) 

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    రామచరిత పాండవ గాథ రంగరింప
    ద్వ్యర్థి కావ్యమ్ము వెలుగొందె! వ్యాకరణము
    మేటి పదసంపద గలుగ మీకు సులభ
    మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ

    చంపకమాల
    తెలియుచు రామగాథ పరిధిన్ మరి పంచమవేద సార మా
    వల పదసంపదన్ మిగుల వ్యాకరణాంశపు జ్ఞానదీప్తిమై
    గలిమిగ ద్వ్యర్థి కావ్యమదె కల్గఁగ నిష్ఠ తలిర్పఁగన్ గడున్
    సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే

    రిప్లయితొలగించండి
  2. రక రకముల కవితల రచన జేసి ,
    రాముని కథతోపాటు భారతము గూర్చు
    పింగళి విరచిత కవిత బెడగు సులభ
    మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ

    రిప్లయితొలగించండి

  3. కఠిన తరమని పించెడి కావ్యమంచు
    పలుక నేలర యిదికాంచ వసుధయందు
    సంస్కృతాంధ్ర పండితులకున్ జాల సులభ
    మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ.


    లలిత పదమ్ములందు కనరావని చింతయదేల చూడగా
    విలసిత మౌ పదమ్ములవి విజ్ఞులు మెచ్చెడి సంస్కృతమ్ముతో
    తెలుగున పాటవమ్ముగల ధీమతులే పఠియించినన్ కడున్
    సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే.

    రిప్లయితొలగించండి
  4. శ్లేష విశ్లేషకులు విప్పిచెప్పు చుండ
    రెండు రీతుల ధ్వనియించు చుండు గాదె!
    వివరణాత్మక ప్రచురణ వెలయ సులభ
    మగును రాఘవపాండవీయమ్ముఁ జదువ

    తెలిసిన రామగాథ మరి తిక్కన భారతమే సదా మనో
    ఫలకము పైన నుండుగద పాఠకులెల్ల మహాద్భుతంబనన్
    బలువురు పండితోత్తములు భావమునే వివరింపగా కడున్
    సులభముగానె యర్థమగు సూరన రాఘవపాండవీయమే

    రిప్లయితొలగించండి