20, ఫిబ్రవరి 2026, శుక్రవారం

సమస్య - 5387

21-2-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్”
(లేదా...)
“అండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్”

6 కామెంట్‌లు:

  1. కందం
    దండమువెట్టుచుఁ బూజలు
    గండడు సంక్రాంతి కెంచ కరివరదునకున్
    పండుగ దినమంచున్ గూ
    ష్మాండమ్మను నైష్ఠికునకు నంగన వండెన్

    రిప్లయితొలగించండి
  2. పండుగ దినమని భర్తకు
    నిండైన మనంబుతోడ నిర్మల మతితో
    కొండంత ప్రేమతో కు
    ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.

    రిప్లయితొలగించండి

  3. ఎండాకాలంబు ధరలు
    దండిగ గలవంచు మిగుల దావంతముతో
    భాండము దాచుకొనిన కూ
    ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్.


    ఎండలు మెండుగా కురియ నెక్కడ గాంచిన గూరగాయలే
    దండి నిమానమంచు కొన తాహతు లేక విచారమందుచున్
    బండము లుంచినట్టి యొక భాండము నందు లభించినట్టి కూ
    ష్మాండము వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్.

    రిప్లయితొలగించండి
  4. పండుగ నాడరుదెంచగ
    నఃడమ్మును నైష్ఠికునకు నంగన వండెన్ ,
    మెండగు నాకలినొందగ
    దండిగ దానిని భుజించె దనివోవంగా

    రిప్లయితొలగించండి
  5. మెండుగ శ్రమపడి చేరఁగ
    దండిగ రూప్యములనుగొని తన గీమునకున్
    పండుగ దినమున నొక కూ
    ష్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్

    రిప్లయితొలగించండి
  6. కొండొక దినమునఁ బతి బ్ర
    హ్మాండమ్మనెను పరిగృహ్య వంటకములనే
    మెండుగఁ బతి తలపుల బ్ర
    హ్మాండమ్మును నైష్ఠికునకు నంగన వండెన్

    పండుగ నాడు సేసెదను వాసన బియ్యపు వంటకంబునే
    దిండికి సాటిరానిదగు దివ్యమనోహర పక్వ మంచు తాఁ
    బండని గాయలెంచి తన వల్లభుడే రుచి చూచి తెల్ప 'బ్ర
    హ్మాండము!' వండి పెట్టె నొక యంగన నైష్ఠికుఁడైన భర్తకున్

    రిప్లయితొలగించండి