24, ఫిబ్రవరి 2026, మంగళవారం

సమస్య - 5391

25-2-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల”
(లేదా...)
“వ్రతముం జేయక వాయకనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్”

4 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వలువలొసఁగి రక్షింపఁగఁ గొలువ సతము
    నన్నకేకాదశియె ముఖ్యమనఁగఁ గృష్ణ
    ప్రీతి ముత్తైదువులఁ బిల్చి, వీడగలఁదె
    వ్రతముఁ జేయక? యిడె నాతి వాయనముల

    మత్తేభవిక్రీడితము
    వెతలంజిక్కఁగ వల్వలిచ్చి వడిగన్ వేంచేసి శ్రీకృష్ణుడున్
    సతియా ద్రౌపదిఁ గావఁగన్, హరికినుత్సాహంబు గల్గించునన్
    మతితోఁ బిల్చియుఁ దా సువాసినుల సంభావింప, వారించునే
    వ్రతముం జేయక? వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్

    రిప్లయితొలగించండి
  2. అన్య దేశము నకుపోయి యదురుగడగ ;
    చెమ్మ చెక్కల నాడిన చిన్ననాటి
    సకియ వచ్చిన కతమున చక్కటి నెరి
    వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల

    రిప్లయితొలగించండి
  3. తాను బుణ్యకవ్రతమని దానమొసగె
    నల్లనయ్యను వైదేహి నారదునికి
    పుణ్యమును గోరి నేడిట పుణ్యకమను
    వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల

    వ్రతదీక్షా నియమంబులెర్గి విధిగా బాటింప భావించుచున్
    బతినే దానము సేసె నారదునికిన్ వైదర్భి సంప్రీతినిన్
    బతిలేకున్నను పూజ సల్పునెపుడున్ బద్మాక్షి తాఁ బుణ్యక
    వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్

    రిప్లయితొలగించండి

  4. పండితులు చెప్పిరంచును వ్రతము నొకటి
    భర్త క్షేమంబు గోరుచు పడతి చేయ
    బూనినంతనె పెనిమిటి మూర్ఛబోవ
    వ్రతముఁ జేయక యిడె నాతి వాయనముల.


    పతిక్షేమంబును గోరి చేయదలచెన్ వారాహికిన్ బూజనా
    సతి శ్రావణమాసమందు విహితుల్ సద్బాంధవుల్ చూడగా
    వ్రతమారంభము జేయువేళ పతికిన్ స్వాస్థ్యంబదే పాడవన్
    వ్రతముం జేయక వాయనమ్ము లొసఁగెన్ వాల్గంటి యేకాదశిన్.

    రిప్లయితొలగించండి