9, మార్చి 2026, సోమవారం

సమస్య - 5403

10-3-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హీనుఁడే లోకమున గౌరవించఁబడును”
(లేదా...)
“హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్”
(ఆకాశవాణి వారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. తేటగీతి
    పూర్వభాషిగ రాణించి పొందెయశము
    ధర్మసంరక్షణా దీక్ష దాశరథియె
    సురుచిర దరహాస యుతుఁడు వెరశి గర్వ
    హీనుఁడే లోకమున గౌరవించఁబడును

    ఉత్పలమాల
    మానిత ధర్మవిగ్రహుడు మంజుల భాష సుధీరుఁడంచనన్
    జానకిమానసాలయుఁడు సారసనేత్రడు రామచంద్రుఁడున్
    కానలకేగ పట్టమును కాదని తండ్రిని గౌరవింపగన్
    హీనచరిత్రుఁడే? మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్

    రిప్లయితొలగించండి

  2. పుట్టి మరణింతురెందరో పుడమిపయిన ,
    గుంపునందను నిత్యము గుదురుగ దన
    జీవనంబు నందెటువంటి చెడ్డ చరిత
    హీనుఁడే లోకమున గౌరవించఁబడును

    రిప్లయితొలగించండి
  3. హీనచరితు లెపుఁడు గౌరవింపబడరు
    సచ్చరిత్రులు పూజ్యులు సంతతమ్ము
    సాధువర్తనుఁడు సకల జన హితుఁడు న
    హీనుఁడే లోకమున గౌరవించఁబడును

    రిప్లయితొలగించండి
  4. మానవులందు మాన్యులుగ మన్ననలందిన సచ్చరిత్రులున్
    దీనులపాలి దైవములు ధీయుతులై దనరారు వారు స
    న్మానములందగా నెలమి, మారెను కాలము నేడు ధూర్తుడౌ
    హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్

    రిప్లయితొలగించండి

  5. నీతి నియమమ్ము లనువీడి నేత లిలను
    జనుల వంచింప నెంచుచు ధనము బంచి
    యెన్నికలను గెలిచి నట్టి యేలిక యను
    హీనుఁడే లోకమున గౌరవించఁబడును.


    భానుని నంది వర్ధనుడు భారత మందున సూత పుత్రుడా
    హీన కులోద్భవుండనుచు నెల్లరు నవ్వుల పాలు జేసినన్
    దానగుణమ్ముతో భువిని దాతగ కీర్తి వహించె గాంచగా
    హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవ మందు చుండెడిన్.

    రిప్లయితొలగించండి
  6. కోరి జనులకు మంచి చేకూర్చు వార
    లెందరో నాడు గౌరవమందినారు
    నేడు యెన్నికై గెలిచిన నేతయనెడు
    హీనుఁడే లోకమున గౌరవించఁబడును

    కానలకేగిరాముడు సకాలము నందున లంకకేగి యా
    వానర జాతిముఖ్యుడగు పావని గౌరవమంద నేడిటన్
    హీనుడు నేతయై మిగుల హేయపు కృత్యములెల్లఁ సల్పగా
    హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్

    రిప్లయితొలగించండి
  7. తే॥ సద్గుణములొదవి సకల జనుల కాప్తుఁ
    డగుచు సాయముఁ జేయగ నాదరమున
    దుష్టత వదలి వరలెడు దురిత గుణ వి
    హీనుఁడె లోకమున గౌరవించఁ బడును

    ఉ॥ మానసమందు భక్తిఁ గని మాన్యుని వీడకఁ గొల్చు మాధవున్
    దీనుల యార్తిఁ బాపుటకుఁ దీరగు సాయము నెంచు సర్వదా
    మానిత సద్గుణమ్ములన మక్కువ దుష్టులు గాంచు దృష్టిలో
    హీన చరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందు చుండెడిన్

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:భవిత నెరిగి పురాణముల్ పలికె నిట్లు
    భూసురులు జ్ఞానదూరు లై పోగ,కలిని
    వారి గౌరవమే వారి వదలగ కుల
    హీనుఁడే లోకమున గౌరవించఁబడును”
    (కలియుగం లో బ్రాహ్మణులు పతన మౌతారని,గౌరవం పోతుందని పురాణాలు పూర్వమే చెప్పాయి. అదే జరుగుతున్నది. )

    రిప్లయితొలగించండి
  9. సుజన సంగతి మెలగుచు సుంత యైన
    బొంకు లాడని వా డౌ చు బుద్ది మంతు
    డ గుచు పరుల మే ల్గో రు వా డవ గుణ ముల
    హీను డే లోకమున గౌర వింప బడును

    రిప్లయితొలగించండి
  10. ఉ:స్థానిక నేతలన్ గనక సంతత మిందిరనో,నరేంద్రునో
    మానస మందు నిల్పి మతి మాలుక వోట్లను వేయుచుండ స
    మ్మానితు డోడు చుండు,తల మాసిన వాడును నెగ్గు, నెవ్వడో
    హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్”
    (ఢిల్లీ వైపు చూసి గల్లీ నాయకుణ్ని ఎన్నుకుంటే మంచి వాడు ఓడ వచ్చు. పనికి మాలిన వాడు గెలవ వచ్చు. )

    రిప్లయితొలగించండి
  11. మున్ను గుర్తింపఁ బడకున్న నెన్నఁ డేని
    సత్య మెఱిఁగ నట్టి జన సంచయము చేతఁ
    గల్ల లెఱుఁగ నట్టి పరోపకారి కపట
    హీనుఁడే లోకమున గౌరవింపఁబడును


    కానఁగ రాదు గౌరవము కార్య దురంధర ధైర్యశాలికిం
    గానఁగ రాదు గౌరవము కైతవ హీన మనోధినేతకున్
    మానవ లోక మందు ధన మర్మము నేరిన మాటకారియౌ
    హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవ మందుచుండెడిన్

    రిప్లయితొలగించండి
  12. దాన ధర్మ ముల్ నిరతముఁ దానుజేయ
    సంతసం బొంద మిత్రులు సాదరమునఁ
    జేయి చేతులు గలుపంగఁ జేరు గర్వ
    హీనుఁడే లోకమున గౌరవించఁబడును”

    రిప్లయితొలగించండి
  13. సమస్య: హీనుఁడే లోకమున గౌరవించఁబడును
    తే: మానుగ పరుల సేవకై పూనుకొనుచు
    కానుకలనొసంగుచు మంచి కార్యములకు
    ధ్యానమొనరించుచు హరికి నవని మను న
    హీనుడే లోకమున గౌరవించ బడును
    సమస్య: హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్ (ఆకాశవాణి వారి సమస్య)
    ఉ: గానము జేయుచున్ బగితి కైటభవైరిని చిత్తశుద్ధితో
    పూనికతోడ పేదలకు మోదము గూర్చుచు సేవనమ్ములన్
    మానుగ వెల్గి బైసిగొను మాన్యుడు పృథ్విని, నెవ్విధమ్ముగా
    హీనచరిత్రుడే మిగుల హెచ్చగు గౌరవమందు చుండెడిన్?

    రిప్లయితొలగించండి
  14. దానముఁజేయకెప్పుఁడునుధారుణియందునగొప్పదాతగా
    నానుచు నుండుచున్ననట నాయము లేదని తేటతెల్లమౌ
    కానగరాని పాట్లుపడి కాసుల మూటలు బొందఁగల్గుచో
    హీనచరిత్రుఁడే మిగుల హెచ్చగు గౌరవమందుచుండెడిన్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    భక్తితో పూజ చేయుచు ప్రతి దినంబు
    పేదలకు సాయమున్ జేసి యాదరమున
    కోట్ల ధనము కల్గిన సాత్వికుండు, గర్వ
    హీనుడే లోకమున గౌరవించఁ బడును.

    రిప్లయితొలగించండి